మోడీ, అమిత్ షా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ బీజేపీ పార్టీ, కాషాయ విభాగాలు, పలు రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు… వచ్చే ఎన్నికల నాటికి మరింతగా ఆ ఇద్దరి పట్టు పెరగొచ్చు కూడా..! కానీ వాళ్లకు ఏమాత్రం మింగుడుపడని రాష్ట్రాలు ప్రధానంగా రెండు… 1) ఏపీ 2) తమిళనాడు… ఈ రెండు రాష్ట్రాల రాజకీయాల సరళి వాళ్లకు అంతుపట్టడం లేదు… కాస్త డొక్కశుద్ధి, నాయకత్వ లక్షణాలున్న ఒక్క నాయకుడు లేడు…
ఏపీని కాసేపు వదిలేయండి, ఆ రాజకీయాలంటేనే బూతులు, కేసులు, కులాలు..! ఏపీ రాజకీయాల్లో ఏం చేయాలో బీజేపీ హైకమాండ్‌కు ఒక దశ లేదు, ఒక దిశ లేదు… తమిళనాడు రాజకీయాలకు వద్దాం… జయలలిత మరణం తరువాత చిన్న స్పేస్ క్రియేట్ చేసుకుని, అందులోకి దూరి, అక్కడి రాజకీయాల్లో ఎదగాలని భావించింది బీజేపీ… ఆచరణకు వచ్చేసరికి తనేం చేస్తున్నదో తనకే అర్థం కానంత గందరగోళాన్ని క్రియేట్ చేసుకుని, అందులోకి జారిపోయి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం గాక అటూఇటూ చూస్తోంది…
శశికళను శంకరగిరి మాన్యాలు పట్టించింది… అన్నాడీఎంకేలో నాయకత్వ రాహిత్యం… ఆ పార్టీలో ఏదో తాత్కాలికంగా పబ్బం గడుపుకునే కేరక్టర్లే తప్ప స్థిరంగా నిలబడి పార్టీని ఉద్దరించే వాళ్లు కనిపించడం లేదు… మళ్లీ ఇప్పుడు రెండు గ్రూపులుగా చీలి తన్నుకుంటున్నారు… నానాటికీ బలహీనపడుతోంది… కానీ దాని పతనావస్థ బీజేపీకి ఉపయోగపడుతోందా..? డౌటే..! పార్టీలోనే ఆ సందేహముంది…
Ads
రజినీకాంత్‌ను వాడుకుందామని చూసింది… అసలే పిరికిమేళం… ఆ ధీరోదాత్తత సినిమాల్లోనే… నిజజీవితంలో అంత సీన్ లేదు… ఏళ్ల తరబడీ కొత్త పార్టీ పెడతానంటూ ప్రకటనలు, కసరత్తులే తప్ప ఊదు కాలింది లేదు, పీరు లేచింది లేదు… రజినీని తమ పార్టీలోనికే తీసుకుంటే, తన అభిమానులు పూర్తిగా బీజేపీ వైపు నిలబడతారో లేదో అనే డౌట్, పోనీ, సపరేటుగా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టిస్తే క్లిక్ అవుతాడో లేదో అనే డౌట్… కమల్‌హాసన్ పొలిటికల్ సినిమా డిజాస్టరైన దృశ్యం కళ్లెదుట కనిపిస్తూనే ఉంది కదా… చివరకు ప్రాంతీయ పార్టీ పెట్టకుండా బలమైన ఒత్తిళ్లు… ఆరోగ్యం, వయోభారం సాకులతో రాజకీయాలకు పూర్తిగా దూరం అని ప్రకటన ఇప్పించారు… ఇంటర్వెల్…
రజినీకాంత్‌కు గవర్నర్ పోస్టు ఇస్తారనీ, తద్వరాా తన అభిమానుల ఆదరణను పొందడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని తాజా వార్తలు… తమిళ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు… ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో బాగా ఉత్సాహంగా రాసుకొచ్చారు… నిజానికి మొన్న ఏదో మీటింగు కోసం ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలను కలిసి వచ్చాక రజినీకాంత్ తమిళనాడు గవర్నర్‌తో భేటీ అయ్యాడు… కారణాలు తెలియవు గానీ, మీడియాతో మాత్రం రాజకీయాల్లోకి ఇక వచ్చేది లేదనే క్లారిటీ ఇచ్చాడు…
మరి రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా బీజేపీకి ఎలా ఉపయోగపడతాడు..? తనకు గవర్నర్ గిరీ ఇస్తే తన అభిమానులంతా పోలోమంటూ జైబీజేపీ అంటారా..? ఒక ప్రాంతానికి చెందిన ప్రముఖుడికి గవర్నర్ పోస్టు ఇస్తే, ఆ ప్రముఖడి రాష్ట్రంలో పార్టీ బలం పెరుగుతుందనే భావనే పెద్ద అబ్సర్డ్… అలాంటి భ్రమల్లో బీజేపీ ఉండదు… పోనీ, ఎన్నికల్లో బీజేపీకి సహకరించాలని రజినీకాంత్ అధికారికంగా పిలుపునిస్తాడా..? తన ధోరణి రీత్యా అదీ నమ్మలేం…
ఒకవేళ అలా పిలుపునిచ్చినా అది పనిచేస్తుందా అనేదీ డౌటే… గతంలో జయలలితకు వ్యతిరేకంగా పిలుపునిచ్చి భంగపడిన చేదు అనుభవం ఉంది తనకు… ప్రత్యక్షంగా తను పాలిటిక్స్‌లో ఉండటం వేరు, లోపాయికారీ సహకారం వేరు… వయస్సు పెరిగింది, అనారోగ్యం, కొత్త హీరోలు దుమ్ము రేపుతున్నారు, గతంలో ఉన్నంత అభిమాన తీవ్రత ఇప్పుడేమీ లేదు… సినిమా వాళ్ల రాజకీయాల పట్ల జనంలో పెద్ద ఆసక్తి లేదు… ఈ స్థితిలో తను చేయగలిగేది ఏమీ లేదు… బీజేపీకి ఉపయోగమూ లేదు…
నిజానికి ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చారో బీజేపీ వాళ్లకే అంతుచిక్కలేదు… రాజకీయ కోణంలో మాత్రం పార్టీకి ఏమాత్రం లబ్ధి చేకూర్చలేని నిర్ణయం అది… ఒక రజినీ ఫ్యాన్స్ వేరు, ఒక కమల్ ఫ్యాన్స్ వేరు… వాళ్ల వీథుల్లోకి వచ్చే బాపతు… కానీ ఇళయరాజాను అభిమానించే వాళ్లు వేరు… సో, ఏ కోణం నుంచి చూసినా సరే, బీజేపీకి రజినీకాంత్ ప్రాపకం సహా వేరే ఆచరణీయ దిక్కేమీ కనిపించడం లేదు… ఒక్క అన్నామలై తప్ప… తను కొంతలోకొంత నయం… ఈ మాజీ ఐపీఎస్ అన్నామలై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఓ కదలిక కనిపిస్తోంది… గతంలో బీజేపీ అంటేనే ఓ అస్పృశ్య పార్టీలా చూసే తమిళజనం ఈ నాయకుడు పెట్టే మీటింగులకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు… హార్డ్ వర్కర్…
ఇంకా రజినీకాంత్‌లు ఏదో చేస్తారనీ,.. పన్నీర్ సెల్వం ఏదో చేస్తాడనీ… ఈ పాత వాసనలను, పాత భావనల్ని, పాత వ్యూహాల్ని వదిలించుకోకపోతే పార్టీకి ఒరిగేదేమీ ఉండదు… తమిళ రాజకీయాల డీఎన్ఏ వేరు… దాని మూలాల్ని పట్టుకుని, దళిత బహుజనుల్లోకి కూడా చొచ్చుకుపోతున్న అన్నామలై కాళ్లల్లో కట్టెలు పెట్టకుండా ఉంటే తమిళ బీజేపీకి అదే పదివేలు..!!
Share this Article