.
అనేకానేక ఉచిత పథకాల పేర్లు చెప్పి, ప్రజలను ప్రలోభపెట్టి, కుర్చీ ఎక్కి… ఖజానాను భ్రష్టుపట్టించే ప్రతి రాజకీయ పార్టీ చదవాల్సిన వార్త… రేవంత్ రెడ్డి, చంద్రబాబు మాత్రమే కాదు, కేసీయార్, జగన్ కూడా చదవాల్సిన వార్త… ప్రత్యేకించి రాహుల్ గాంధీ, సునీల్ కనుగోలు తప్పకుండా చదవాల్సిన వార్త…
ఏమిటంటే..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్నాటకలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోబోతోంది… పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వే తేల్చి చెప్పింది… 1985 నుండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సొంతంగా సంపూర్ణ మెజార్టీ సాధించలేదనే అంశం ఇక్కడ గమనించాల్సిన విషయం…
Ads
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10,481 శాంపిల్స్‌తో 17 ఏప్రిల్ నుండి 18 మే వరకు నెల రోజులపాటు ట్రాకర్ పోల్ నిర్వహించింది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుండగా, మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113… ఈ సర్వే ఫలితాల ప్రకారం ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 51 శాతం ఓట్లతో 136- 159 స్థానాలు, కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో 62-82 స్థానాలు, జేడీ (ఎస్) 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని వెల్లడైంది…
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 10.7 ఓట్ల శాతం స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది… పహల్గాం ఘటన, అనంతరం ఆపరేషన్ సిందూర్ కూడా బీజేపీకి కొంత సానుకూలతను పెంచవచ్చుగాక… కానీ అసలు ఈ ఫలితాలకు కారణం కాంగ్రెస్ అసమర్థ పాలనే….
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42.88 శాతం ఓట్లతో 135 స్థానాలు, బీజేపీ 36 శాతం ఓట్లతో 66 స్థానాలు, జేడీ (ఎస్) 13.29 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలుపొందగా.., ఈ రెండేళ్ల వ్యవధిలో పూర్తిగా రివర్స్… ఆటలో అరటి పండు జేడీఎస్‌ను మినహాయిస్తే… రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల నడుమే పోటీ…
సిక్స్ గ్యారంటీలు అంటూ అలవిమాలిన వాగ్గానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల జనంలో ప్రస్తుతం ఆదరణ లేదు… పాలన వైఫల్యం… హిందూ సామాజికవర్గంలో బీజేపీకి 58.5 శాతం ఆదరణ లభిస్తుండగా, కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణ కేవలం 32 శాతానికే పరిమితమైంది… ముస్లిం సామాజికవర్గంలో 85.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ పటిష్టంగా ఉండగా, బీజేపీ కేవలం 9.3 శాతం ఓట్లే పొందే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది…
రాష్ట్రంలో కీలకమైన లింగాయత్ సామాజికవర్గంలో బీజేపీకి 78.9 శాతం ఆదరణ లభిస్తుండగా, కాంగ్రెస్‌కు కురుబా సామాజికవర్గంలో 54.6 శాతం ఆదరణ కనిపిస్తోంది. మరోవైపు ఒక్కలిగ సామాజికవర్గంలో బీజేపీకి 47.8 శాతం, జేడీ (ఎస్)కు 24.6 శాతం, కాంగ్రెస్ కు 22.9 శాతం ఆదరణ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది…
ఇక్కడ బీజేపీకి ప్రధానలోపం మంచి నాయకుడు లేకపోవడం… స్టేట్ లెవల్ పాపులారిటీ ఉన్న లీడర్‌ను ఎలివేట్ చేస్తే బీజేపీ వోట్లు ఇంకా పెరుగుతాయి… కానీ ఆ సోయి బీజేపీలో లేదు, అది వేరే సంగతి… ఈరోజుకూ ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని ఈ సర్వేలో మరోసారి స్పష్టమైంది…
రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు 29.2 శాతం మద్దతు ఇస్తుండగా, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కు 10.7 శాతం, జేడీ (ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామికి 7.6 శాతం, బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియురప్పకు 5.5 శాతం, కర్ణాటక బీజేపీ అధ్యక్షులు బీ.వై. విజయేంద్రకు 5.2 శాతం ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది…
చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, జనం గురించి తెలుసు కాబట్టి, ఏవో హామీలు ఇచ్చి, గట్టెక్కి, ఆ హామీల అమలు విషయంలో తొందరపడటం లేదు… కానీ రేవంత్ రెడ్డి మాత్రం వాతలు పెట్టుకుంటున్నాడు… ఇప్పటికే ఖజానా దివాలా సిట్యుయేషన్ అనీ, ఎవ్వడూ అప్పు కూడా ఇవ్వడం లేదని తనే చెప్పుకుంటున్నాడు…. ఇక రాబోయే రోజులేమిటో…
బటన్ జగన్ పంపిణీలు,.. చంద్రబాబు, రేవంతుల హామీల పల్టీలు… కాంగ్రెస్‌కు దీటైన హామీలను మేనిఫెస్టోలో పెట్టిన కేసీయార్… అందరూ… అందుకే కర్నాటక తాజా రాజకీయ స్థితిని చదవాలి… అదే ఈ కథన ఉద్దేశం… జనానికి కావల్సింది సమర్థ పాలన… ప్రలోభాలు కావు..!!
Share this Article