‘‘జగన్‌కు అక్రమాస్తుల కేసులో శిక్ష పడాలి, లేదా తన బెయిల్ రద్దు కావాలి, తను జైలు పాలవ్వాలి, ఇదే అదునుగా మోడీ కొరడా పట్టుకుని రంగంలోకి దిగాలి… దిక్కూ దివాణం లేకుండా…. సేమ్, శశికళను జైల్లోపారేసి, అన్నాడీఎంకేను గుప్పిట్లో ఉంచుకుని, పళనిస్వామిని చెప్పుచేతల్లోకి పెట్టుకుని నడిపించినట్టుగా ఏపీ ప్రభుత్వాన్ని నడిపించాలి… జగన్ భార్య భారతీరెడ్డి కాదు, ఏ పళనిస్వామో, ఏ పన్నీర్ సెల్వమో ముఖ్యమంత్రి కావాలి… జగన్ కుటుంబసభ్యుల్లో విభేదాలు రగులుకోవాలి….’’ ఇదే టీడీపీ క్యాంపుకి మిగిలిన ఆశ…
ఆంధ్రజ్యోతి రాతల్ని చూస్తే… పత్రిక కాదు, సాక్షాత్తూ పత్రిక ఓనర్ రాధాకృష్ణ రాతల్ని చూస్తే ఇదే కోరుకుంటున్నట్టు స్పష్టమవుతుంది మనకు… అసలు ఇప్పుడే కాదు, జగన్ కొరడా పట్టుకుని ఒక్కో తెలుగుదేశం ఆర్థికస్థంభాన్ని ఇరగబాదుతున్న కొద్దీ ఆ ఆంధ్రజ్యోతి రాతలు ఈ ఫ్రస్ట్రేషనే బయటపెడుతున్నయ్… కొత్తేమీ కాదు, ఈరోజు తన కొత్తపలుకు కమ్ వీకెండ్ కామెంట్ కూడా అదే… ఇక మేమేం చేయలేం, ఆ మోడీ ఏమైనా చేస్తేనే బతికి బట్టకడతాం అన్నట్టుగా సాగుతున్నయ్ ఆ క్యాంపు ఆలోచనలు… ఫాఫం, ఆ మోడీకే గనుక ఆ ఆలోచన ఉంటే ఇన్నాళ్లూ ఆగేదా..? అక్కడ మమతనే ఏమీ చేయలేక, ఆ నయాజయలలిత కోపానికి రాష్ట్రం వీడిన వేలాది మంది బీజేపీ కేడర్‌ను అదుకోలేక, ఎన్నికల అనంతరం సాగించిన నీచమైన హింసకు సమాధానం చెప్పలేక చేష్టలుడిగిన మోడీ ఇక్కడ స్థిరంగా ఉన్న జగన్ పాలనను ఏం చేయగలడు..?
మమత ఉపఎన్నికకు సై… ఇక్కడ మాత్రం ఈటలను నిండా నైరాశ్యంలో ముంచేసింది బీజేపీ…. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ ఎంత తన్నుకున్నా ఢిల్లీలో లెక్కలు వేరు… ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్లి అకౌంట్లు సెటిల్ చేసుకుంటాడు కేసీయార్… తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీల కేడర్ తన్నుకుంటూ ఉంటారు… అదే మరి రాజకీయం అంటే…!! ఏపీకి వద్దాం… ఇదే రాధాకృష్ణ వైరాగ్యంతో అంటాడు… ‘‘జగన్ క్యాంపు వేస్తున్న డిశ్చార్జి పిటిషన్లతో జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఇంకా జాప్యం అవుతుంది, వచ్చే జూన్ వరకూ ఇది తప్పకపోవచ్చు’’ అని… మరి జగన్ క్యాంపుకి తెలియదా ఏం..? కోర్టుల బలహీనతలు ఏమిటో..!! పోనీ, ఇప్పటికిప్పుడు జగన్‌ను కట్ చేస్తే మోడీకి వచ్చేదేముంది..? ఎలాగూ చంద్రబాబు నిజతత్వం ఏమిటో చేదుచేదుగా అనుభవించినవాడే కదా… ఇప్పుడు పిలిచి, శాలువా కప్పి, దండేసి, హత్తుకుని, నువ్వూ నేనూ భాయీభాయీ అంటాడా..? అసలు ఎన్నేళ్లుగానే చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వడం లేదు కదా…
Ads
ఐనాసరే, రాధాకృష్ణ ఆశకు దరిద్రం ఏమీలేదు… జగన్ కుర్చీ దిగాలి, జగన్ జైలుకు పోవాలి… ఇదే రంది… ప్రతి రాతలో ఇదే… నిజానికి రాధాకృష్ణకు బొచ్చెడు నమ్మకమైన సోర్సులున్నయ్, ఇన్సైడ్ స్టోరీలు మస్తు తెలుస్తయ్ అని మనం భ్రమపడటమే గానీ, తనకు లోతైన రాజకీయ అవగాహన వీసమెత్తు కూడా లేదని చెప్పడానికి రీసెంటు రాతలే ఉదాహరణ… ఈరోజుకూ తను జగన్ వేరు, షర్మిల వేరు, ఇద్దరూ ఏదో కారణంతో కొట్టుకుంటూ, షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిందని నమ్ముతున్నాడు… రాధాకృష్ణ రాజకీయ అంచనాల పట్ల జాలిపడటం తప్ప ఇంకేమీ చేయలేం… జగన్‌తో విభేదించి గనుక షర్మిల పార్టీ పెట్టి ఉంటే, కేసీయార్ ఆమె పార్టీ పట్ల వ్యవహరించే తీరు వేరే లెవల్లో ఉండేది… అది కామన్ సెన్స్ అనాలిసిస్… ఆర్కే దానికి ఎప్పుడో దూరమైనట్టు కనిపిస్తోంది స్పష్టంగా…!!
ఈ ఉండవల్లి, ఈ కేవీపీ, ఈ రఘువీరా ఎట్సెట్రా పాత్రలు వచ్చాయంటే ఒరిగేది ఏముంది..? కేవీపీ తెర మీద మనిషి కాదు, అంతా తెరవెనుక యవ్వారాల బ్యాచు… పైగా జగన్‌కు పడని ట్రిపుల్ ఆర్ వియ్యంకుడు… ఇదే కేవీపీ జగన్‌కు ఏం చేశాడో, తండ్రి ఆత్మ, దోస్త్ అని తెలిసీ కేవీపీని పది ఆమడల దూరం ఎందుకు పెట్టాడో జగన్ క్యాంపులో ముఖ్యులకూ తెలుసు… ఉండవల్లి ఇప్పుడు పొలిటిషియనే కాదు, రఘువీరా అన్నీ వదిలేసిన కేరక్టర్… అసలు పుష్కరం తరువాత వైఎస్ సంస్మరణ పెట్టి అందరినీ పిలిచి ఆ లెగసీని తెలంగాణ పార్టీ ప్రమోషన్‌కు వాడుకోవాలనే ఆలోచనే ఓ పీకే మార్క్ అబ్సర్డ్ ఆలోచన… దానికి ఏపీ లీడర్లను పిలవడం మరో బ్లండర్… అసలు ఇదే విజయమ్మ, ఇదే షర్మిల, ఇదే భారతీరెడ్డి జగన్‌ను అరెస్టు చేసినప్పుడు రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద కూర్చున్న విషాదం, ఒక్కడంటే ఒక్క వైఎస్ అభిమాన నాయకుడూ కిక్కుమనని తీరు వీళ్లకు గుర్తులేనట్టుంది… ఇప్పటి జగన్ పార్టీ తన స్వయంకృషి, వైఎస్ పాత అనుచరులు సహా కాంగ్రెస్ ముఖ్యులందరినీ ఆమడదూరం ఉంచాడు కాబట్టే ఆయన పార్టీ నిలబడింది, లేకపోతే ఆ విస్తరిని చీల్చేసేవాళ్లు… ఐనాసరే, వైఎస్ పేరిట ఈ తెలంగాణ తహతహ… వైఎస్ తన గుండెల మీద విల్లు రాశాడనే సినిమాటిక్ డైలాగులతో ఒరిగేది ఏముంది..? దేనికోసం మిగతా పార్టీల్లోని వైఎస్ ఫ్యాన్ లీడర్లు ఇప్పుడు ఆమె వెంట పరుగులు తీయాలి..? కోమటిరెడ్డిని వదిలేయండి, ఏదీ ఒక్కడూ రాలేదేం..? ఎవరి రాజకీయ అవసరాలు, భవిష్యత్తు వాళ్లకు ప్రధానం… ఈమాత్రం రాధాకృష్ణ అర్థం చేసుకోలేక, తెరవెనుక సంగతులు పట్టలేక… తనలోని జర్నలిస్టు మరీ ఇంత నాసిరకమా అనుకునేలా ఈ రాతలేమిటో… ఆయనకే తెలియాలి…!!
Share this Article