.
సాధారణంగా అబ్బాయి- అమ్మాయి గుణగణాలు; జాతకాలు; తారాబల చంద్రబలాలు; ఈడు జోడు; చదువు సంధ్యలు; ఎత్తు; రంగు; జీతభత్యాలు, కులగోత్రాలు; ఇతర అలవాట్లు; అభిరుచులు చూసి పెళ్ళి సంబంధం ఖరారు చేయడమో, కుదరదని చెప్పడమో చేస్తుంటారు.
ఇవన్నీ చూసి కుదిర్చిన సంబంధాలన్నీ ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కునే ఉన్నాయా? అంటే అదో పెద్ద చర్చ. కనీసం ఇన్ని లక్షణాలు చూసి చేస్తే అతుక్కుని ఉంటాయని అనాదిగా ఒక నమ్మకం, ఆచారం. అలా పెళ్ళి చూపులకు లోకంలో కొన్ని కొలమానాలు, ఆదర్శాలు స్థిరపడ్డాయి.
Ads
ఇప్పుడు ఈ చెక్ లిస్ట్ లో “అబ్బాయి ఊరికి రోడ్డుందా?” అన్నది కూడా వచ్చి చేరింది. నిజానికి ఇదే ప్రధానమై… మిగతావన్నీ అప్రధానమయ్యాయని సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కొలువుదీరిన నిండు సభలోనే చెప్పారు.
చట్టసభ ఉన్నదే చట్టాలను చేయడానికి, పరిపాలనలో ఆ చట్టాల పనితీరును సమీక్షించడానికి. అలాంటి అత్యున్నత సభలో చర్చకు వచ్చిన ఈ విషయంమీద సభలో, బయటా చాలా చర్చ జరగాలి. ఇంతటి తీవ్రమైన సమస్యను తనకు తానుగా సోదాహరణంగా ప్రస్తావించిన స్పీకర్ ను అభినందించాలి.
నిజమే కదా!
రోడ్డే లేని ఊరికి ఏ అమ్మాయినైనా ఎందుకిస్తారు? పాతికేళ్ళపాటు పువ్వుల్లో పెట్టి పెంచుకున్న ఇంటి మహాలక్ష్మిని ముళ్ళబాటలో, గతుకుల రోడ్లమీద, కంకర తేలి కాలికి గుచ్చుకునే దారుల్లో, కార్లు, బైకులు వెళ్లలేని రోడ్లలో, బస్సులే రాని దారుల్లో నడిపించడానికి ఎంతటి కసాయి తండ్రికైనా మనసెలా ఒప్పుతుంది?
నిజమే కదా!
అబ్బాయి గుణవంతుడు, యోగ్యుడు, చదువుకున్నవాడు, ఆస్తిపరుడే కావచ్చు. కానీ అమ్మాయితో పైరగాలుల్లో సూర్యుడు పడమటి కొండల్లోకి దిగేవేళ బైకు మీద మేఘాలలో తేలుతూ… కోటి కోర్కెల కొత్త సంగతులేవో మనసులో మరులుగొలుపుతుండగా అబ్బాయి బైకుమీద వెళ్ళడానికి నున్నని రోడ్డే లేకపోతే… ఈ నవదంపతుల ప్రేమోత్సవ విహారాలకు దారేది?
నిజమే కదా!
అమ్మాయి పుట్టింటికి వచ్చి…వె ళ్ళాలన్నా, మనమే అమ్మాయిని ఒకసారి చూసి… రావాలన్నా ఆ ఊరికి రోడ్డే లేకపోతే… అమ్మాయి అశోకవనంలో ఒంటరి సీతమ్మలా శోకిస్తూ ఉండదా?
నిజమే కదా!
రేప్పొద్దున పిల్లాపాపా పుడితే… వారెలా తిరుగుతారు? రేప్పొద్దున ముసలిముప్పున ఏ ఆసుపత్రికో వెళ్లాల్సివస్తే… ఊరికి రోడ్డే లేకపోతే ఎలా?
… ఇలా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి తెలుసుకున్నా… తెలుసుకోకపోయినా… ఆ ఊరికి రోడ్డు లేదు- అన్న ఒకే ఒక్క కారణంతో కనీసం అబ్బాయి ఫోటోను కూడా అమ్మాయిలు చూడడం లేదట. రోడ్డున్న ఊళ్ళకు కరువా! అని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయి జాతకం, ఫోటోలు తీసుకుని అటు వెళ్ళిపోతున్నారట.
ఇది ఇలాగే కొనసాగితే… చివరికి సామాజిక అసమతౌల్యానికి దారి తీస్తుంది. రోడ్డులేని ఊళ్ళన్నీ పెళ్లికాని ప్రసాదులతో నిండిపోయి… అబ్బాయిల తల్లిదండ్రుల గుండెల మీద ఆరని కుంపట్లుగా తయారయ్యే ప్రమాదముంది. కొన్ని వినడానికి విచిత్రంగా, చిన్న సమస్యల్లా అనిపించినా నిజానికి అవి చాలా పెద్ద సమస్యలు.
“రోడ్లులేవని పిల్లనిస్తలేరు” అన్న స్పీకర్ ఆవేదన అలాంటి ఒకానొక పెద్ద సమస్య. నోరు తెరిచి అడిగిన స్పీకర్ నియోజకవర్గంలో అయినా రోడ్లెప్పుడు పడతాయో! రోడ్లు లేక కుదరని సంబంధాలు… రోడ్లు పడి… కుదిరి… ఎప్పుడు సంసారం దారి పడతాయో! ఏమో!
రోడ్డే కాదు…పల్లె కూడా అడ్డే!
———–
మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లా. కన్నాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ రాజ్ పూత్ కు ఆయన అనుచరుడు ఉదయాన్నే ఫోన్ చేశాడు. ఇంత పొద్దున్నే ఊళ్ళో ఏ సమస్యో! అని ఆదుర్దాగా అడిగాడు ఎమ్మెల్యే.
“అన్నా! ఇది నా సమస్య. నాలాగా ఊళ్ళో వందల మంది యువకుల తీరని సమస్య అన్నాడు అనుచరుడు. నాకు తొమ్మిదెకరాల పొలముంది. అయినా పల్లెవాడివి అంటూ ఇప్పటికి పదిమంది అమ్మాయిలు నా సంబంధాన్ని తిరస్కరించారు. ముప్పయ్యేళ్లు మీద పడ్డాయి. మాకు నువ్వే ఏదో ఒక సంబంధం కుదిర్చి…దారి చూపాలన్నా…” అంటూ వలవల విలపించాడు.
ఈ సంభాషణ ఆడియో, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మీడియావారు దీని మీద ఎమ్మెల్యే స్పందన అడిగారు.
“నిజమే. రెండు వేల మంది జనాభా ఉన్న ప్రతి పల్లెలో వంద నుండి నూట యాభై మంది దాకా పెళ్ళికాని అబ్బాయిలున్నారు. ఆస్తి లేకపోయినా పట్నంవాడిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడే అమ్మాయిలు… వందెకరాల ఆస్తికి వారసుడైనా… పల్లెవాడన్న ఒకే ఒక కారణంతో వద్దంటున్నారు.
పల్లెల్లో ఇలా పెళ్ళికాని నా కార్యకర్తల బాధ బాధ కాదు. అందుకే వారి బయోడేటాలు తెప్పించుకుని… నాకు తెలిసిన సంబంధాలు వెతికి పెట్టే పనిలో ఉన్నాను- బాధ్యతగల శాసనసభ్యుడిగా” అని ఆయన కూడా మీడియా మైకుల ముందు బాధపడ్డారు.
“పల్లె కన్నీరు పెడుతుందో…
పెళ్ళి సంబంధం కుదరక!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article