.
గురజాడ కవిత్వం మీద ఆనాటి సమకాలిక సంప్రదాయవాదులు ముప్పేట దాడి చేయడంవల్ల గురజాడ కవిత్వానికే ఎనలేని మేలు జరిగిందని ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ సోదాహరణంగా నిరూపించారు.
ఊహాలోకాల్లో ప్రబంధ భార సంస్కృత పదబంధాల్లో చిక్కుకున్న కవిత్వాన్ని భూమార్గం పట్టించి తేట తెలుగులో జనసామాన్యానికి గురజాడ ఎలా చేరువ చేశారో వివరించారు. చదువుకోవడానికి, పాడుకోవడానికి రెండిటికీ అనువుగా ముత్యాలసరాలను ఎలా కూర్చారో చాలా లోతుగా విశ్లేషించారు. ఆ చర్చ ఇక్కడ అనవసరం. ఆ వ్యాసం ముగింపులో
Ads
1 . కవిత్వం
2 . అకవిత్వం
3 . సుకవిత్వం
4 . కుకవిత్వం
5 . కకావికత్వం
…. అన్న అయిదు రకాల కవిత్వ రచనతో తెలుగు కవితా లోకం ఉక్కిరి బిక్కిరి అవుతోందని 1975 నాటికే బూదరాజు చాలా బాధపడ్డారు. తరువాతి అర్ధశతాబ్దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇంకెన్ని కకావికత్వ విభాగాలుగా విభజించి ఉండేవారో!
కవిత్వమొచ్చినా… కక్కొచ్చినా ఆగదని సామెతే ఉన్నదున్నట్లు కక్కేశాక ఇక కవిత్వం గురించి విడిగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది కవికే కక్కొస్తే? తదనంతర పరిణామాల గురించి సామెత దృష్టి పెట్టకపోయినా… సినిమాల్లో జంధ్యాలలాంటివారు చాలా లోతుగా చర్చించారు.
“నాది కవిత్వం కాదన్నవాడిని కత్తితో పొడుస్తా!”
అని జంధ్యాల సినిమాలో ఒక రచయిత్రి రాసిన అకవిత్వం సీన్లు జగద్విదితం.
కొందరికి నేర్చుకుంటే వస్తుంది కవిత్వం. కొందరికి పుట్టుకతోనే వస్తుంది. ఆదిప్రాసలో, అంత్యప్రాసలో పేర్చుకుంటూ కొందరు కృత్రిమంగా రాస్తారు. కొందరు కవిత్వం రాస్తున్నామనుకుంటూ కవిత్వం తప్ప అన్నీ రాస్తుంటారు. కత్తి పట్టిన ప్రతివాడూ యోధుడు కాదు- కలం పట్టిన ప్రతివాడూ కవీ కాదు.
నిజమైన కవికి మాటలు కేవలం పరికరాలు. ప్రాసల సర్కస్ గారడీ విద్యలు దాటి ఆ మాటల మూటలతో అతను పేర్చే భావాల కోటలే మనకు ప్రధానం. అతను సృష్టించే భావసముద్రం అసలు సముద్రంకంటే చాలా పెద్దది. “విశ్వ శ్రేయః కావ్యం”; “వాక్యం రసాత్మకం కావ్యం” లాంటి సకల కావ్యాదర్శాలకు అతడు కొలమానమవుతాడు.
అలా విశ్వ శ్రేయస్సును కోరుతూ మాయమైపోతున్న మనిషిని వెతికి పట్టుకున్నవాడు మన అందెశ్రీ. గొప్ప వాక్యం ఒక్కటే అయినా అది కావ్యంతో సమానమన్న లక్షణశాస్త్ర సూత్రం ప్రకారం అందెశ్రీ పాటలో ఒక్కో పంక్తి ఒక్కో కావ్యంతో సమానం.
మానవత్వం ఉన్నవాడు మచ్చుకైనా కానరాని కాలాల్లో అందెశ్రీ అన్వేషణ దేనికోసమో విడిగా చెప్పాల్సిన పనిలేదు. మనిషి ఏమైనా కావచ్చు కానీ… మనిషి మనిషి కావడమే చాలా కష్టమని దాశరథి గాలిబ్ గీతాల్లో అంటాడు. అందెశ్రీ కూడా మనిషిలో మాయమైపోతున్న మనిషి కోసం పరితపించాడు. కనీసం నూటికో, కోటికో ఒక్కడైనా ఉంటే… ఆ ఉన్నవాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడం కష్టంగా ఉందన్నాడు.
అందెశ్రీ మనిషిని శపించట్లేదు. నిలువెత్తు స్వార్థం నీడలా మనిషిని వెంటాడుతుంటే చెడిపోక ఎలా నిలబడగలుగుతాడు? అని ప్రశ్నిస్తున్నాడు. విలువలు శిథిలమైనప్పుడు పడిపోకుండా ఎలా ఉంటాడని కారణాలను వెతికి చెబుతున్నాడు.
రూపాయికోసం ఏ పాపానికైనా ఒడిగొట్టే నరుడు చీమలకు చక్కెర, పాములకు పాలుపోసి…తోడబుట్టినవాళ్ళను ఊరవతల పెట్టి… జీవకారుణ్యం, పుణ్యం అంటే… అది పుణ్యమెలా అవుతుందో మిమ్మల్ను మీరే ప్రశ్నించుకోండని మాయమైపోయాడు.
ఎలాంటి చదువుసంధ్యలు లేకుండా పశువులు కాచుకుంటూ పెరిగి… ప్రపంచానికి తన తాత్వికతను పాటలుగా ఇచ్చి మాయమైపోయాడు.
కానీ…
“జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం…”
రాష్ట్రగీతాన్ని ఇచ్చినవాడు ఎలా మాయమైపోతాడు? మన గుండెల్లో తెలంగాణ గీతం ప్రతిధ్వనిస్తున్నంత కాలం అందెశ్రీ మనలో పల్లవిస్తూనే ఉంటాడు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article