నిజంగా ఆదిపురుష్ ఒక చెత్తన్నర సినిమా… రామాయణం వంటి పురాణకథల్ని ఎలా తీయవద్దో చెప్పేందుకు ఓ ప్రబలమైన ఉదాహరణ… అందులో నటించడం ప్రభాస్ చేసిన బ్లండర్… సినిమా ఎలా వస్తుందో కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎప్పుడూ… చివరకు ట్రెయిలర్ తరువాత దేశం యావత్తూ తిట్టిపోశాక కూడా ప్రభాస్ ఆ సినిమా గురించి సీరియస్‌గా ఆలోచించలేదు… ఫలితంగా ఓ చేదు మరకను సంపాదించుకున్నాడు…
ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే… దేశం మొత్తమ్మీద సినిమా ఇండస్ట్రీ అత్యంత భారీ నష్టాల్ని సమకూర్చుకున్న సినిమాల లిస్టులో ఇదే ప్రథమ స్థానంలో నిలిచింది కాబట్టి… మొత్తానికి అర్ధమెదడు దర్శకుడు ఓం రౌత్ ఈ రికార్డును సంపాదించి పెట్టాడు ప్రభాస్‌కు… ఈ సినిమా కథ, డైలాగుల రచయిత మనోజ్ ముంతాసిర్ తన పైత్యంతో చేసిన వ్యాఖ్యలు కూడా సినిమాను బాగా దెబ్బతీశాయి… నిజానికి భారీ సినిమాలతో మైనస్ ఏమిటంటే… పెట్టిన ఖర్చుల వసూళ్లు చాలా కష్టం… ఆదిపురుష్ విషయంలోనూ అంతే…
అయితే ఈ సినిమాకు చూపిస్తున్న ఖర్చు విషయంలోనూ సందేహాలున్నయ్… 500, 600 కోట్లు అంటున్నారు గానీ, ఆ నాసిరకం గ్రాఫిక్స్‌కు అంత ఖర్చయ్యేంత సీన్ లేదు… సో, చూపించే ఖర్చులోనూ ఏదో మతలబు ఉంది… గతంలో బ్రహ్మాస్త్ర సినిమా 400 కోట్ల వసూళ్లు సాధించిందని చెబుతున్నారు గానీ ఇండస్ట్రీలోనే బోలెడు సందేహాలున్నయ్… దాన్ని హిట్ అని ఎవడూ అనడం లేదు… మొన్నామధ్య వచ్చిన షారూక్ సినిమా కూడా అంతే… పేరుకు వందల కోట్ల వసూళ్లు చూపిస్తున్నారుట… ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలే జోక్స్ వేసుకుంటుంటాయి…
Ads
చివరకు లెక్కతీస్తే ఆదిపురుష్ నష్టాలు 225 కోట్లు అని తేల్చేశారుట… ఈ సినిమాకు దేశంలో వచ్చిన నెట్ వసూళ్లు 288 కోట్లు… ఓవర్సీస్‌లో 35-38 కోట్లు… సో, ఉజ్జాయింపుగా, గరిష్టంగా లెక్కేసినా మొత్తం వసూళ్లు 325 కోట్లు… పెట్టిన ఖర్చు 550 కోట్లుగా లెక్కేసుకుంటే ఇక నష్టం 225 కోట్లుగా తేలుతుంది… అంటే భారీ నష్టం… టీ సీరిస్ వాళ్లకు వాచిపోయినట్టే… ప్రభాస్‌ను నమ్ముకుని కాదు… దర్శకుడు ఓం రౌత్‌ను నమ్ముకుని..!
ఈమాత్రం దానికి తిరుపతిలో ప్రిరిలీజ్, జైశ్రీరాం నినాదాలు… నడవలేకపోతున్న ప్రభాస్‌కు వేదిక ఎక్కే ప్రయాస లేకుండా లిఫ్ట్ పెట్టారు… మొదట్లో రామాయణం మీద సినిమా కాబట్టి తప్పక చూడండి అని కాషాయశిబిరం సోషల్ మీడియాలో ప్రచారానికి దిగింది… అఫ్‌కోర్స్, సినిమాను నిషేధించాలని కూడా కొన్ని డిమాండ్లు వచ్చాయి… తరువాత సినిమాపై జనాభిప్రాయం తెలిశాక ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు… అదీ ఈ సినిమా సత్తా…
ఆగండాగండి… దీన్ని డిజాస్టర్ అనాలా, క్రాష్ అనాలా అనేది వేరే సంగతి… అత్యంత ఫ్లాప్, అనగా భారీ నష్టాల జాబితాలో రెండో స్థానంలో ఉన్నది కూడా ప్రభాస్ సినిమాయే… పేరు రాధేశ్యాం… దాని నష్టాల విలువ 170 కోట్లుగా ఇండస్ట్రీ అంచనా వేసింది… తరువాత స్థానాల్లో సామ్రాట్ పృథ్విరాజ్ (140 కోట్లు), షంషేర (100 కోట్లు), ఆచార్య (80 కోట్లు), కన్నడ సినిమా కబ్జా (80 కోట్లు), లాల్ సింగ్ ఛద్దా (70 కోట్లు) థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (60 కోట్లు)… మొన్న వచ్చి బోల్తా కొట్టిన భోళాశంకర్ నష్టాలు అసలు లెక్క ఇంకా తేలాల్సి ఉంది…!! (DNA Inputs ఆధారంగా…)
Share this Article