86,400 కోట్ల విలువైన రాఫెల్ యుద్ధవిమానాల మొత్తం కంట్రాక్టు విలువలో 8.64 కోట్ల కానుకలు అలియాస్ ముడుపులు అలియాస్ లంచాలు ఎంత శాతం..? ఎంత..? 0.01 శాతం..! అంతేనా, వేరే లెక్క ఏమైనా ఉందా..? 0.01 శాతం అంటే..? వంద రూపాయలకు ఒక పైసా..! ఇది భారీ కుంభకోణమా..? నిన్న ప్రతి పత్రిక కవర్ చేసిన ఓ వార్త చదివాక వచ్చిన భారీ సందేహం ఇదే… ప్రపంచంలో ఏ రక్షణ కంట్రాక్టులోనైనా సరే ఈ శాతానికి ఎవడైనా దళారీ డీల్స్ చేస్తాడా..? నమ్మొచ్చా…! మరి అన్ని మీడియా హౌజులు బ్రహ్మాండమైన ప్రయారిటీ ఎందుకిచ్చాయి ఆ వార్తకు..? రాఫెల్ డీల్ స్వచ్ఛమైనది, అందులో ఏ బాగోతాలూ లేవని కాదు… ఏ ప్రభుత్వమూ శుద్ద పూస కాదు… కానీ ఒక ఆరోపణ చేసినప్పుడు నిర్దిష్టంగా, నమ్మేట్టుగా ఉండాలి… అదుగో అక్కడ ఫెయిలైంది ఓ క్యాంపు… ఫోర్ ప్లస్ వన్ రాష్ట్రాల్లో పోలింగ్ రోజే ఈ రాఫెల్ బురద జల్లడం వెనుక ఖచ్చితంగా రాజకీయప్రయోజనాలున్నయ్… ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది ఏమిటి అంటే..? ఈ వార్తల్ని అడ్డదిడ్డంగా, అర్జెంటుగా రాసి, ఏజెన్సీ వార్తల్లో ఇరికించి, ప్రతి మీడియా హౌజుకూ చేర్చి… ఒకడు రాస్తే అందరూ గుడ్డిగా రాసేస్తారనే మీడియా దురలవాటును వాడుకుని, వేరేవాడు రాసేస్తే మేం మిస్సవుతామేమో అనే దురూహల్ని దృష్టిలో పెట్టుకుని తెలివిగా ప్లాంట్ చేయబడిన స్టోరీగా కనిపిస్తోంది… ఎలాగంటే..?
ఒకరకం శైలి… కొన్ని లెఫ్ట్ పత్రికలయితే అక్షరం పొల్లుపోకుండా ఒకేరకంగా అచ్చేసినట్టుగా కనిపించింది… అయితే స్ట్రెయిటుగా ఒక దళారీకి 10 లక్షల యూరోలు ముడుపులుగా ఇచ్చారు, రాఫెల్ డీల్‌లో మరో అవినీతిని ఫ్రెంచ్ వెబ్ పత్రిక ఒకటి బయటపెట్టింది… అది చెబుతున్న వివరాలు ఇవీ అని రాసేస్తే పోయేది… ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం… 1) ఈ పారిస్ వెబ్సైట్ ప్రధానంగా లెఫ్ట్ ఓరియెంటేషన్‌తో నడిచేది… సరే, అది తప్పు కాదు, అవసరమే… 2) ఈ వార్తను ఫ్రాన్స్‌లోనే ఎవరూ పట్టించుకోలేదు… కానీ మన పొలిటికల్ సెక్షన్స్‌కు అవసరం కదా, దాన్ని పట్టుకుని, నానా మసాలాలు కూరేసి, ఫ్రై చేసేసి వడ్డించాయి… 3) ఈ వార్త సగం మీడియా పార్ట్ కథనం ప్లస్ మిగతా సగం ఇండియన్ న్యూస్ ఏజెన్సీల పైత్యం… 4) ఆ దేశంలో ఏసీబీ వంటి వ్యవస్థ (AFA) ఉంది, దానికి రాఫెల్ డీల్‌లో గిఫ్టులుగా పేర్కొన్న ఓ అంశం మీద డౌటొచ్చింది… సదరు డసాల్ట్ కంపెనీని అడిగింది, అది ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు… సో, భారీ కుంభకోణం అయిపోయినట్టేనా..? 5) ఇదే ఫ్రాన్స్ అవినీతి నిరోధక సంస్థ ఈ ఆడిట్ అభ్యంతరంపై తదుపరి చర్యలు, దర్యాప్తుకు కూడా సిఫారసు చేయలేదు… (సదరు వార్తలోనే ఈ అంశాలున్నయ్) 6) రెండు చిన్న పేరాల్లో దీన్ని ప్రస్తావించిందే తప్ప, అవినీతి జరిగిందని అది నిర్ధారించలేదు… మీడియా పార్ట్ వెబ్ జర్నల్ అలా అర్థం చేసుకుంది, అంతే…
Ads
మరో ప్రధానాంశమూ ఉంది… ఇది రాఫెల్ యుద్దవిమానాల నమూనాల తయారీకి ఉద్దేశించిన చెల్లింపులు… ఈ డబ్బు ఇచ్చింది డెఫసిస్ సొల్యూషన్స్ అనే కంపెనీకి…! అది ఎవరిది..? సుసేన్ గుప్తా అనే వ్యాపారిది… ఆయన ఎవరు..? యూపీయే హయాంలో అగస్టా-వెస్ట్‌ల్యాండ్ చాపర్ల స్కాంలో ముడుపులు బొక్కిన దళారీ… 55 కోట్లు తిన్నాడంటూ ఈ మోడీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అరెస్టు చేసింది, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు… మరి కాంగ్రెస్ దళారీకి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రాఫెల్ డీల్‌లో డబ్బులు ఇప్పించిందా..? అంత సత్సంబంధాలు ఉంటే మొన్నమొన్ననే ఎందుకు తనను బొక్కలో వేశారు..?
ఎన్డీటీవీ వంటి చానెళ్లు ఏకంగా సదరు మీడియా పార్ట్ జర్నలిస్టులను లైన్లోకి తీసుకుని డిబేట్లు రన్ చేశాయి… ఆ వార్తలను చదివేకొద్దీ, చూసేకొద్దీ ప్రొఫెషనల్ జర్నలిస్టులకు అందులోని డొల్లతనం ఇట్టే అర్థమైపోతుంది… ఇది కొన్ని సైట్లలో కనిపించగానే కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ చేశాడు..? అసలు స్వతంత్ర దర్యాప్తు అంటే ఏమిటి..? ఎవరు దర్యాప్తు చేస్తే స్వతంత్ర దర్యాప్తు అంటారు..? తనకే తెలియాలి… లెఫ్ట్ పార్టీలు కూడా ఇదే డిమాండ్ ఎత్తుకున్నాయి… ఏదైనా భారీ అవినీతి యవ్వారం తెలిస్తే, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే గాకుండా ప్రజాధనం కోణంలో పార్టీలు రచ్చ రచ్చ చేయడం అవసరమే, సాధారణమే… కానీ మరీ ఇంత నాసిరకంగానా..!? కొడితే బోఫోర్స్ శతఘ్నిలా పేలాలి గానీ మరీ ఈ చిన్న చిన్న ఆగమాగం తోకపటాకులతో అయ్యేదేముంది..? పొయ్యేదేముంది కామ్రేడ్స్…?!
Share this Article