.
నిజమే… సమర్థనలు, కారణాలు ఏమున్నా సరే… పాకిస్థాన్‌ను చీల్చిచెండాడే అవకాశముండీ అర్థంతరంగా కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల మోడీ మీద కాషాయవాదుల్లోనే ఓ అసంతృప్తి…
ఆపరేషన్ సిందూర్ ప్రకటించి, ఉగ్రవాద స్థావరాల మీద భీకర దాడి చేసేంతవరకూ మోడీ ప్రతిష్ట బాగా పెరిగిపోయింది… ఎప్పుడైతే అమెరికా ట్రంపుడు చెప్పగానే వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించాడో ఇప్పుడు బాగా మైనస్‌లో పడిపోయాడు…
చాన్స్ దొరికింది కదాని కాంగ్రెస్ క్యాంపు అప్పట్లో ఇందిరాగాంధీ అమెరికాను ఎలా తృణీకరించిందో ఆమె ఎంతటి ఐరన్ లేడీయో వివరిస్తూ మోడీవాదుల్ని తీవ్ర ఇరకాటంలో పడేస్తోంది… నిజానికి ఎప్పటి సమీకరణాలు అప్పటివి… పోల్చలేం… కానీ రాజకీయ పార్టీలు అవకాశాల్ని వదలవు కదా…
Ads
1971 యుద్ధ సమయంలో ప్రపంచంలో ఓ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది… రష్యా ఫుల్లు సపోర్టు… ప్రతిపక్షంలో వాజపేయి వంటి రాజనీతిజ్ఞుడు, పరిణత నేత… ఇప్పుడు..? వద్దులెండి..! అప్పట్లో ఆర్మీ చీఫ్ శామ్ బహదూర్… రియల్ టైగర్… సో, అప్పటి సమీకరణాలు వేరు… పైగా చేతికి చిక్కిన లక్ష మంది పాకీ జవాన్లను బేషరతుగా ఎందుకు విడిచిపెట్టిందనే విమర్శలూ ఉన్నవే కదా… అప్పుడే పీవోకేను స్వాధీనం చేసుకుంటే ఈరోజు ఇన్ని తలనొప్పులు ఉండేవి కావు…
కాకపోతే ఇప్పుడు మోడీ తను తుపాకీ కిందపడేయడానికి కారణాలను సమర్థంగా, కన్విన్సింగుగా చెప్పుకోలేని వైఫల్యం కూడా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షవాదులకు చాన్స్ ఇస్తోంది… కౌంటర్ లేదు బీజేపీ నుంచి… ఏం చెప్పుకుంటారు అంటారా..? అంతే…
నిజానికి అప్పట్లో ఇందిర ఐరన్ లేడీగా ఎందుకు పేరు తెచ్చుకుంది..? యుద్ధం గెలిచినందుకు కాదు, పాకిస్థాన్‌ను నిలువునా చీల్చినందుకు కాదు… అమెరికా నడిబొడ్డున నిలబడి, మీ పెత్తనం ఏందిరా అని గర్జించినందుకు… అప్పట్లో అమెరికాను వ్యతిరేకించి, ఛీపోరా అనడం మామూలు విషయం కాదు… ఈ విషయంలో మాత్రం ఇందిరను అభినందించాలి…
“ఇండియా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చితే అమెరికా నోరుమూసుకుని కూర్చోదు. ఇండియాకు తగిన గుణపాఠం చెప్పుతాం” అని రిచర్డ్ నిక్సన్, అమెరికా అధ్యక్షుడు బెదిరించాడు… దానికి ” ఇండియా అమెరికాను స్నేహితునిగా మాత్రమే పరిగణిస్తోంది… యజమానిగా కాదు… తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉంది… పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవరించాలో మాకు తెలుసు… ” – అని ఇందిరాగాంధీ, భారత ప్రధాని హోదాలో బదులిచ్చింది…
వైట్ హౌసులో ఇరువురు నేతల మధ్య ముఖాముఖి జరిగిన సంభాషణల్లో ఇది చిన్న భాగం… దీని తర్వాత జరగవలసిన భారత- అమెరికా సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి ఇందిరాగాంధీ తనకే సాధ్యమైన ఠీవితో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చింది…
వీడ్కోలు చెప్పేందుకు కారు వరకు వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ ఇందిరా గాంధీ కారు ఎక్కుతుండగా ” మేడం, అధ్యక్షునితో మీరు కొంత సహనంగా వ్యవహరించి ఉండాల్సిందని అనుకోవటం లేదా” అని అడిగినప్పుడు…
” మీ సలహాకు ధన్యవాదాలు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా అకృత్యాలపై పోరాడేందుకు తగినంత దృఢంగా నిటారుగా మా వెన్నెముక ఉంది. వేల మైళ్ళ దూరం నుండి ఏ దేశాన్నైనా శాసించే రోజులు గతించాయని మేము రుజువు చేస్తాం “అని ఇందిరాగాంధీ బదులిచ్చింది… అలాగని హెన్రి కిస్సింజరే తన ఆత్మకథలో వ్రాసుకున్నారు …
అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆమె నుంచి వాజపేయికి కాల్… ఓసారి అర్జెంటుగా రాగలరా..? ఓ గంటసేపు ఏకాంత చర్చలు… దేశ సార్వభౌమత్వ రక్షణ విషయంలో ప్రభుత్వం ఏం అడిగినా సహకరిస్తామని వాజపేయి హామీ…
ఒక ప్రతిపక్ష నేత ఏకంగా ఐక్యరాజ్యసమితిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం… ఇప్పుడు ఊహించగలమా..? అలాంటి నేతలు కదా ఇప్పుడు ఈ దేశానికి అవసరం… బి.బి.సి ప్రతినిధి డోనాల్డ్ పాల్ ” ఇందిర మీ రాజకీయ ప్రత్యర్థి కదా! అయినా సరే ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్యసమితిలో మీరు సమర్థంగా దేశ వాదన వినిపిస్తారా..? అని వాజపేయిని ప్రశ్నించాడు…
దానికి “ఒక తోటలో గులాబీ ఉంటుంది. ఒక లిల్లీ కూడా ఉంటుంది. రెండూ తామే అందమైనవి అనుకుంటాయి. ఐతే తోట సంక్షోభంలో పడినప్పుడు మాత్రం మొత్తం తోట అందాన్ని కాపాడుకోటానికి రెండూ ఒకటిగానే ఉంటాయి… తోటను కాపాడుకొనేందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇదే భారత ప్రజాస్వామ్యం” అని వాజపేయి సమాధానం…
అమెరికా యుద్ధనౌకను పంపించడం, రష్యా బరిలోకి దిగి చక్రం అడ్డువేయడం తెలిసిందే కదా… అమెరికా తన అక్కసునంతా తీర్చుకుంది… ఆంక్షలు పెట్టింది, చమురు సరపరాను ఆపించింది… అమెరికా పాకిస్థాన్‌కు పంపించిన ట్యాంకుల్ని ధ్వంసం చేసిన ఇండియా అమెరికా పొగరును అణిచివేసింది… మా ట్యాంకుల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే అహాన్ని బద్దలు కొట్టింది ఇండియా…
అమెరికా అప్పుడూ ఇప్పుడూ నమ్మదగని దేశం కదా… మరి వాడు చెప్పగానే మోడీ కాడికింద పడేయడం ఏమిటనేది దేశం ప్రశ్న… దురదృష్టం కొద్దీ దీనికి జవాబు దొరకడం లేదు…!!
Share this Article