.
. ( కె.శోభ ) .. …. అక్కడ అన్ని కిటికీలూ బంద్
‘మేరె సామ్ నే వాలీ కిడికి పే
ఏక్ చాంద్ కా టుక్ డా రహతీ హై ‘…
ఇకముందు ఆఫ్గనిస్తాన్ లో ఎవరైనా తమ ప్రియమైన వారిని చూస్తూ ఈ పాట పాడుకోలేరు. అంతే కాదు, మహిళలకు కాస్తంత కూడా బయటి ప్రపంచం కనిపించదు. ఎందుకంటే అక్కడ ఇళ్లకు కిటికీలు పెట్టుకోకూడదని అక్కడి తాలిబన్ ప్రభుత్వం శాసనం చేసింది.
Ads
అసలు కిటికీలు లేని ఇళ్ళు ఊహించగలమా! గవాక్షాలు ఇంటికి కొత్త అందాన్నివ్వడమే కాదు, గాలి, వెలుతురు తీసుకొస్తాయి. మానవ నాగరికత మొదలైనప్పటినుంచి, రాజుల కాలంతో పెరిగి ఇప్పటివరకు కిటికీలు లేని ఇళ్ళు అరుదే. ఆఖరికి జైళ్లలో కూడా చిన్న కిటికీలుంటాయి.
ఇక కిటికీలు మోసుకొచ్చే మాటలు, పాటల గురించి చెప్పక్కరలేదు. కాలక్రమేణా కిటికీల ఆకారంలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడైతే గోడలో సగం కిటికీ ఉంటుంది. కొన్ని ఆఫీసులు మొత్తం కనిపించేలా కడుతున్నారు. ఊరందరిదీ ఒకదారయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టు ఆఫ్గనిస్తాన్ లో మాత్రం కిటికీలు లేకుండా ఇళ్ళు నిర్మించాలని హుకుం జారీ చేసింది అక్కడి తాలిబన్ ప్రభుత్వం.
ఇప్పటికే అనేక రకాలుగా మహిళలని ఇంటికి పరిమితం చేసిన తాలిబాన్ తాజా చర్యతో అంతర్జాతీయంగా విమర్శలెదుర్కొంటోంది. 2021 లో అధికారం హస్తగతం చేసుకుంది మొదలు మహిళలకు సంబంధించిన ఎన్నో విషయాల్లో నిరంకుశంగా వ్యవహరించింది. వాటిలో కొన్ని
– ప్రాథమిక విద్య తప్పించి మహిళలు చదువుకోకూడదు.
– ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యకూడదు.
– పార్కుల వంటి బహిరంగ స్థలాల్లో మహిళలకు ప్రవేశం లేదు.
– మహిళలు ఇతర మహిళల ఎదుట ఖురాన్ చదవకూడదు. అదేమంటే మహిళల గొంతు కూడా రహస్య అవయవం కాబట్టి బయటకు వినిపించకూడదట.
– మహిళలు నిర్వహించే బ్యూటీ పార్లర్లు, బేకరీలు, కో ఎడ్యుకేషన్ పాఠ శాలలు మూతపడ్డాయి.
– మహిళలు ప్రయాణించాలన్నా, వైద్య సేవలు పొందాలన్నా ఆంక్షలు.
– బయటకు వెళ్ళేటప్పుడు ఆపాదమస్తకం దుస్తులు కప్పుకుని ఉండాలి.
– తాజాగా మహిళలు నివసించే భవనాలకు కిటికీలు ఉండకూడదని శాసనం చేసింది. వంటిళ్లలో, పెరడులో పనిచేసే మహిళలను లేదా బావి నుంచి నీరు తోడుకునే వారిని చూస్తే దుర్బుద్ధి పుడుతుందట. అలా కాకుండా కిటికీలు లేకపోతే ఏ సమస్యా ఉండదని వారి భావన కాబోలు.
నాగరికత ముందుకే కాదు వెనక్కీ వెళ్ళచ్చని తెలుస్తోంది కదా!
Share this Article