Om Namah Shivaya: మహాశివరాత్రి రోజు ఎప్పటిలా తెల్లవారకముందే లేచి ట్రెడ్ మిల్, వ్యాయామం పూర్తి చేసి… తలుపు తెరిచి… గుమ్మం ముందు పాలు, న్యూస్ పేపర్లు తీసుకున్నాను. శివరాత్రి గురించి అన్ని పత్రికల్లో వ్యాసాలు, వార్తలను చదివితే పండగపూట పుణ్యమయినా వస్తుందనుకుని మొదట అవే చదివాను. శివరాత్రి వ్యాసాలకంటే ‘ఈనాడు’లో పాన్ బహార్ వారి శివరాత్రి శుభాకాంక్షల ఫుల్ పేజీ రంగుల ప్రకటన నన్ను చాలా అయోమయానికి గురి చేసింది.
నిజానికి శివుడిని అర్థం చేసుకోవడానికి శివుడే జ్ఞానమివ్వాలి. అలా ఈ ప్రకటనను అర్థం చేసుకోవడానికి కూడా శివుడయినా జ్ఞానమివ్వాలి. లేదా పాన్ బహార్ వారయినా దయదలిచి జ్ఞాన మసాలా ఇవ్వాలి.
Ads
కూరల్లో మసాలాలకే నాకు కళ్లల్లో నీళ్ళొచ్చి… నోరంతా పొక్కినట్లు అయిపోతూ ఉంటుంది. పాన్ మసాలా ఎలా ఉంటుందో తెలియదు. పాన్ మసాలాలు తినేవారి మీద నాకెలాంటి వ్యతిరేకత కూడా లేదు. ఎవరి రుచులు వారివి. బహుశా హార్లిక్స్, బోర్నవిటాలా పాన్ మసాలా కూడా ఒక బలవర్ధకమయిన పోషకాహారమేమో? నాకు తెలియదు.
పాన్ మసాలలో “బాహుబలి” అన్నది ఒక పాన్ బహార్ వారి ఒకానొక బ్రాండ్. ఆ బాహుబలి పాన్ మసాలా తినేవారు ఈ ప్రకటన ప్రకారం “బాహుబలులు”. ఆ బాహుబలులకు ఈ పాన్ బహార్ కంపెనీవారు శివరాత్రి పూట బాధ్యతగా, గౌరవంగా, పవిత్రంగా, మర్యాదగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కింద “నో టొబాకో, నో నికోటిన్” అని ఉంది కాబట్టి బాహుబలులు తింటున్నది మహా ప్రసాదమే అయి ఉంటుంది.
ఎటొచ్చి… కింద చీమ తలకాయంత కనిపించని సైజు చిన్న అక్షరాల్లో- “పాన్ మసాలా నమలడం ఆరోగ్యానికి హానికరం. చిన్న పిల్లలు అస్సలు తినకూడదు” అని ఇంగ్లీషులో ఇచ్చారు.
శివ శివా! అని కాసేపు ప్రాధేయపడితే శివుడయినా ప్రత్యక్షమవుతాడేమో కానీ… పాన్ ఇండియా రేంజులో ఇచ్చిన ఈ ప్రకటన మాత్రం అర్థం కావడం లేదు. అంతగా ఆరోగ్యానికి ప్రమాదకరమయిన పాన్ మసాలాను తినండహో అని మసాలా పొట్లానికి శివుడి త్రిశూలాన్ని ఎందుకు తగిలించారు? టొబాకో, నికోటిన్ లేనప్పుడు… పక్కనే పాన్ మసాలా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
ఇలాగే సిగరెట్టు పెట్టెలకు, మందు బాటిళ్లకు కూడా కింద ఆరోగ్యానికి హానికరం అని స్టాట్యుటరీ హెచ్చరికను ముద్రించి… ఇలాగే త్రిశూలాలు, శంఖు చక్రాలను వాడుకున్నా మన కళ్లు చూడవా? మనకేమీ పట్టదా?
హర హర మహాదేవ్!
నీకయినా అర్థమవుతోందా?
నీ పేరుతో ఏమి జరుగుతోందో?
శివుడి త్రిశూలంతో శివుడినే పొడవగలిగిన పాన్ మసాలాల బాహుబలులు పుట్టిన పాడు కాలం. పిదప కాలం.
శివ…శివా!
-పమిడికాల్వ మధుసూదన్ [ 99890 90018 ]
madhupamidikalva@gmail.com (పాత పోస్టు)
Share this Article