‘‘ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఎప్పుడూ హర్ హర్ మహాదేవ్ అని జపించరు… ఎందుకంటే శివుడు తపస్వి… ఈ వ్యక్తులు (ఆర్ఎస్ఎస్) దేశంలోని తపస్విలపై దాడి చేస్తున్నారు… వారు జైసియారామ్ నుంచి సీతాదేవిని కూడా తొలగించారు… ఈ వ్యక్తులు దేశ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు…’’ ఈ వాక్యాలు ఘనత వహించిన ప్రముఖ నాయకుడు, నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్ నోటి వెంట వచ్చినవే… ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు… తన ఆలోచనల్లాగే, తన అడుగుల్లాగే… కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులాగే…
ఆర్ఎస్ఎస్ వాళ్లు హర్ హర్ మహాదేవ్ అని జపించరు, శివుడు తపస్వి కాబట్టి… తపస్విలపై దాడులు చేస్తుంటారు… అంటే ఆర్ఎస్ఎస్ పూర్తిగా వైష్ణవమని చెబుతున్నాడా ఈ సిద్ధాంతి…? ఆర్ఎస్ఎస్ శైవానికి వ్యతిరేకమని నిందిస్తున్నాడా ఈ రాద్ధాంతి..? ఇన్నేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంపై ఏ ప్రత్యర్థీ ఇలాంటి కువిమర్శ చేయలేదు… కొత్తగా ఈ శైవం, వైష్ణవం తేడా ఎందుకు ప్రస్తావించినట్టు..? ఆర్ఎస్ఎస్ కాని వ్యక్తులంతా శైవులు అని ముద్ర వేస్తున్నాడా ఈ కొత్త ముద్రాపకుడు..? జైసియారామ్ పలకకుండా జైశ్రీరామ్ అని పలికితే ఇక సీతాదేవిని విడదీసినట్టా..? ఈ వితండవాది ఇంకా ఏమంటాడంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశ సంస్కృతికి వ్యతిరేకమట…
రాహుల్ బుర్ర అసలే చిన్నది… అందులోకి అనవసరంగా అధికంగా సబ్జెక్టులు కూరితే ఓ గందరగోళానికి గురవుతాడు… తన వెనుక స్క్రిప్టులు రాసిచ్చేవాళ్లే ప్రాబ్లమాటిక్… వాళ్లు ఏదేదో తన మెదడులో కుక్కేసరికి అవి కాస్తా మరింత ప్రాబ్లమాటిక్ అయిపోతున్నయ్… ఆర్ఎస్ఎస్ వాళ్లను కౌరవులతో పోల్చడం వరకు వోకే… ఆర్ఎస్ఎస్‌ను తిడితే బీజేపీకి తిట్టినట్టే అనే ఓ భావదరిద్రం అది… సో, ఆ కోణంలో వోకే… ఆర్ఎస్ఎస్ వాళ్లు కౌరవులు, హాఫ్ ప్యాంటు ధరిస్తారు, లాఠీలు పట్టుకుని మార్చ్ ఫాస్ట్ చేస్తారు… (హాఫ్ ప్యాంట్ల దశ దాటేసింది ఆర్ఎస్ఎస్… రాహుల్ వెనుక స్క్రిప్టర్ ఎవరో గానీ ఇంకా పాతరోజుల్లోనే ఉన్నట్టున్నాడు…) వీళ్లతో పోరాడిన పాండవులు కాంగ్రెస్‌వాదులట… ఇది తపస్విలు వర్సెస్ పూజారుల పోరు అట… పూజారులు అంటే దేశాన్ని దోచుకునే బీజేపీ బ్యాచ్ అట…
Ads
అంటే రియల్ సన్యాసులట, తపస్విలట… సో, కాంగ్రెస్ అంటే తపస్విల శైవం, అది హర్ హర్ మహాదేవ్ అని నినదిస్తుందట… ఆర్ఎస్ఎస్ అంటే వైష్ణవమట… కానీ కౌరవులట… సో, కాంగ్రెస్ బీజేపీ సైద్ధాంతిక ఘర్షణ శైవానికీ వైష్ణవానికీ నడుమ ఘర్షణ అట…… ఏమో, ఇప్పటివరకూ చదివినదంతా కుతర్కం, పిచ్చివాదన అనిపిస్తోందా..? అందుకే రాహుల్ బుర్ర ఉత్త డొల్ల అనేది… బీజేపీ ఇకనైనా తమ బలం తమ సొంతమేమీ కాదని, రాహుల్ వంటి వ్యక్తుల నాయకత్వంలోని కాంగ్రెస్ బలహీనతమే తమ అసలు బలమనీ గుర్తించాలి… రాహుల్ నాయకుడిగా ఉన్నన్నిరోజులూ బీజేపీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు… కాంగ్రెస్ పుంజుకుంటుందనీ, బీజేపీని కకావికలం చేస్తుందనీ భ్రమలు, భయాలు కూడా అనవసరం…
రాహుల్ ఆలోచన విధానం గురించి మీకు ఇంకా స్పష్టత కావాలంటే, గుండె నిబ్బరం చేసుకుని చదవండి… అర్థమైతే మీఅంత మేధావి ప్రపంచంలోనే లేనట్టు లెక్క… ‘‘మీ మనస్సులో ఉన్న ఆ రాహుల్ గాంధీని నేను చంపేశాను… ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ నాలో లేడు, బీజేపీ ఆలోచనల్లో ఉన్నాడు, మీ బుర్రల్లో ఉన్నాడు… హిందూ గ్రంథాలో, శివుడి గురించి చదవండి, ఇది అర్థం అవుతుంది…’’ ఇలా ఏదేదో మాట్లాడాడు… తన ప్రసంగాన్ని ఎలా రిపోర్ట్ చేయాలో అంతుపట్టక పలువురు జర్నలిస్టులు ఇప్పటికీ సతమతం అయిపోతున్నారు… ఏం బాష్యాలు చెప్పి సమర్థించాలో తెలియక కాంగ్రెస్‌వాదులు జుత్తు పీక్కుంటున్నారు… ఇప్పుడు అందరిలోనూ ఓ కొత్త భయాందోళన… పొరపాటున, గ్రహపాటునో… కొంపదీసి, తను ఈ దేశ ప్రధాని కుర్చీ ఎక్కడు కదా..!!
Share this Article