Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంకెన్ని ప్రాణాల్ని మింగుతాయో ఈ కార్పొరేట్ అనకొండలు..!!

June 23, 2024 by M S R

ఉత్త ముచ్చట్లు — విద్యా వ్యాపారంలో రాలిపోతున్న “Thar e zameen par”
—————————

పిల్లలకు ఏం కావాలో… పిల్లలు ఏం కావాలో తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు పోటీ ప్రపంచంలో ఇతర పిల్లలతో పోల్చుతూ వారి జీవితాన్ని ఆగం చేస్తారు. ఎవరి పిల్లలో ఏవో ర్యాంకులు సాధించారని నమ్ముతూ… అదే కాలేజీలో తమ పిల్లల్ని చేర్పిస్తే… జీవితంలో మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తారు. కానీ… కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు…

పిల్లల జీవితాల్ని అగమ్యగోచరం చేస్తాయి. ఆఖరికి అంతం చేస్తాయి. కార్పొరేటు స్కూళ్లు, కాలేజీల ర్యాంకుల బాగోతం, వ్యాపార దృక్పథం నీచ స్థాయికి దిగజారింది. ఆట పాటలతో చదువులు చెప్పాల్సిన కాలేజీలు…. పిల్లల్ని మార్కులు సాధించే యంత్రాలుగా మార్చి… మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి.

Ads

చదువు చెప్పడం అంటే… ముందుగా చదవాలనే కోరికను, జిజ్ఞాసను కలిగించడం కూడా అందులో భాగమే. కానీ.. మన కార్పొరేట్‌ విద్యా సంస్థలకు అది తెలిస్తే కదా…! ఎంత సేపూ పిల్లల్ని రాచి రంపాన పెడుతూ… చదువుల పట్ల అసహ్యం కలిగిస్తున్నాయి… కార్పొరేట్‌ విద్యా భూతాలు.

ఊరికి దూరంగా జైళ్లను తలపించే హాస్టళ్లు నిర్మించి, ఒక ఫ్లోర్‌లో తరగతి గదులు, మరో ఫ్లోర్‌లో హాస్టల్‌, సెల్లార్‌లో భోజనాలు…. అదే ప్రపంచంగా చదువులు చెబుతున్నాయి… కార్పొరేట్‌ కాలేజీలు. ఆట స్థలం ఉండదు, బాహ్య ప్రపంచం తెలియదు… కాలేజీ కాంపౌండ్‌ను చుట్టి ఉండే… ఎత్తయిన గోడలు. పిల్లల్లో చదువుల పట్ల ఎలాంటి భావన కలిగిస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకోవడం… చాలా ప్రమాదకరం. ఏదైనా బలవంతంగా రుద్దితే… అది ప్రతికూల ఫలితాలే ఇస్తుంది.

హైదరాబాద్‌ శివారులోని కోహెడలోని నారాయణ కాలేజీ విద్యార్థి హాస్టల్‌ గోడ దూకి పారిపోవాలనే ప్రయత్నంలో కరెంట్‌ తీగ తగిలి చనిపోవడం చూసి… మనసు తీవ్రంగా కలచి వేసింది. హాస్టల్‌లో ఎంతటి ఒత్తిడి ఉంటే… ఆ అబ్బాయి పారిపోవాలని ప్రయత్నించాడో అర్థం చేసుకోవచ్చు. మరి మిగతా వాళ్లు అక్కడే చదువుకుంటున్నారు కదా…! ఈ ఒక్కడికే ఎందుకు పారిపోవాలని అనిపించింది…? ఈ పిల్లాడితే తప్పా…?

అంటే… ఆ వాతావరణంలో చదువుకోవడం బహుశా అతడికి నచ్చలేదేమో… తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి కదా. “నేను ఇక్కడ ఉండలేను… తీసుకెళ్లిపోండి..” అని కొడుకు ప్రాధేయపడినా కూడా… తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి… నచ్చచెప్పి వెళ్లిపోయారు. నిజంగా తల్లిదండ్రుల బాధ్యత అంతేనా…? ఇప్పుడు తల్లిదండ్రులు బాధ పడుతున్నారు. కాలేజీ ఒత్తిడి వల్లే తమ బిడ్డ చనిపోయాడని. అది కార్పొరేట్‌ కాలేజీ… విద్యా వ్యాపారం చేసుకుని, ర్యాంకులు, మార్కులు చూపించుకుని… మరికొందర్ని తమ విష వలయంలోకి లాగేందుకు ప్రయత్నిస్తాయి. అది… వాటి రాక్షస నైజం. కానీ… ఆలోచించాల్సింది తల్లిదండ్రులే.

ఈ వార్త చూసిన తర్వాత… నాకొక అనుభవం గుర్తొచ్చింది. అది… 2012. మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ ముత్యాలు బావ ఫోన్‌ చేశాడు. మా బాపు వాళ్ల క్లోజ్‌ ఫ్రెండ్‌ రాములు మామ కోడుకు… ముత్యాలు బావ. ” సత్యం హైదరాబాద్‌ వస్తున్నాం… రాజశేఖర్‌ను ఇంటర్‌ కాలేజీలో జాయిన్‌ చేయించడానికి” అన్నాడు.

మనోడికి టెన్త్‌లో 500లకు పైగా మార్కులు వచ్చాయి. వాళ్ల ప్రైవేట్‌ స్కూల్ హెడ్ మాస్టర్‌ రిఫరెన్స్‌తో… ఎల్బీ నగర్‌ సమీపంలోని త్రివేణి కాలేజీలో జాయిన్‌ చేయించాలని వచ్చారు. ఉదయమే ఇద్దరూ నా రూమ్‌కు వచ్చారు. మేం ముగ్గురం కలసి కాలేజీకి వెళ్లాం. కాలేజీ, హాస్టల్‌ అడ్మిషన్‌ ప్రాసెస్‌ పూర్తయింది. సగం ఫీజు కట్టారు. గార్డియన్‌గా నా పేరు రాయించారు.

ఇక.. రాజశేఖర్‌ హాస్టల్‌లోని రూమ్‌కు వెళ్లి సామాన్లు సర్దాం. ఈ లోపు లంచ్‌ టైమ్‌ అయింది. ఆఫ్టర్‌ లంచ్‌… మావోడిని క్లాస్‌కు అటెండ్‌ కావాలని వైస్‌ ప్రిన్సిపాల్‌ అడ్మిషన్‌ టైమ్‌లోనే చెప్పాడు. హాస్టల్‌, కాలేజీ… ఒకే బిల్డింగ్‌లో ఉన్నాయి. వెంటనే రాజశేఖర్‌ను క్లాస్‌కు పంపించారు. క్లాస్‌ దగ్గరకు వెళ్లి.. అక్కడ కూర్చోబెట్టాం. రాజశేఖర్‌ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. “సత్యం మామ ఇక్కడే ఉంటాడు కదా… చూసుకుంటాడు… నువ్వేం భయపడకు” అంటూ మా బావ చెప్పాడు. టాటా చెబుతూ… ఇద్దరం బయటకు వచ్చేశాం.

కాలేజీ బయటకు వచ్చి… నేను, ముత్యాలు బావ… టీ స్టాల్‌ దగ్గర కూర్చున్నాం. తన కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. పిల్లోడిని ఇంటికి దూరంగా చదివించడం అదే మొదటిసారి కావడంతో అతను కూడా చాలా బాధ పడ్డాడు. కాలేజీ టైమ్‌ ముగిసే వరకు అక్కడే కూర్చున్నాం. మళ్లీ హాస్టల్‌కు వెళ్లి… బాబును పలకరించి… జాగ్రత్తలు చెప్పి వచ్చేశాం. ముత్యాలు బావ ఆదిలాబాద్ వెళ్లిపోయాడు.

ఓ పది రోజుల తర్వాత… ముత్యాలు బావ నుంచి ఫోన్‌ కాల్‌… “సత్యం…. కాలేజీకి వెళ్లవా… శేఖర్‌ బాధ పడుతూ ఫోన్‌ చేశాడు. హాస్టల్‌లో ఉండలేను.. తీసుకెళ్లమని ఏడుస్తున్నాడు..” అని చెప్పాడు. నేను వెంటనే బయల్దేరి కాలేజీ హాస్టల్‌కు వెళ్లాను. రాజశేఖర్‌తో మాట్లాడాను. జ్వరంతో ఉన్నాడు. వార్డెన్‌తో మాట్లాడి, నా రూమ్‌కు తీసుకెళ్లాను. ” నాన్నకు చెప్పి… ఎలాగైనా హాస్టల్‌లో నుంచి ఇంటికి తీసుకెళ్లమని చెప్పు మామయ్యా… ప్లీజ్‌.” అన్నాడు.

“ఎందుకు శేఖర్‌.. ఏమైంది…” అని అడిగాను. కాలేజీలో, హాస్టల్‌లో పెడుతున్న ఇబ్బందుల గురించి ఆందోళనగా చెప్పాడు. మరీ ఇంత ఘోరమా అనిపించింది. ఇక.. మావోడు అక్కడ ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావించాను. అప్పటికే… కార్పొరేట్‌ కాలేజీ హాస్టళ్లలో జరుగుతున్న ఘటనలు… నన్ను మరింత ఆలోచింపచేశాయి. “ఇంటి దగ్గర కాలేజీలో చదువుకుంటాను… అక్కడ కూడా మంచి కాలేజీలు ఉన్నాయి… కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుని చూపిస్తాను మామయ్యా… ప్లీజ్‌… నాన్నకు చెప్పి, ఒప్పించు” అన్నాడు.

” సరే… నువ్వేం భయపడకు… నేను చూసుకుంటాను… నాన్నతో మాట్లాడి… ఇంటికి తీసుకెళ్లమని చెబుతాను.. అస్సలు టెన్షన్‌ పడకు సరేనా… వేరే ఏమీ ఆలోచించకు” అంటూ ధైర్యం చెప్పాను. చాలా సేపటికి మావోడి మొహంలో నవ్వు చూశాను. “సరే మామయ్యా..” అన్నాడు. అదే రోజు… ముత్యాలు బావకు ఫోన్‌ చేసి.. రమ్మని చెప్పాను. మనోడిని చూస్తూ చూస్తూ మళ్లీ హాస్టల్‌లో దింపొద్దని డిసైడ్‌ అయ్యాను.

మరుసటి రోజు ఉదయానికి ముత్యాలు బావ వచ్చాడు. బావతో పర్సనల్‌గా చెప్పాను. “మనోడు ఇక్కడ ఉండటం మంచిది కాదు.. తీసుకెళ్లు బావా..” ఎలాగూ మనోడు క్లెవర్‌… కొన్ని మార్కులు అటు ఇటుగా వస్తాయేమో కానీ… చదువంటే విరక్తి కలిగించే కాలేజీలో అస్సలు వద్దు..” అని చెప్పాను. ఎందుకు చెబుతున్నానో…. తనకు అర్థమైంది.

ముగ్గురం కాలేజీకి వెళ్లాం. వైస్ ప్రిన్సిపాల్‌ను కలవడానికి ప్రయత్నించాం. చాలా సేపు వెయిట్‌ చేయించాడు. “మావోడిని తీసుకెళ్తాం…” అని చెప్పాడు.. ముత్యాలు బావ. ” అలా కుదరదండీ…” అంటూ వైస్‌ ప్రిన్సిపాల్‌ తెగేసి చెప్పాడు… చాలా సేపు సతాయించాడు. “తీసుకెళ్తే.. తీసుకెళ్లండి కానీ… ఫీజు తిరిగి ఇవ్వడం కుదరదు” అని చెప్పాడు. ” ఇవ్వకపోతే ఇవ్వకండి కానీ… టీసీ ఇచ్చేయండి… వెళ్లిపోతాం…” అని ముత్యాలు బావ అన్నాడు.

“అయినా.. పిల్లలు ఏం చెబితే పెద్దవాళ్లు అదే వింటారా అండి… వాళ్ల భవిష్యత్‌ గురించి ఏం ఆలోచించరా…? ఓ నెల రోజులు చూద్దాం.. అప్పటికీ ఇష్టం లేకపోతే తీసుకెళ్లండి” అంటూ వైస్‌ ప్రిన్సిపాల్‌ క్లాస్‌ పీకడం మొదలు పెట్టాడు.

నేను కలగజేసుకుని… “చూడండి సార్‌… నెల రోజులు చూడటం ఏంటి…? పిల్లోడి మీద ప్రయోగాలు చేస్తారా…? నెల రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ఎలా అంటారు…? పిల్లోడి భవిష్యత్‌ గురించి ఆలోచించాం. ఇక్కడ మావోడి భవిష్యత్‌ ఎంత భద్రంగా ఉందో ఆర్థమవుతోంది….” అంటూ… మావోడు నాకు చెప్పిన విషయాలు అన్నీ ప్రస్తావించాను.

“ఇలాగేనా అండి చదువులు చెప్పడం… పిల్లల్లో చదువు పట్ల జిజ్ఞాసను కలిగించాలని… మీకు చెప్పేంత వాణ్ని కాదు కానీ… విరక్తి కలిగిస్తున్నారు…. మా పిల్లోడి భవిష్యత్‌ గురించి మాకు బాధ్యత ఉంది.. ఆందోళన కూడా ఉంది.. ఏం చేయాలో మాకు తెలుసు” అన్నాను. “టీసీ కూడా వెంటనే ఇవ్వడం కుదరదు. ఇంత మందిని చేర్చుకోవాలని మాకో లెక్క ఉంటుంది. అంతకు మించి చేర్చుకోం. మీ వాడు జాయిన్‌ అయ్యాడని… అడ్మిషన్స్‌ అయిపోయాయని మేం భావించాం. కొత్తవారిని జాయిన్‌ చేసుకోలేదు…” అంటూ లెక్కల్లోకి వచ్చాడు. ఆ లాజిక్‌ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏదో బస్‌ టికెట్‌ బుకింగ్‌ క్యాన్సిల్‌ చేయడం గురించి మాట్లాడినంత ఈజీగా మాట్లాడుతున్నాడు.

” అంటే… అడ్మిషన్స్‌ ప్రాసెస్‌ పూర్తయిందన్న మాట… కాబట్టి… మీరు రేపట్నుంచి ఎవరినీ చేర్చుకోరన్న మాట. ఒకవేళ చేర్చుకుంటే ఎలా సార్‌… ఏం చేద్దాం..? ఇప్పుడు బయట కూర్చున్న పిల్లలు, పేరెంట్స్ ఎవరు… ఎందుకు వచ్చారు…? ” అంటూ నేను నిలదీశాను. “టీసీ ఎలా తీసుకోవాలో తెలుసు… ” అని నేను కాస్త బెదిరింపు స్వరంతో మాట్లాడాను. ఏం చేయగలమో కూడా సూచాయగా ప్రస్తావించాను…

“ఇక మీ ఇష్టం సార్‌” అన్నాను. నేను కూడా యూనివర్సిటీలో స్టూడెంట్‌ లీడర్‌నే… మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమవుతోంది..” అన్నాడు.. వైస్ ప్రిన్సిపాల్‌. ” అయినా.. అడ్మిషన్‌ క్యాన్సిల్‌ గురించి మీరు ప్రిన్సిపాల్‌తోనే మాట్లాడాలి” అన్నాడు… వైస్‌ ప్రిన్సిపాల్‌. సరే అంటూ… ప్రిన్సిపాల్‌ను కలిశాం.

ప్రిన్సిపాల్‌ కూడా … వైస్‌ ప్రిన్సిపాల్‌ తరహాలోనే మాట్లాడాడు. వీళ్లంతా సేమ్‌ స్పీచ్‌ ముందే ప్రిపేర్‌ అవుతారేమో. స్టూడెంట్స్‌తో బట్టీ పట్టించడమే కాకుండా.. వీళ్లు కూడా బట్టీ పట్టి ఆన్సర్లు చెబుతారు… అందుకే. ప్రిన్సిపాల్‌తోనూ వాదన నడిచింది. చివరికి.. “సరే… మీ ఇష్టం.. మీ పిల్లాడి భవిష్యత్‌ గురించి మీకు ఆలోచన లేకపోతే మేమేం చేస్తాం” అంటూ… టీసీ ప్రాసెస్‌ పూర్తి చేసి, పంపించాడు.

రాజశేఖర్‌ కళ్లల్లో ఆనందం చూడాలి. మొహం వెలిగిపోయింది. ముత్యాలు బావ, రాజశేఖర్‌ హ్యాపీగా.. ఆదిలాబాద్ వెళ్లిపోయారు. రాజశేఖర్‌ ఆదిలాబాద్‌లోనే ఇంటర్‌లో జాయిన్‌ అయ్యాడు. అప్పుడప్పుడు కాల్‌ చేసి మాట్లాడేవాణ్ని. ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే టీటీసీలో సీటు వచ్చింది. ఆ తర్వాత డిగ్రీ, బీఎడ్‌ పూర్తి చేశాడు. టెట్‌ క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్నాడు. ప్రతీ రిజల్ట్‌ గురించి నాతో షేర్‌ చేసుకుంటూ ఉంటాడు. మాట నిలబెట్టుకున్నాననే ఆనందం మావోడి మాటల్లో కనిపిస్తుంది.

ఇందాక కూడా మాట్లాడితే… ఆ రోజు జరిగిన ప్రాసెస్‌ను తల్చుకుని… నవ్వుకున్నాం. “చాలా రోజులైంది మాట్లాడక…. అంజి మామ నెంబర్‌, సంతోషి పిన్ని నెంబర్‌ పంపించు” అన్నాడు. పంపిద్దామని వాట్సప్‌ ఓపెన్‌ చేసి… మావోడి డీపీ చూశాను… తాను స్ఫూర్తి పొందిన కొటేషన్‌ చూసి ఆశ్చర్యపోయాను. మంచి లక్ష్యంతో.. సామాజిక స్పృహతో ఆలోచిస్తున్నాడు.. అనిపించింది. ఆల్‌ ది బెస్ట్‌ రాజ.

పిల్లలు కోరింది ఇవ్వడమే కాదు… వద్దంది వదిలించడం కూడా ప్రేమనే. చదువు గుది బండ కాకూడదు కదా.. మోయాలని చెప్పడం ప్రేమ ఎలా అవుతుంది…! పిల్లలకు మనం ఏం ఇవ్వాలని ప్రయత్నిస్తామో… అది ముఖ్యమే. కానీ.. ఆ ప్రయత్నం, మార్గం సరైందా కాదా… అని కూడా చూసుకోవాలి. అలా ఆలోచిస్తే….

కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల గురించి చెడు వార్తలు వినడం ఆగిపోతుంది…. ఆగిపోవాలి. క్షుద్ర విద్యా వ్యాపారంలో రాలిపోతున్న Thar e zameen par” పట్ల తీవ్రమైన సంతాపంతో… రాచి రంపాన పెడితేనే చదువులు వస్తాయని భావించే తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల పట్ల సానుభూతితో సెలవు… (By ఇనుగుర్తి సత్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions