అంతా సిద్దమయ్యాక… ఎన్ని రకాల ద్వేషాన్ని గుమ్మరించడానికి ప్రయత్నించాయో కదా ఎన్నిరకాల శక్తులో..! ఒక హిందూ ఆత్మాభిమాన ప్రతీకను ఘనంగా ఆవిష్కరించుకునే సందర్భంలో ఇంత విషాన్ని ప్రవహింపజేయాలా..? మోడీ పెళ్లాన్ని వదిలేశాడు, విగ్రహాన్ని తాకే అర్హత లేదంటాడు ఒకరు… అసలు జంటగా తప్ప ఈ తంతు ఒంటరిగా చేయకూడదు, అవమానం, అశాస్త్రీయం అంటాడు ఇంకొకరు… అసలు ఆ ముహూర్తమే కరెక్టు కాదంటాడు మరొకరు…
ఆ లింగం మీద తేళ్లను పీఠాధిపతులని కూడా చూడకుండా జాతి దులిపి పారేసింది… పరువు కోల్పోయారు శంకరాచార్యులు… అయోధ్య గుడి ఇంపార్టెన్స్ తెలిసిన మొహాలు కావు, పైగా వీళ్లేదో మతాన్ని ఉద్దరిస్తున్నట్టు బిల్డప్పులు… మతం వ్యక్తిగతం అని కొందరి సన్నాయినొక్కులు, రాముడు అందరివాడు, ఇది బీజేపీ ఈవెంట్, తరువాత వెళ్తాం అని కుంటిసాకులు… అవి అక్షింతలు కావు, రేషన్ బియ్యం అనే వ్యాఖ్యలు… ప్రాణప్రతిష్ఠకు కౌంటర్ కార్యక్రమాల్లో బీజేపీ వ్యతిరేక శిబిరాలు బిజీ బిజీ…
Ads
చివరకు ఏ స్థాయికి ఈ విషప్రవాహం చేరిందంటే… మోడీ ఏదో తన వ్యక్తిగత నిబద్ధత, భక్తిని ప్రదర్శిస్తూ, ప్రాణప్రతిష్ఠ చేయడానికి తగిన నిష్ట కోసం 11 రోజుల ఉపవాస దీక్ష చేస్తే… అబ్బే, అన్నిరోజులు ఎలా బతుకుతారు ఆహారం లేకుండా, దేశమంతా తిరిగాడు, ఆ ఉత్సాహం ఎలా వచ్చింది, సో, అంతా అబద్దం అంటాడు వీరప్ప మొయిలీ అనే ఓ పే-ద్ద నేత… తనదేమైనా కేసీయార్ తెలంగాణ దీక్షా..?
మరో డౌటనుమానం… ఈ గుడిలో దళతులకు ప్రవేశం ఉందా అని సోషల్ మీడియాలో ప్రశ్న… కావాలనే దళితుల్లో గుడి వ్యతిరేకతను పెంచే కుటిల యత్నం… అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆరుబయట కూర్చుని ఉంటే, గర్భగుడిలో ఓ దళితుడు కామేశ్వర్ చౌపాల్ ప్రాణప్రతిష్ఠ దగ్గరే ఉన్నాడని మరిచిపోయారు… ప్రాణప్రతిష్ఠ మరుసటిరోజు 5 లక్షల మంది దర్శించుకున్నారు… ఎవరినీ ఏ గుర్తింపు కార్డూ అడగలేదు… నీది ఏ రాష్ట్రం, ఏ మతం, ఏ కులం, ఏ వర్గం అనే ప్రశ్నల్లేవు… అయోధ్య రాముడు అందరివాడు…
సమాజ్‌వాదీ పార్టీ అయితే మరింత అసహనం… దాని నేత ప్రసాద్ మౌర్య నిన్న ఎక్కడో వాగుతూ ‘ప్రాణప్రతిష్ఠతో రాయి సజీవం అవుతుందా…? మృతదేహాలు లేచి నడిచొస్తాయా..? ఇదంతా ఓ నాటకం… అని విరుచుకుపడ్డాడు… ఉత్తర ప్రదేశాన్ని మాఫియా రాజ్యంగా మార్చిన ప్రబుద్ధుల నుంచి ఇంకేం ఆశించేది…
(ఈ ఫోటోలో కామేశ్వర్ చౌపాల్ ఉన్నాడు…)
ఈ కామేశ్వర్ చౌపాల్ అయోధ్య ట్రస్టు సభ్యుడు… 1989లో గుడి పునాదికి మొదటి ఇటుక వేసింది తనే… 2002 నుంచి 2014 దాకా బిహార్ కౌన్సిల్ మెంబర్, తరువాత లోకసభకు పోటీచేశాడు… ఒక దశలో ఆ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిని చేస్తారని కూడా అనుకున్నారు… అదీ ఆయన నేపథ్యం…
ఇప్పుడు మరో ప్రశ్న… ఆర్య సంస్కృతిలో తెల్ల రాముడిని గాకుండా ద్రవిడ సంస్కృతిలో నల్ల రాముడిని ఎలా ప్రతిష్ఠించారు అట… అది 2- 300 ఏళ్ల నాటి కృష్ణశిల, కావాలనే ఆ శిలను ఎంచుకున్నారనీ, ఇంకెక్కడి నుంచో వచ్చిన పాలరాతి రాముడి విగ్రహాన్ని కాదని కర్నాటక శిల్పి యోగిరాజ్ శిల్పాన్నే ఎంపిక చేశారనీ మరిచిపోయారు… మరొక విమర్శ… అబ్బే, అయోధ్య పూర్తిగా ఉత్తరాది ఆస్తి… అసలు సౌత్ ఇండియా ప్రాతినిధ్యం, ప్రాధాన్యం, సొంతదనం ఏముందని..!
(అయోధ్య అర్చనలో విశ్వప్రసన్న తీర్థ)
అసలు ఆ శిల్పమే దక్షిణాది ఆస్తి కదా… పైగా ఉడుపి పెజావర్ మఠం సాధువు విశ్వప్రసన్న తీర్థ ఆ ప్రాణప్రతిష్ఠ తంతులో స్వయంగా శాస్త్రోక్త విధుల్ని నిర్వర్తించిన అర్చక మండలిలో సభ్యుడు మాత్రమే కాదు, కొన్నాళ్లుగా ఆలయ నిర్మాణ పర్యవేక్షణను చూసుకున్న అయోధ్య ట్రస్టు సభ్యుడు కూడా… అంతేకాదు, ప్రాణప్రతిష్ఠ జరిగాక 48 రోజులపాటు మండలోత్సవం జరగాల్సి ఉంది… అది ఈయన మార్గదర్శకత్వంలోనే సాగుతోంది… ఐనా చాలా దేశాలే ఓన్ చేసుకుంటుంటే మనమేమో ఉత్తర దేవుడా, దక్షిణ దేవుడా అని చిల్లర విమర్శల్లోకి జాారిపోతున్నాం…
అయిపోయింది… నాలుగు రోజులు పోతే ఇక విమర్శలు చేయడానికి కూడా ఏ పాయింటూ దొరకదు… ఉన్న అసహనమంతా కక్కేయబడింది… ఏ పార్టీలు ఎన్ని కొక్కిరింపులకు పూనుకున్నా సరే, రామభక్తగణం మాత్రం దీన్ని బీజేపీ ఈవెంట్‌గా కాదు, రాముడి కార్యక్రమంలాగే స్వీకరించింది… రాబోయే రోజుల్లో అయోధ్యను హిందూ ఆధ్యాత్మిక గమ్యంగా మార్చబోతున్నారు… అటు వారణాసి, ఇటు అయోధ్య రెండూ స్పిరిట్యుయల్ టూరిజానికి వెన్నెముకలు కాబోతున్నయ్… అవునూ, ఇంకా ఏడవటానికి సాకులు ఏమైనా మిగిలాయా..?! పార్టీలు ఇంకా కక్కడానికి లోలోపల మాలిన్యం ఏమైనా మిగిలి ఉందా..?!
చివరగా… నైవేద్య సమర్పణ సమయంలో ఎవరూ చూడకూడదని కర్ణాటక మధ్వ పూజారుల పద్దతి… అందుకే నాడు గర్భగుడిలో మోడీ పక్కన నిల్చుని తన మొహం మీద వస్త్రం కప్పుకున్నది విశ్వ ప్రసన్న తీర్థ…
Share this Article