ఇదీ చంద్రబాబు స్కూల్ థాటే… తనతో పనిచేసినవాళ్లకే ఇలాంటి అయిడియాలు వస్తయ్… ముందుగా తమ పత్రికల్లో ఏదేదో ఉద్దేశపూర్వక కథనాల్ని ప్లాంట్ చేయడం, ప్రజాభిప్రాయం, అధికారుల అభిప్రాయం, తప్పనిసరి నిర్ణయం, ఇష్టం లేకపోయినా సమాజం కోసం తప్పడం లేదన్నట్టుగా కవరింగు ఇస్తూ చివరకు ఏదో ప్రభుత్వ పథకానికి కసుక్కుమని కత్తెర వేయడం..! ఇదీ అంతే… వరి వేస్తే రైతుబంధు ఇవ్వడట… అలాగని తాను హఠాత్తుగా డైరెక్ట్ చెప్పడు… నమస్తే తెలంగాణలో ఓ ఫస్ట్ పేజీ ఫస్ట్ లీడ్ స్టోరీ రాయించబడుతుంది… వ్యవసాయ శాఖ అధికారులట, సీఎంను కలిశారట… వరి వేస్తే రైతుబంధు ఆపేద్దాం సార్, అలాంటి ద్రోహులకు ప్రభుత్వ సాయం దేనికి సార్ అని గట్టిగా వాదించారట… నో, నో, మన రైతుల మీద మనకు కోపముంటే ఎలాగోయ్, ఏదో పరిష్కారం చూద్దాం, ఆలోచిద్దాం, మీరూ ఆలోచించండి అని కేసీయార్ ఔదార్యంతో, కరుణతో, పెద్ద మనస్సుతో రైతుల పక్షాన మాట్లాడాడట…
ఫాఫం, అధికారులే కత్తెరదారులట… కేసీయార్ మంచోడేనట… అందుకే రేప్పొద్దున రైతుబంధుకు కత్తెరపడితే కేసీయార్‌ను నిందించొద్దు సుమా… అంతా అధికారులదే పాపం… దళితబంధు పని అయిపోయింది కదా, ఇక ఇప్పుడు రైతుబంధుకు మూడినట్టేనా అని అప్పుడే ఓ కంక్లూజన్‌కు రాకండి, జస్ట్, ఇకపై వరి వేస్తేనే కత్తెర పడుతుందట… ఆ పాపభారాన్ని కూడా మోడీ మెడకు వేసేసి, తాను తప్పించుకుంటే సరి… ఇదండీ సదరు కథనం చెప్పే సారాంశం…!! కానీ ఏమాటకామాట, ఇలాంటి కథనాల్ని రాయడంలో ఈనాడే పర్‌ఫెక్ట్… అంత బలంగా, చిక్కగా అల్లే నైపుణ్యం దాని సొంతం… గతంలో చంద్రబాబు కోసం బొచ్చెడు కథనాలు రాసేది ఇలా… (అవి చదివి, రాయించిన చంద్రబాబే కొన్నిసార్లు బహుశా ఇది నిజమేమో అని భ్రమపడేంత పకడ్బందీగా రాయబడేవి…) అబ్బే, బట్టలిప్పుకు తిరిగే ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తేలకు ఆ నైపుణ్యం సాధ్యం కావడం లేదు… బేసిక్‌గా కేసీయార్ ఎదుట అధికారులు గట్టిగా వాదించారు అంటూ అంతకుముందు కేసీయార్ ప్రెస్‌మీట్‌లో చెప్పిన పాయింట్లే రాసుకుంటూ పోతే ఎవరు నమ్ముతారు..? పైగా కేసీయార్‌తో భేటీలో ఎవరైనా అధికారి కిక్కుమంటాడా అసలు..? సో, నమ్మేట్టుగా కథనం రాయడం ఓ కళ… ప్చ్, నమస్తే ఎప్పుడు ఎదుగుతుందో ఏమిటో… (నిజానికి ఇలాంటివి నమస్తేలో కాదు.., సాక్షిలోనో, ఈనాడులోనో రాయించబడాలి, నమస్తేలో రాస్తే ఎవరు నమ్మాలి..?)
Ads
మరి కేసీయార్ స్వయంగా చెప్పాడు కదా… ముందస్తుగా ఎవరైనా మిల్లర్లతో ఒప్పందాలు ఉన్నవాళ్లు, సొంత వాడకం కోసం వరి వేసేవాళ్లను ఏమీ అనం, మిగతావాళ్లు మాత్రం వరి వేయొద్దు అంటున్నాడు కదా… మరి ఇప్పుడు ఎవరి రైతుబంధుకు కత్తెరవేస్తారు..? ఎవరు సొంత వాడకం కోసం పండిస్తున్నారో, ఎవరెవరికి మిల్లర్లతో ఒప్పందాలున్నాయో తెలిసేది ఎలా..? మళ్లీ దానికీ వ్యవసాయ శాఖ సర్టిఫికెట్లు, పైరవీలు స్టార్ట్ అవుతాయా..? ఇప్పటికీ అదే వాదన, అవే అబద్ధాలు… నిల్వ, ఎగుమతులు రాష్ట్రం చేతుల్లో లేవట… స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఏమైంది..? ఆ గోదాములు ఏమైనవి..? ఎగుమతులు చేసుకుంటాం అంటే కేంద్రం వద్దని అడ్డుపడిందా..? పోనీ, వానాకాలం ధాన్యం సేకరణకు ఏ అడ్డంకులూ లేవు అంటున్నారు కదా మీరే… మరి వాళ్లకూ రైతుబంధు కత్తెర దేనికి..? అసలు రైతుసమన్వయ సమితులు ఏం చేస్తున్నాయి..? పదే పదే మోడీని తిడితే పనవుతుందా..?
అసలు ఓ వ్యవసాయ విధానం అంటూ సరిగ్గా ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు… రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉంటే కదా అన్నట్టుగా ఉంది… ఇప్పుడట సీఎం ఎదుట గట్టిగా రైతుబంధు ఆపేద్దాం సార్ అని పంచాయితీ పెట్టుకున్నారట… నిజానికి ఎవరికి భూమి ఉంటే వాళ్లకు డబ్బులు వేయడం కాదు… రైతులకు నిజంగా సాయం చేయడం అంటే… పంటల మార్పిడి జరగాలంటే, రైతు బాగుపడాలంటే… మార్కెట్‌లో ఎప్పుడూ ధరలు బాగానే ఉంటున్న పంటల వైపు ఎంకరేజ్ చేయాలి…. అది దేశానికీ మంచిది…
పప్పుధాన్యాలు, నూనెగింజలు పండించే రైతులకు భారీ సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడం, మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి అమ్మే ఆ పంటలకు అదనపు మద్దతు ధర ఇవ్వడం ఒకటీరెండు మంచి సూచనలు, వాటి ద్వారా నిజమైన రైతులకే ప్రభుత్వ సాయం దక్కుతుంది… ప్రజల సొమ్ముకు సార్థకత… సాయం అంటే… ఆధునిక వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీలు, పూలు, కూరగాయాలు, తోటల రైతులకు సబ్సిడీలు, గ్రీన్ హౌజులకు సబ్సిడీలు… ఇలా అనేకరకాలు… అసలు బీమా, పరిహారాల ధీమా సంగతేమిటి..? ఇప్పటికీ ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల దుస్థితికి అసలు కారణాలేమిటి..? అదికదా ముందుగా అధ్యయనం అవసరం… అటువైపు ఆలోచనలు, అడుగులు కదా అవసరం..?! వేలకువేల కోట్లను వ్యవసాయం చేసినా చేయకపోయినా ఖాతాల్లోకి వేస్తున్న ప్రభుత్వ అశాస్త్రీయ పథకం అలా ఉంటే… మరోవైపు 250 కుటుంబాలకు ఆఫ్టరాల్ 15 కోట్ల పరిహారం ఏళ్లు గడుస్తున్నా ఇవ్వకపోవడం…. కేసీయార్ ఎదుట గట్టిగా వాదించేగలిగిన ఖతర్నాక్ వ్యవసాయ శాఖ అధికారులు దీన్నేమంటారో..?! అన్నట్టు మోడీజీ, కేసీయార్ ఎదుట రైతుజాతి క్షేమం కోసం ఇంత బలంగా నోళ్లు వప్పి వాదించగల ఈ సమర్థ అధికారులకు పద్మశ్రీలు గట్రా ఇవ్వగలిగితే తెలంగాణ మిమ్మల్ని ఎప్పటికీ యాద్ చేసుకుంటది…!!
Share this Article