‘‘ఒకవైపు తెలంగాణ సమాజం ఛీత్కరించింది… అలాంటి కేసీయార్ నీకు ఆదర్శంగా కనిపించడం ఏమిటి…’’ ఇది ఒక విమర్శ… ‘‘మొన్నమొన్నటిదాకా నువ్వే కదా కేసీయార్‌ను నీ ఎన్నికల ప్రసంగాల్లో ఎండగట్టింది… అకస్మాత్తుగా ఆయన నీతిమంతుడైపోయాడా..?’’ ఇది మరో విమర్శ… ‘‘కేసీయార్‌తో పొత్తు అంటే తెలంగాణ సమాజం మనోభావాలకు విరుద్ధంగా నువ్వు వెళ్తున్నట్టే కదా…’’ ఇది ఇంకో విమర్శ…
అంతేకాదు, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ కేసీయార్‌తో పొత్తు పెట్టుకోవడం మీద రకరకాల మీమ్స్, బొమ్మలు, వ్యాసాలు, కథనాలు బోలెడు వెలువడ్డాయి… ఎక్కువ శాతం ప్రవీణ్ కుమార్‌ను తప్పుచేస్తున్నావంటూ ఆక్షేపించేవే… అసలు ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో వచ్చింది కేసీయార్ వ్యతిరేక వోటును చీల్చి, ఆయనకు మేలు చేయడానికే, ఇప్పుడు అది పనిచేయలేదు కాబట్టి ఇక నేరుగా ఆయనతో పొత్తుతో లోకసభ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అనే విమర్శ కూడా ఉంది…
ఇదంతా నాణేనికి ఒకవైపే… మరోవైపు ఆయనకు కేసీయార్‌తో పొత్తు పెట్టుకోవడంలో అనైతికత ఏమీ లేదు… అసలు బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తును ఆక్షేపించే అవసరమే లేదు… రాజకీయాలే అవసరాల ప్రాతిపదికన నడుస్తుంటయ్… పొత్తులు, విడిపోవడాలు, ఎన్నికల అవగాహన గట్రా అంతా ఓ సంక్లిష్ట సమీకరణాల ప్రపంచం… తన ఇష్టం… కేసీయార్‌తో పొత్తు వల్ల తనకు ఫాయిదా అని భావించిన పక్షంలో ప్రవీణ్ కుమార్ కొత్త స్నేహాన్ని ఆక్షేపించే పనే లేదు… అసలు లెఫ్ట్ పార్టీలు ఎంత తేలికగా, తరచుగా స్నేహాల్ని, పొత్తుల్ని మార్చేస్తుంటాయి… బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు మాత్రమే ఆక్షేపణీయమా..? అంతెందుకు..? అంతటి విశ్వాసరహితుడు చంద్రబాబుతో బీజేపీ కలుస్తూ, విడిపోతూ, మళ్లీ కలుస్తూ సాగిపోవడం లేదా..?
Ads
కాకపోతే ప్రవీణ్ కుమార్, కేసీయార్ భేటీ, పొత్తు ప్రకటన నిజానికి మాయావతికి తెలుసా లేదా..? ఆమె అనుమతితోనే ప్రకటన చేశారా అనేది తెలియదు… ఈలోపు మాయావతి ఓ ప్రకటన చేసింది… ‘మేం ఏ కూటమిలో చేరం, ఎవరితోనూ పొత్తు లేదు, సొంతంగానే పోటీచేస్తాం’ అని చెప్పడంతో ఇక అందరూ బీఆర్ఎస్ బీఎస్పీ షాక్ అని ఎడాపెడా రాసేశారు… అబ్బా, బెహన్‌జీ మాటలకు అర్థం అది కాదు, ఎన్డీయే లేదా ఇండి కూటమిలో దేనితోనూ జతకలవం అని మాత్రమే ఆమె చెప్పింది అని ప్రవీణ్ కుమార్ వివరణ ఇచ్చుకున్నా… అది పెద్దగా జనంలోకి పోలేదు…
ఆమె అంగీకరిస్తుందా లేదా అనేది ప్రశ్నే… కానీ ఆమె చెప్పింది నిజంగానే జాతీయ స్థాయి కూటమిల్లో దేనితోనూ ఉండబోమని… రాష్ట్రాల్లో కలిసివచ్చే పార్టీలతో (కూటములతో సంబంధం లేని పార్టీలు) పొత్తు పట్ల ఆమెకు అభ్యంతరం ఏమీ ఉండదు, ఏమో, నిజంగానే బీఆర్ఎస్ పొత్తు ద్వారా ఒక సీటు వస్తే ఆమెకు లాభమే కదా… నో, కాదూ, వద్దూ అంటే ప్రవీణే ఇంకేదైనా మార్గం వెతుక్కుని… ఐతే స్వతంత్రుడిగానో… మరీ కాదంటే బీఆర్ఎస్ తరఫునో పోటీ చేస్తే..? రాజకీయాల్లో దేన్నీ ఏ పరిణామాన్నీ తీసిపారేయలేం..!!
Share this Article