అప్పుడే మొదలు పెట్టేశారు చిరంజీవి సినిమా ఆచార్య మీద విమర్శలు చేయడం… చేస్తే తప్పులేదు, తప్పుపట్టాల్సిన అంశాలున్నప్పుడు..! చిరంజీవి దానికి అతీతుడేమీ కాదు… అయితే కేవలం తప్పుపట్టడం కోసం తప్పులు ఎన్నడం వేస్ట్… ఎందుకంటే..? సినిమా అనేది ఒక దందా… జనానికి నచ్చేది ఏదో చూపించేసి డబ్బులు తీసుకోవడం ఈ దందా లక్షణం… అంతే… చిరంజీవి ఒక సినిమా హీరో… సంఘసంస్కర్త కాదు ఇక్కడ… సమాజాన్ని ఉద్దరించే పనిలో లేడు తను… సినిమా ఏ రేంజ్ బిజినెస్ చేసింది, ఎంత వసూలు చేసింది, మనకెంత మిగిలింది… ఈ లెక్కలు మాత్రమే ఇండస్ట్రీలో అంతిమంగా నిలబడేవి… ఇది రియాలిటీ… అక్కడ మళయాళంలో మమ్ముట్టి సినిమా సక్సెస్, దాన్ని తెచ్చి ఇక్కడ చిరంజీవి స్టయిల్‌కు అనుగుణంగా మార్చేసి వదిలితేనే హిట్… నో రిస్క్, ఇదే లెక్క…
అది నక్సలైట్ పాత్ర గానీ, స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర గానీ, చివరకు అంబానీ, ప్రధాని పాత్రలు పెట్టి సినిమా తీసినా సరే… చిరంజీవి గనుక ఆ పాత్రలు పోషిస్తే ట్రెండీ డ్రెస్సులు, గెటప్పులు మాత్రమే కాదు… ఆ స్టెప్పులు గట్రా ఉండాల్సిందే… అతి లేనిదే చిరంజీవి సినిమా లేదు… తన అభిమానికీ అతి లేకపోతే ఎక్కదు… అంజి, మృగరాజు పాత్రలైనా సరే స్టెప్పులు వేయాల్సిందే, ఓ నాగరికుడి గెటప్పులో ఎగరాల్సిందే… చివరకు మంజునాథ సినిమాలో శివుడికీ స్టెప్పులు పెట్టారు కదా… ఎస్, చిరంజీవి తన కమర్షియల్ ఇమేజీలో తనే బందీ… విడుదల కాడు… కాలేడు… అయ్యేందుకు సాహసించడు… సాక్షాత్తూ ఆ శివపురాణాన్ని సినిమాగా తీసినా సరే, చిరంజీవి ఇమేజీకి తగినట్టుగా కథ మారాల్సిందే… గాంధీ సినిమాయో, పటేల్ సినిమాయో తీస్తే అదెలా ఉంటుంది..? ఊహించుకోవాల్సిందే… సైరా చూశాం కదా… ఆ కథ, ఆ కథనం, ఆ ప్రజెంటేషన్‌తో అతికి అతితనం నేర్పించారు… మారకపోతే వినోదదందా లెక్కలు అంగీకరించవు… మమ్ముట్టి మళయాళ సినిమా, దాని ఖర్చు వేరు… చిరంజీవి తెలుగు సినిమా, దాని ఖర్చు వేరు… ఇక ఈ కొత్త సినిమా Acharya సంగతికొద్దాం…
Ads
ఇప్పుడు లాహే లాహే అని ఓ లిరికల్ సాంగ్ విడుదల చేశారు… నిజానికి ఈ పాట విషయానికొస్తే వీసమెత్తు కూడా విమర్శించడానికి స్కోప్ లేదు… పైగా కాస్త ప్రశంసలు కూడా దక్కాలి చిరంజీవికి ఇక్కడ… మంచి గుడి గోపురం సెట్టింగు… కలర్ ఫుల్ ప్రాపర్టీస్… ఈ వయస్సులో కూడా తను అలవోకగా, అందంగా స్టెప్పులు వేస్తున్నాడు… అవి సింపుల్‌గా బాగున్నయ్… ఐనా చిరంజీవికి స్టెప్పుల గురించి ఒకరు చెప్పడమా..? ఎంతమాట..? స్టెప్పుల రారాజు… అన్నింటికీ మించి మణిశర్మ ఇచ్చిన ట్యూన్ కూడా కాస్త బాగున్నట్టే ఉంది… సంగీత, కాజల్ సింపుల్ స్టెప్పులు కనిపిస్తున్నయ్… ఆ పాట కూడా రామజోగయ్య శాస్త్రి కాస్త డిఫరెంటుగా ఆలోచించే రాయాలని అనుకున్నట్టుంది… శివుడి వేషధారణపై గౌరి అలక, రెండుమూడు జాముల దాకా అదే ఎడం ఎడం యవ్వారం… తరువాత ఏకమయ్యే ప్రణయం… కాన్సెప్టు బాగుంది, కానీ అంత తేలికగా జనంలోకి ఎక్కేలా లేవు ఆ పదాలు, వాటి వాడకం, కూర్పు… టేస్టుపరంగా పాటను తప్పుపట్టడానికి ఏమీ లేదు… (ఐనా, ఇది మొదటిపాటే కదా, అమ్మడూ కుమ్ముడూ టైపు పాట కూడా ఉండి ఉందేమో చూడాలి…)
కానీ పాట చివరలో ‘‘స్వయానా చెబుతున్నారు, అనుబంధాలు కడతేరే పాఠం’’ అని ముక్తాయింపు ఉంది… అప్పటిదాకా చెప్పింది ఏమిటి..? అలకలు- చివరకు సయోధ్యలు…!! చివరలో రచయిత చెబుతున్నదేమిటి..? వాళ్లే స్వయంగా చెబుతున్నారు, అనుబంధాలు కడతేరే పాఠం అని…!! సంగీతం కంపోజ్ చేసిన పెద్దమనిషికి సాహిత్యం అర్థం కాదు అనుకుందాం… దర్శకుడికి అలా పాటల్లోకి వెళ్లి పరిశీలించే అలవాటే లేదనుకుందాం… కానీ పాటల విషయంలో చాలా శ్రద్ధను, ఆసక్తిని చూపించే చిరంజీవి సరిగ్గా పాటను ముందే చదవలేదా..? వినలేదా..? ఏమోలే… రాసింది రామజోగయ్య కదా… గొప్పగానే రాసి ఉంటాడు పాపం.., లబ్దిప్రతిష్ఠుడే కదా… కాకపోతే సరిగ్గా అర్థం చేసుకోవడంలోనే, ఆస్వాదించడంలోనే మన తప్పుందేమో…!! #acharya, #megastar, #lahelahe
Share this Article