అనుకుంటున్నదే… కాలేశ్వరం ఫెయిల్యూర్స్, నిగ్గుదేల్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల నివేదికలపై ఏ పత్రిక ఎలా స్పందిస్తుందో కొంతమేరకు ప్రతి పాఠకుడు అంచనా వేసుకోగలడు… సేమ్ జరిగింది… కాకపోతే ఇష్యూ సీరియస్, లక్షన్నర కోట్ల ప్రాజెక్టు భవితవ్వం, భారీ అవినీతి, నిర్మాణాల్లో లోపాలు, అక్రమాలు సరిగ్గా ఈ ఎన్నికల వేళ బాగా చర్చనీయాంశం అవుతున్నయ్ కదా… మీడియా రాయకతప్పదని అనుకున్నారు కొందరు…
ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్టు అద్భుతం అనీ, ప్రపంచ వింత అన్నట్టుగా కొన్ని పత్రికలు సెంటర్ స్ప్రెడ్స్ కూడా వేసి, భజనలో తరించి, తగిన లబ్ధి కూడా పొందాయి… వ్యతిరేకంగా రాస్తే పాతాళానికి తొక్కుతాం అనే మాటలూ కొన్ని పత్రికల్ని లొంగదీయవచ్చు కూడా… ఐతే ఇంతటి బాహుబలి ప్రాజెక్టుపై కేంద్రం ఓ వ్యతిరేక నివేదిక ఇవ్వడానికి కూడా న్యూస్ ఇంపార్టెన్స్ లేదా..?
తెలుగు పత్రికల్లో ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే సరైన ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించింది… అందరి స్పందనలు, గతంలోనే సీడబ్ల్యూసీ హెచ్చరికలు చేసిందనే స్టోరీ, బ్యానర్ ప్రజెంటేషన్… మొత్తం పర్‌ఫెక్ట్ ప్రయారిటీ జడ్జిమెంట్… ఈనాడు భయంభయంగా సెకండ్ లీడ్ వేసుకుంది… రోజూ సభల్లో కేసీయార్ చెప్పిన మాటల్నే మళ్లీ ఫస్ట్ లీడ్ చేసుకుంది… సరే, ఈనాడు ఇప్పుడున్న దురవస్థలో దానికి తప్పలేదేమో… అసలే కేసీయార్ గనుక ఊ అంటే ఇప్పటికిప్పుడు ఈనాడు బాస్‌ను జగన్ అరెస్ట్ చేసి రాజమండ్రి స్నేహ బ్లాక్‌కు తరలించే ప్రమాదం ఉందాయె…
Ads
ఈమధ్య ఆంధ్రజ్యోతిలో పదును తగ్గిందేమిటి..? అప్పట్లో కేసీయార్ మీద నెగెటివ్ స్టోరీల్ని పనిగట్టుకుని రాసినట్టు అనిపించింది, ఈమధ్య ఆ ధోరణి లేదేమిటి అనుకున్నారు చాలామంది… కానీ ఎప్పటిలాగే ఉన్నాను సుమా అని నిరూపించుకున్నాడు రాధాకృష్ణ… ఇక నమస్తే సాక్షి, నమస్తే ప్రభ సంగతి తెలిసిందే కదా… దొర దాస్యంలో తరిస్తున్నాయి… కాకపోతే కేంద్ర నివేదిక వేయక తప్పదు కాబట్టి తప్పనిసరై, అయిష్టంగానే మమ అనిపించేశాయి… కాంగ్రెస్‌లో చేరిన తాజా వెలుగు కూడా సహజంగానే కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది… సొంత విశ్లేషణలేమీ చేతకానట్టున్నయ్… మనతెలంగాణ కూడా నమస్తే తెలంగాణకు బీ-పత్రిక కాబట్టి లెక్కలోకి రాదు, రాలేదు…
ఇంగ్లిషు పత్రికలు, సోకాల్డ్ జాతీయ మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు… ఎప్పటిలాగే టీవీలకు ఎలాగూ చేతకాలేదు, కనీసం ప్రింట్ మీడియా కూడా సరైన రీతిలో స్పందించలేదు… చత్తీస్‌గఢ్ సీఎం భాగెల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా నుంచి 508 కోట్లు తీసుకున్నట్టు ఈడీ ఇచ్చిన నివేదికకు ప్రయారిటీ ఇచ్చాయి… ఎస్, అదీ ఇంపార్టెంటే… ఆ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెసే గెలుస్తుందనే సర్వే ఫలితాల నడుమ చివరి ప్రయత్నంగా ఇక బీజేపీ ఏకంగా సీఎంకే గురిపెట్టింది… బీజేపీకి ఇవి అలవాటే కదా… ఇక నమస్తే సంగతి అంటారా..? ఇదుగో…
ఇదంతా బీజేపీ కుట్ర అనేసింది… సింపుల్… నవ్వొచ్చేది ఏమిటంటే తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీయడమట ఇది… గతంలో చాలా ప్రాజెక్టుల ఫెయిల్యూర్లు బయటపడితే స్పందించలేదు, కాలేశ్వరంపై అయిదే రోజుల్లో నివేదిక ఇచ్చింది, ఇది కుట్ర కాదా అనే ఓ ఎటమటం, రెటమతం వాదనకు దిగింది… హేమిటో… మరి ఇదే వాదనను బహిరంగసభల్లో జనానికి వినిపించవచ్చు కదా… మాట్లాడరు… బాధ్యులైనా సరే స్పందించరు…
సరే, బీజేపీ కుట్ర చేసిందనే అనుకుందాం… కానీ కాళేశ్వరం వైఫల్యాలు అబద్ధమా…? మేడిగడ్డ కుంగుబాటు అబద్ధమా..? అన్నారం బుంగలు అబద్ధమా..? గతంలో పంపు హౌజ్ మునక అబద్ధమా..? ఎహె, నదిలోకి దిగిందీ లేదు, పునాదులు చూసిందీ లేదు, సమగ్ర అధ్యయనం లేదు అని ఎదురుదాడికి దిగింది… అసలు కేంద్రం అడిగిన వివరాలే రాష్ట్రం ఇవ్వలేదు కదా… హేమిటో, అంతా తొండి వాదన… మరి తమ పార్టీ మైక్ ఇలా వాదిస్తోంది కదా… బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇదే వితండంతో బహిరంగంగా జనంలో వాదించొచ్చు కదా… అది మాత్రం చేయరు..!!
Share this Article