బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్రగాయం, త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం అని హఠాత్తుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్, మూడు ఫోటోలు కనిపించాయి… సరిగ్గా నడి నొసటన ఓ గాయం, అక్కడి నుంచి పెదాల కింద దాకా, దాదాపు మెడ దాకా నెత్తుటి ధార కనిపిస్తున్నాయి… ఆమె మగతలో ఉంది… అప్పటికే స్పృహతప్పినట్టుగా…
వివరాలు తెలుసుకుందామని పలు ఇంగ్లిష్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ సైట్లను సెర్చ్ చేస్తే ఎక్కడా ఏ వివరమూ తెలియ లేదు… కొన్ని సందేహాలు చుట్టుముట్టాయి ఈలోపు… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆమె… గాయం ఎక్కడైనా, కారణమేదైనా సరే వెంటనే ప్రాథమిక చికిత్స అందాలి… ఆమె కాన్వాయ్‌లో అంబులెన్స్ ఉండాలి… అందులో డాక్టర్లు, సత్వర చికిత్సకు తగిన మందులు, సరంజామా మొత్తం రెడీగా ఉంటాయి… ఉండాలి…
ఒకవేళ అంబులెన్స్ లేకపోయినా సరే, ఒక ముఖ్యమంత్రికి గాయం తగిలితే ప్రాథమిక చికిత్స జరగదా..? కనీసం కాటన్‌తో ఆమె మొహం మీద నెత్తుటిని తుడవలేరా ఆమె వెంట ఉన్న కార్యకర్తలు ఎవరూ..? పైగా అదే నెత్తుటితో ఫోటోలు తీసి ట్విట్టర్‌లో పెట్టేస్తారా..? స్పహతప్పేలా ఓ తీవ్ర గాయం తగిలితే వెంటనే అధికార యంత్రాంగం పరుగెత్తుకు రావాలి కదా…
Ads
కనీసం ఆమె ప్రయాణించే వెహికిల్ డ్రైవరయినా సరే, జేబులోని కర్చీఫ్ పెట్టి ముందుగా రక్తం కారకుండా ఆపే ప్రయత్నం చేయాలి కదా… వీటన్నింటి బదులు సత్వరం ట్విట్టర్‌లో పోస్టు, ఫోటోలు ఎవరు పెట్టారు..? అసలేం జరిగింది..? ప్రమాదమా..? దాడి జరిగిందా..? ఏ వివరాలూ సత్వరం తెలియరాలేదు…
కాసేపటికి ఇంగ్లిష్ సైట్లు చెప్పాయి… కానీ ట్రెడ్ మిల్‌పై కాలు స్లిప్పయి పడిందని కొన్ని, కాళీఘాట్‌లోని తన ఇంటిలోనే గది నుంచి బయటికి వస్తుంటే కింద పడిందని కొన్ని రాసుకొచ్చాయి… కాసేపటికి స్టాలిన్ రోడ్డు ప్రమాదం అన్నట్టు గుర్తు… తరువాత కొంత క్లారిటీ వచ్చింది, ఆమెకు కుట్లు వేశామనీ, హాస్పిటల్‌లో ఉండను అని చెబితే డిశ్చార్జి చేశామని SSKM హాస్పిటల్ వర్గాలు చెప్పాయి…
కానీ అందరిలో అదే సందేహం… గత ఎన్నికల ముందు ఆమె కాలికి గాయం తగిలినట్టు కట్టు కట్టుకునే ఎన్నికల ప్రచారం చేసింది… సానుభూతి కోసం ఏదో మాయ చేస్తోందనీ, అంతా ప్రశాంత్ కిశోర్ ప్లాన్ అనీ ప్రచారం సాగింది… ఇప్పుడూ అదేనా అనేవి ఈ తాజా గాయం చుట్టూ సాగిన ప్రచారం… సరే, గాయం నిజమే అనుకుందాం… దీని మీద రచ్చ కూడా అమానవీయమే అవుతుంది…
కానీ కనీసం ఆమె గాయం నుంచి రక్తం ధారగా కారడాన్ని ఏ ఒక్కరూ దూది పెట్టి, లేదా కర్చీఫ్ పెట్టి కూడా ఆపలేని అసహాయత ఉందా ఒక ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో… దారుణం… ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఇతరుల మాటేమిటి..? ఇది దేనికి సూచిక అక్కా..!! (ఏమో… గతంలో ఆమె కాలిగాయం మీద ఇలాంటి ప్రచారాలు సాగాయి కదా, ఈసారి కూడా అలాగే ప్రచారం చేస్తారని సందేహించి, ఆ గాయం, ఆ రక్తం అలాగే ఉంచి ఫోటో తీసి ట్విట్టర్‌లో పెట్టారేమో…)
తాజాకలం :: ఎవరో ముందుకు తోస్తే పడిందట… సొంత ఇంట్లో తనను ముందుకు తోసేవారెవరు..? ఏ కుట్ర దాగి ఉంది..? ఇదొక ట్విస్టా..!!
Share this Article