నిజమే… ఇంట్రస్టింగ్ ప్రశ్నే… రెండు టరమ్స్ ముఖ్యమంత్రిగా చేసి, తెలంగాణ సాధించాడనే మంచి ఖ్యాతి, ఇమేజీ కూడా ఓన్ చేసుకున్న నాయకుడు తనను మూడో టరమ్ ముఖ్యమంత్రిని చేయమని అడిగే ప్రచారంలో… పదేళ్లలో తనేం చేశాడో చెప్పకుండా, పాజిటివ్ వోటు కోసం గాకుడా, పూర్తిగా నెగెటివ్ ధోరణిలో ఎందుకు వెళ్తున్నాడు..?
అదీ ఎప్పుడో చూసిన ఇందిరమ్మ రాజ్యాన్ని తోకమట్ట రాజ్యమని ఎందుకు నిందిస్తున్నాడు..? పేదల్ని కాల్చిచంపుడు, ఆకలికేకలు తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ఏముందని వెక్కిరిస్తున్నాడు దేనికి..? అప్పట్లో తెలంగాణను ఆంధ్రాలో కలిపిన కాంగ్రెస్‌ను తిడుతున్నాడు ఎందుకు..? అప్పట్లోనే నెహ్రూ దళితబంధు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నిస్తున్నాడు దేనికి..? కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలను తవ్వితీస్తున్నాడెందుకు..?
నిజానికి అప్పట్లో కేసీయార్ రాజకీయాలు ప్రారంభమైనవే యువజన కాంగ్రెస్ నుంచి… తరువాత కదా తెలుగుదేశం… పైగా ఏ కాంగ్రెస్‌ను కుంభకోణాల పుట్ట అంటున్నాడో అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నాళ్లు పోర్ట్‌ఫోలియో లేని కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు… కొన్నాళ్లు లేబర్ మినిష్టర్… అప్పుడే కదా ‘వెలుగుబంటి కుంభకోణానికి’ పునాదులు పడ్డయ్… వైఎస్ ప్రభుత్వంలోనూ ఉన్నాడు కదా… మరి ఆ తోకమట్ట ప్రభుత్వాల్లో తనెందుకు భాగస్వామిగా ఉన్నట్టు..?
Ads
తెలంగాణను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్… సోనియా స్థిరంగా నిలబడకపోతే అది సాధ్యమయ్యేదే కాదు… ఆమెను ఏమీ అనలేడు… ఒకవేళ ఏమన్నా సరే జనం నమ్మరు… నిజానికి ఇందిరమ్మ రాజ్యం ఏమిటో, రాజీవ్ రాజ్యం ఏమిటో ఈ తరానికి ఏం తెలుసు..? భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రాను కలిపేశారనే నిజాన్ని ఈతరం ఎరుగదు… కేసీయార్ అప్పటి ప్రభుత్వాలపై ఏం చెప్పినా జనానికి కనెక్ట్ కావు… మరి ఎవరిని నిందించాలి…? (నిజానికి ఇదే కేసీయార్ ఇందిరమ్మ నాయకత్వాన్ని గతంలో ప్రశంసించిన వీడియోలని కూడా కాంగ్రెస్ రిలీజ్ చేస్తోంది…)
పైకి కనిపించని దోస్త్ కాబట్టి బీజేపీని ఎడాపెడా తిట్టలేడు… మోడీ మీద కూడా సైలెంట్… తెలుగుదేశం అసలు బరిలోనే లేదు కాబట్టి దాన్ని తిట్టి పబ్బం గడుపుకోలేడు… పైగా చాన్నాళ్లూ చంద్రబాబు సహచరుడే కదా తను కూడా..! మహాకూటమి అంటూ పొత్తు కూడా పెట్టుకున్నాడు కదా తరువాత రోజుల్లో… పోనీ, పూర్తి పాజిటివ్‌గా వెళ్లాలనుకుంటే మేడిగడ్డ బలంగా దెబ్బకొట్టింది… ప్రపంచ అద్భుతం అని బహుళ ప్రచారం చేసుకున్న కాలేశ్వరం మీద గొప్పలు చెప్పలేని దురవస్థ…
ధరణి చూస్తే లోపాల పుట్ట… టీఎస్పీఎస్సీ వైఫల్యాల పుట్ట… విద్యలో, వైద్యంలో ఏం చేశాడో చెప్పుకోవడానికి ఏమీ లేవు… తరచి చూస్తే బోలెడన్ని… పోనీ, రాజకీయంగా..? ఏ కాంగ్రెస్ పార్టీకైతే తను డబ్బులిచ్చాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడో అదే కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి తెలంగాణలో… కాంగ్రెస్ కూటమి ఇండియా పక్షాలేమీ కేసీయార్‌కు తోడ్పాటు లేవు… ఉండాల్సిన అవసరమూ వాటికి లేదు… బీజేపీ నేరుగా తెరపై కొట్లాడదు, కేసీయార్‌కు అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప పూర్తిగా తనను నమ్మదు… సో, అందుకే కేసీయార్ ప్రసంగాల్లో ఆ పాత పంచ్ లోపించింది… అంచనాలన్నీ తేడా కొడుతున్నాయి…!!
జాగ్రత్తగా గమనించండి… ఏ కాంగ్రెస్ గ్యారంటీలను కాపీ కొట్టి తన మేనిఫెస్టో రూపొందించాడో… అవేవీ తన ప్రసంగాల్లో ముఖ్యాంశాలు కావడం లేదు… ఏ నాయకుడైనా తనేం చేయబోతున్నాడో చెప్పాలి కదా…!!
Share this Article