.
నో నో …పెళ్ళెందుకు ? ఉత్త దండుగ !
ఒక మిత్రుడు ఫోన్ చేసి…
“మా బంధువులమ్మాయి ఐఐటీలో చదివి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సంవత్సరానికి 30 లక్షల జీతంతో హాయిగా సెటిలయ్యింది. ఒకే అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ రిటైరయ్యారు. పెళ్ళి సంబంధాలు ఏవి చూసినా అమ్మాయి ఒప్పుకోవడం లేదు. నాలుగేళ్ళుగా విసిగిపోయాం. అమ్మాయికిప్పుడు 31 నిండాయి. మీ ఆర్టికల్స్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటుంది. తెలుగు సాహిత్యమంటే ఇష్టం. కర్ణాటక సంగీతమంటే అమ్మాయి చెవి కోసుకుంటుంది. మీరొకసారి మాట్లాడి… అమ్మాయిని పెళ్ళికి ఒప్పించాలి”- అన్నాడు. సరే ప్రయత్నిస్తాను అన్నాను. పరిచయం చేశాడు.
Ads
మా చిన్నాన్న మీకు పెద్దపని పెట్టినట్లున్నాడే! అని నేరుగా అసలు చర్చలోకి దిగింది. “అంకుల్! మీ హంపీ ఆర్టికల్స్ చదివి నేను బెంగళూరు నుండి హంపీ వెళ్ళి వచ్చాను…” అంటూ పెళ్ళి గురించి తప్ప మిగతా అన్నిటిగురించి చక్కటి తెలుగులో చిక్కగా, సూటిగా, స్పష్టంగా, ధారాళంగా మాట్లాడింది. మొదటి కాల్ అలా జరిగింది.
రెండో కాల్లో అలా జరగడానికి వీల్లేకుండా “నీ పెళ్ళి గురించి మాట్లాడాలి. ఒక సెలవు రోజు కనీసం గంటసేపు పనులేవీ పెట్టుకోకుండా ఫోన్ చెయ్” అని మెసేజ్ పెట్టాను. అలాగే అంకుల్ అని రిప్లయ్ ఇచ్చింది. మహా మహా రాయలసీమ ఫ్యాక్షనిస్టులే నాముందు మాట్లాడలేక నోరుమూసుకున్నారు. ఈ అమ్మాయి ఏపాటి? అనుకున్నాను.
ఆ రెండో కాల్లో తను పెళ్ళెందుకు చేసుకోదలచుకోలేదో స్పష్టంగా చెబితే వినడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. తరువాత నేనెప్పుడూ ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ చర్చ సారాంశమిది.
- అమెరికా సంబంధం అబ్బాయి బాగున్నాడు. పెళ్ళి కాగానే అమెరికాలో సెటిల్ కావాలి అన్నాడు. నువ్వే ఇండియా రావచ్చు కదా! ఇక్కడే ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా! అనగానే అబ్బాయి మాట్లాడడం మానేశాడు.
- హైదరాబాద్ సాఫ్ట్ వేర్ అబ్బాయి బాగున్నాడు. కానీ ఆ పిల్లకు సంవత్సరానికి ముప్పయ్ రెండు లక్షల జీతం- మా అబ్బాయికి సంవత్సరానికి ఆరు లక్షల జీతం సరైన మ్యాచ్ కాదు అని ఆ అబ్బాయి తల్లి అభ్యంతరపెడితే ఆ అబ్బాయి డూడూ బసవణ్ణలా తలూపి బాటా రేటులా రూపాయి తక్కువ 5,99,999/- జీతం అమ్మాయిని వెతుక్కుంటున్నాడట.
- బెంగళూరు అబ్బాయి కాశ్మీర్ యాపిల్లా చాలా బాగున్నాడు. జీతం కూడా మ్యాచ్ అయ్యింది. రాత్రిళ్ళు తాగింది అబ్బాయికి పగలు కూడా పనిచేస్తూ ఉంటుందని విచారణలో తేలిందట. ఆ మధ్య గోవాలో ‘తెల్ల పొడి’ పార్టీలో అబ్బాయి హాజరును ధ్రువపరుస్తూ సోషల్ మీడియా పోస్టులు కూడా ఉండడంతో ఇంట్లో చేసుకున్న పల్లీ పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి చాలనుకుందట.
ఇలా ఇప్పటికి పది సంబంధలయ్యాయి. ఒక్కో సంబంధాన్ని రిజెక్ట్ చేయడానికి నా కారణాలు నాకున్నాయి. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. 500 మంది సాంకేతిక నిపుణుల బృందానికి హెడ్ గా ఉన్నాను. ఇక పెళ్ళి లేదు- గిళ్ళి లేదు. మా అమ్మానాన్నకు అన్నీ నేనే- అంది.
అలా కాదమ్మా…పెళ్ళి పిల్లలు సంసారం అవసరం అని ఏదో చెప్పబోయాను. అంకుల్! నన్ను నన్నుగా గుర్తించే, గౌరవించే మనిషి కోసం చూశాను. దొరకలేదు. ఇప్పుడు దొరక్కపోయినా నష్టం లేదు. నేను అణిగి మణిగి ఉండను. నటించలేను. నన్నిలా వదిలేసేయండి. ఈసారి బెంగళూరు వస్తే చెప్పండి… మీకిష్టమైన రాయలసీమ రాగి సంకటి, ఎరగడ్డకారం దొరికే హోటల్ కు వెళదాం- అంది.
ఇదొక పెళ్లికాని లేదా పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని అమ్మాయి వెర్షన్. ఇప్పుడొక పెళ్ళి అయి… ఆ పెళ్ళి పెటాకులైన అబ్బాయి వెర్షన్ చూద్దాం.
హైదరాబాద్ లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. ముగ్గురు పిల్లలు. ఒకబ్బాయి. ఇద్దరమ్మాయిలు. అబ్బాయి చదువుల్లో మెరిక. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుని కర్నూల్లో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ లో తగిన సంబంధం వెతికి పెళ్ళి చేశారు. కొత్తకోడలు ఇంట్లోకి అడుగు పెట్టడంతో వీరికి కష్టాలు చెప్పి రావడం మొదలయ్యాయి.
రెండు నెలలు తిరక్కుండా అమ్మాయి చీర పారేసి జీన్స్ ప్యాంట్లలోకి వస్తే నగరం అమ్మాయి తప్పేముంది? అనుకున్నారు. ఒక శుభ ముహూర్తాన అమ్మాయి బుల్లెట్ నడిపితే ఆధునికం… పోనీలే అనుకున్నారు. అమ్మాయి బుల్లెట్ వెనుక ఎవరో అబ్బాయి ఉన్నప్పుడు మొదలయ్యాయి అనుమానాలు. తరువాత అమ్మాయి పబ్బులు, గబ్బుల వార్తలు విన్నారు.
నిలదీస్తే… నేనింతే అంది. తప్పు కదా! తిరుగుళ్ళు మానేయ్ అన్నారు. అబ్బాయి, అబ్బాయి అమ్మా నాన్న, బంధువులు అయిదుగురిమీద 498 ఏ గృహహింస కేసు పెట్టింది. ఆ కేసు మేము కదా పెట్టాలి… గృహంలో ఆమె హింసకు గురయ్యింది మేము. బాధితులం మేమేనంటూ అమ్మాయిగారి చంద్రముఖి మరో కోణం విశ్వరూపమిది అని కోర్టుల్లో నిరూపించుకోవడానికి అబ్బాయికి అయిదేళ్ళు పట్టింది.
పాతిక లక్షలు ఖర్చయింది. చివరికి ద్వైపాక్షిక చర్చల్లో విడాకుల ఒడంబడిక కుదిరింది. అమ్మాయి బుల్లెట్టు బండెక్కి వత్తా పా! అని రీల్స్ చేసుకుంటోంది. అబ్బాయికి కర్నూలు నుండి అన్నమయ్య జిల్లా రాజంపేటకు బదిలీ అయ్యింది.
రోజూ రాజంపేటలో అన్నమయ్య పుట్టిన తాళ్ళపాక ఊరికి దారైన సింహద్వారం మీదుగా వెళుతూ ఉంటే…”ఎన్నడూ విజ్ఞానమిక…?” అన్న అన్నమయ్య పాటే ప్రతిధ్వనిస్తోంది అంకుల్! అని ఆ అబ్బాయి భక్తి వేదాంత పెద్ద పాఠాలు చెబుతున్నాడు చిన్న వయసుకే. మళ్ళీ పెళ్ళి చేసుకో నాయనా! అంటే…”యాడ వలపు? యాడ మచ్చిక? యాడ సుద్దులు?” అన్న అన్నమయ్య పాట పాడుకోవడం తప్ప ఇక ఈ జన్మకు పెళ్ళి వద్దు అంకుల్! అని తృప్తిగా చెబుతున్నాడు. బుల్లెట్ గాయం గట్టిగా తగిలినట్లుంది.
“పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి…” నీ మీద మళ్ళీ పోస్తుంది నాయనా! లోకంలో అన్నీ బుల్లెట్లే ఉండవు. కైనెటిక్, హోండా, బజాజ్, పల్సర్, టివీఎస్ లు కూడా ఉంటాయి. ప్రయత్నించు! అంటే “ఏ బుల్లెట్ సౌండ్ విన్నా నామీదికే వస్తున్నట్లుంది అంకుల్!” “అలసితి…సొలసితి… ఇక నాకు ఓపిక లేదంకుల్!” అని అన్నమయ్య జిల్లాలో అన్నీ అన్నమయ్య పాటలే పాడుకుంటున్నాడు.
ఈసారెప్పుడైనా తిరుపతి వెళ్ళేప్పుడు ఫోన్ చేయండి అంకుల్! మనిద్దరికీ ఇష్టమైన తాళ్ళపాకకు వెళదాం- అన్నాడు. ఎలక్ట్రిసిటీ ఇంజనీరులో ఇంత వైరాగ్య విద్వత్ విద్యుత్తును వెలిగించిన ఆ బుల్లెట్ ఎంత ప్రభావవంతమైనదో!
“ఏమిటండీ మా అమ్మాయితో మాట్లాడి మీరేమీ చేయలేకపోయారు!” అన్న బెంగళూరమ్మాయి చిన్నాన్నకు చెప్పే సమాధానం;
“మావాడిని పెళ్ళికి ఒప్పించావా!” అన్న రాజంపేటబ్బాయి మేనమాకు చెప్పే సమాధానం నా దగ్గర లేదు.
మహా అయితే అక్కడ ఎర్రగడ్డ కారంతో రాగి సంకటి తినడం; ఇక్కడ బుల్లెట్లో కాకుండా ఏదన్నా వాహనంలో తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్య పాటలు పాడుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు!
అనుభవమైతేగాని తత్వం బోధపడదని పెద్దలు ఊరికే అనలేదు!
సందర్భం:-
ప్రపంచ బ్యాంక్ తాజా అధ్యయనంలో బయటపడిన ఒక విషయం ఏమిటంటే-ఉద్యోగజీవితానికి అడ్డు అవుతుందని పెళ్ళే వద్దనుకుంటున్న అమ్మాయిల సంఖ్య భారత్ లో క్రమంగా పెరుగుతోందని.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article