బాండ్… జేమ్స్ బాండ్… 25 సినిమాలు… అసలు బాండ్ అంటే ఎలా ఉండాలి..? సిగ్నేచర్ ట్యూన్‌తో గూస్ బంప్స్ మొదలైతే ఎండ్ వరకూ ఎక్కడా థ్రిల్ ఆగొద్దు… మధుబాబు నవలల్లో షాడో పాత్రలాగా… తెలుగు సినిమాల్లో మడత నలగని హీరోలాగా… పేలుళ్లు, కాల్పులు… సముద్ర అంతర్భాగం నుంచి అంతరిక్షం దాకా… ఎడారుల నుంచి మంచుమైదానాల దాకా… బాండ్ అడుగుపెడితే ఆపరేషన్ సక్సెస్ కావల్సిందే… సినిమా చివరలో తను కన్నుగొట్టి, అదో తరహా చిరునవ్వుతో ప్రేక్షకుడికి బైబై చెప్పాల్సిందే…
ఏ ఆపరేషన్ అయినా ఎవరో తోడు దొరకాలి, వాటేసుకోవాలి, వాడేసుకోవాలి… డ్యూటీ కోసమే… లవ్వూ కొవ్వూ జాన్తా నై… తన వాచీలో, తన బూట్లలో, తన కార్లలో… వాట్ నాట్… అన్నీ అబ్బురంగా కళ్లప్పగించేలా చేస్తయ్… లుక్కుకే ప్లేబాయ్… తన ప్లే అంతా ఆపరేషన్ సక్సెస్ కోసమే… లైసెన్స్‌డ్ టు కిల్… తుపాకీ బయటికొస్తే శత్రుగణం టపటపా రాలిపోవల్సిందే… కానీ ఇప్పుడేం జరిగింది..?
చంపేశారు… అరె, జేమ్స్‌బాండ్‌కు మరణం ఏమిటి అసలు..? అదీ సగటు బాండ్ ప్రేమికులకు కలుక్కుమనే ముగింపు… చావును తనే ఆహ్వానిస్తాడు… దాని వెనుక ప్రేమ, ఎమోషన్, అనివార్యత… బాండ్ సినిమాల్లో అత్యంత అరుదుగా లవ్వులు, ఎమోషన్లు ఉంటయ్… కానీ ఇందులో ఆ ఉద్వేగానికే పెద్దపీట… సినిమా పేరు నో టైమ్ టు డై… నో కొట్టేస్తే సరిపోయేది… ఎస్, టైమ్ టు డై అనే పేరు కరెక్టుగా సూటయ్యేదేమో…
Ads
పదహారేళ్లుగా… అయిదు బాండ్ సినిమాల్లో నటించిన డేనియల్ క్రెగ్ ముందే చెప్పాడు… ఇది తన చివరి బాండ్ సినిమా అని… కానీ బాండ్ పాత్రకే ముగింపు ఇస్తారని ప్రేక్షకుడు అనుకోడు కదా… (నిజానికి ఈ ముగింపు గురించి చెప్పకూడదు… సినిమా థ్రిల్ పోతుంది కాబట్టి… కానీ సినిమా చాలా రోజులైంది విడుదలై… పాతబడింది… రివ్యూల కామెంట్లలో ప్రేక్షకులు ఆల్‌రెడీ దీన్ని వెల్లడించారు… తాజాగా ప్రైమ్‌లో సౌత్ ఇండియన్ భాషల ఆడియోతో కూడా ఈ సినిమా రిలీజ్ చేశారు… కరోనా భయంతో మన దగ్గర చాలామంది బాండ్ అభిమానులు థియేటర్లకు వెళ్లలేదు… వాళ్లంతా ఇప్పుడు ప్రైమ్ ట్యూన్ చేస్తున్నారు…)
నిజానికి పెద్ద కథేమీ కాదు… ఐనా బాండ్ సినిమాలకు కథ దేనికి..? ఒక్కో సీన్ చిత్రీకరణ చూస్తుంటే నోళ్లు తెరుచుకుని తెరకు కళ్లప్పగించాల్సిందే… కానీ ఈ సినిమాలో అలాంటి సీన్లు పెద్దగా లేవు… చివరి అరగంట, మధ్యలో ఒకటీరెండుసార్లు మినహా పెద్దగా యాక్షన్ కూడా లేదు… విలన్ ప్రపంచ వినాశకారి జీవాయుధం ఒకటి కనిపెడతాడు… (చైనా జాతీయుడిగా చూపించలేదు)… ఓ మారుమూల ద్వీపంలో తయారీ అడ్డా… హీరోయిన్ ప్లస్ కూతుర్ని ఎత్తుకుపోతాడు… దానికీ ఓ నేపథ్యం… రిటైరై ప్రశాంతంగా కాలం గడుపుతున్న హీరో తప్పనిసరై వెళ్లి విడిపిస్తాడు… ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు..?
కానీ ఆ మామూలు కథలకే బాండ్ బ్రాండ్ గ్రాఫిక్, గ్రాండియర్ హంగులు అద్దుతుంది… బాండ్ అంటే ఓ మానవాతీతుడు… అఖండ… అలాంటిది ఈ సినిమాలో ఆ మాస్, ఆ థ్రిల్, ఆ భారీతనం ఎందుకో మిస్సయిన భావన… ఏదో వెలితి… అది బాండ్ మరణం తాలూకు ఉద్వేగం కాదు… ఊపిరి బిగబట్టి చూసే ఉద్విగ్న సన్నివేశాల్లేవ్… చివరకు సినిమా నిడివి కూడా విసుగెత్తించేదే… 2.45 గంటలు… ఓ అరగంట కోసిపారేస్తే కాస్త బాగుండేది… కానీ ఏమాటకామాట… డేనియల్ నటన, హీరోయిన్ లియా సెడొక్స్ ముగ్ధత్వం, నేపథ్యసంగీతం… బాగున్నయ్…!!
Share this Article