మనం చాలాసార్లు చెప్పుకున్నాం… కార్తీకదీపం తెలుగు నిర్మాతల కక్కుర్తి యవ్వారం గురించి… ఆ మలయాళ ఒరిజినల్‌కూ దీనికీ అసలు సంబంధమే లేకుండా పోయింది… ఇష్టారాజ్యంగా కథను, కథనాన్ని మార్చేస్తూ, కొత్త పాత్రల్ని తెస్తూ, కొన్ని తొలగిస్తూ… ఏది తోస్తే అది తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు… ఆ నల్ల పిల్ల ఏకంగా రంగుమారి తెల్ల స్త్రీ అయిపోయింది అంటేనే అర్థం చేసుకొండి…
ఏ ప్రాంతీయ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు లేనంతగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు… పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఈ సీరియల్ రేటింగులతో పోటీపడలేకపోయేవి… కోట్లకుకోట్ల డబ్బు మింటింగ్… ఐనా సదరు నిర్మాత తనివి తీరలేదు, ఆతని కాంక్ష తీరలేదు… ఒక జనరేషన్ పాటు నడిపించాలని అనుకున్నాడేమో సీరియల్‌ను… ఫస్ట్ జనరేషన్‌ను చంపిపారేసినట్టు ఓ కథ వండించాడు… సెకండ్ జనరేషన్‌ను చిత్రించడం మొదలుపెట్టాడు…
నా ఇష్టమొచ్చినట్టు కథ చెబుతా అంటే ప్రేక్షకుడు వింటాడా..? అసలే చెత్త చెత్త సీరియళ్లు అన్నీ చూసి భరించి, రాటుదేలిన తెలుగు టీవీ మహిళా ప్రేక్షకులు వింటారా..? ఎహెఫోరా, నీ తొక్కలో సీరియల్, దరిద్రం చేసేశావు కదరా అని తిట్టేసుకుని, చూడటం మానేశారు… దాంతో ఆ సీరియల్ రేటింగ్స్ సగానికి డామ్మని పడిపోయాయి… నిర్మాత కళ్లు బైర్లు కమ్మాయి… వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత ఇలా అందరన్నీ చంపి పారేద్దామనుకుంటే, ప్రేక్షకులు నన్ను పాతరేస్తున్నారు అనుకున్నాడు…
Ads
ఐనా ఏముందిలే… మన సీరియళ్ల ప్రేక్షకులే కదా… మన ఇష్టమొచ్చినట్టు కథకు ట్విస్టులు ఇవ్వవచ్చు… తీసేవాడికి చూసేవాడు లోకువ… కారుచౌక అన్నట్టుగా కారు లోకువ అనాలేమో… ఇక లాభం లేదు అనుకుని, చంపి ఆల్రెడీ ఫోటోకు దండలేసిన వంటలక్కను బతికించేశాడు, హాస్పిటల్‌లో కోమాలో ఉన్న ఆమె హఠాత్తుగా ఉలిక్కిపడి, మళ్లీ తెలుగు టీవీ ప్రేక్షకుల్ని అర్జెంటుగా ఉద్దరించడానికి రీఎంట్రీ ఇచ్చింది… మరి ఆమె వచ్చాక ఓ జీవితకాలపు అనుమానప్పక్షి డాక్టర్ బాబు ఊరుకుంటాడా..? తనూ బతికాడు…
ఇక మోనిత పాత్రకు మాత్రమే అన్యాయం ఎందుకు..? ఆమె కూడా తెర మీదకు వచ్చేసింది… ముగ్గురూ కలిసి ఉద్దరించేసి, రేటింగ్స్ పెంచేసి, మరికొన్నికోట్లు ప్రింట్ చేసి, నిర్మాతకు ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారు… కానీ రీఎంట్రీ అంటేనే ఓ ఫేక్ బాగోతం… కావాలని తమను మోసగించడానికి ఈ వేషాలన్నీ వేస్తున్నాడు నిర్మాత అని ప్రేక్షకులకు అర్థమైంది… దాంతో ఏమైంది..? నిర్మాత ఆశించినట్టు రేటింగ్స్ స్టాక్ మార్కెట్‌లాగా ఏమీ ఎగిసిపడలేదు…
ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు… ఇదుగో ఈ బార్క్ రేటింగ్ చూడండి… హైదరాబాద్ కేటగిరీ… సరే, ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేసులో అదే… కానీ పెద్దగా జంపేమీ లేదు… పైగా ఒక శుక్రవారం రోజున మరీ పది లోపలకు వెళ్లిపోయింది… గుప్పెడంత మనస్సు దభీదభీమని దెబ్బలు వేస్తోంది… కారణం ఏమిటంటే సింపుల్… అసలు టీవీ సీరియళ్ల కథలే లక్షశాతం కృతకం… ఇది మరీ ప్రేక్షకుల్ని ఎడ్డోళ్లను చేసే వీరకృతకం… ఎల్లవేళలా ప్రేక్షకుల్ని అండర్ ఎస్టిమేట్ చేసి, హౌలాగాళ్లను చేద్దామంటే కుదరదండోయ్…!!
Share this Article