మొన్నమొన్నటిదాకా సాగిన బిగ్‌బాస్ గురించి చెప్పి మళ్లీ విసిగించడం కాదు… అందులో అమ్మారాజశేఖర్ అనే కంటెస్టెంటు తన కిలికిలి భాషతో తెలుగు ప్రేక్షకుల దుంపతెంచాడు… ఆ నీచ బిగ్‌బాసుడికి ఆ భాష తెలుగులా వినిపించేది, మోనాల్‌ను మాత్రం తెలుగు నేర్చుకో అని ఉరిమేవాడు… హారిక, అభిజిత్‌లపై అరిచేవాడు… మన ఖర్మ అనుకున్నాం… రాజశేఖర్ బిగ్‌బాస్ వదిలేరోజున యావత్తు తెలుగు ప్రేక్షకజనం ఆనందాశ్రువులతో వీడ్కోలు పలికి పండుగ చేసుకున్నారు…
ఎవరో అడిగారు ఫేస్బుక్లో… ‘‘ఒరేయ్ బిగ్‌బాసూ, చాలా భాషల్లో షోలు చేస్తున్నారు కదా, తెలుగువాళ్లను కంటెస్టెంట్లుగా తీసుకోవడం లేదు, మరి ఎవరెవరో భాష తెలియనివాళ్లను తీసుకొచ్చి మాపై రుద్దుతావేమిట్రా..?’’ ఇదీ ప్రశ్న… సరే, ఇప్పుడు విషయానికి వద్దాం… స్టార్ మాటీవీలో డాన్స్ ప్లస్ అని ఓంకార్ ఓ షో స్టార్ట్ చేశాడు… ప్యూర్ కాపీ ఆఫ్ ఈటీవీ ఢీ… సరే, మంచి అనుకరణ కూడా క్రియేటివిటీ అని రాజీపడే దరిద్రం ఇప్పటి ట్రెండ్ కాబట్టి… పెద్ద పెద్ద సినిమా దర్శకులే ఆ పనిలో మునిగితేలుతున్నారు కాబట్టి… వోకే…
Ads
ఇక్కడ ఇష్యూ ఏమిటంటే..? భాష..! ఈ షోలో అమ్మా రాజశేఖర్‌కు తాతల్లాంటి మరో ముగ్గురు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జడ్జిలు… నవ్వొద్దు సుమీ… అసలు ఓంకార్ ఉచ్ఛారణే అదో వింత తెలుగు… తన పేరును ఓహోంకార్ (Ohmkar) అని రాయించుకుంటాడు… ఇక జడ్జిలు ఎవరంటే బాబా భాస్కర్, ముమైత్ ఖాన్, యానీ మాస్టర్, మోనాల్, యశ్వంత్ మాస్టర్…. హహహ… బాబా భాస్కర్ తెలుగు కూడా వెరయిటీ… మోనాల్ తెలుగు మరింత వెరయిటీ… ముమైత్‌ఖాన్ అసలు తెలుగు మాట్లాడే ప్రయత్నమే చేయదు కాబట్టి పర్లేదు… యానీ మాస్టర్ తెలుగు మాట్లాడగలదు గానీ అదీ కాస్త వింతవింతగానే ధ్వనిస్తుంది…
వీరిలో యశ్వంత్ మాస్టర్ ఒక్కడే తెలుగువాడు… ఐనా హైస్కూల్ నుంచి ఎంబీఏ దాకా తను చదివింది కర్నాటకలో… మొదట డాన్స్ పోటీల్లో పాల్గొనడం కూడా కర్నాటకలోనే… ఆగండి, ఇంకా ఉంది…
ముమైత్, బాబా భాస్కర్, యానీ మాస్టర్, మోనాల్… అందరూ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కునేవాళ్లే… ముందే చెప్పుకున్నట్టు ఇది ఈటీవీ ఢీ ప్రోగ్రాంకు కాపీ కదా… సేమ్, యాక్రోబాటిక్స్ అనబడే సర్కస్ ఫీట్లనే డాన్సులుగా చూపిస్తారు, అలాగే కంపోజ్ చేస్తారు, మనం వాటిని డాన్సులు అని నమ్మి, చెవుల్లో రఫ్లీషియా పూలు పెట్టుకుని చూడాలి… అయితే ఇప్పుడు ట్రెండ్ ఏమిటంటే..? జబర్దస్త్ వంటి కామెడీ షోలో కామెడీ లేకుండా పోయింది గానీ… ఢీ, క్యాష్, వావ్, సరిగమప, సెలబ్రిటీ ఛాలెంజ్… ఇలా విషయం ఏదైనా, చానెల్ ఏదైనా సరే, యాంకరుడు లేదా యాంకరిణి బీభత్సమైన కామెడీని పండించాల్సిందే… ఢీలో అయితే సపరేట్గా లవ్ ట్రాకులు, కామెడీ ట్రాకులే నడుస్తుంటయ్… కాబట్టి దానికి నకలు అయిన ఈ డాన్స్ ప్లస్ షోలో కూడా కాస్త కామెడీని పండించే ప్రయత్నం చేస్తున్నారు… దానికోసం యశ్వంత్ అలియాస్ యశ్ భార్య వర్షను ఎంచుకున్నారు… (వర్ష అని వేరే యాక్ట్రెస్ కూడా ఉంది, ఇమాన్యుయెల్ అనే కమెడియన్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తోంది కదా, ఆమే కాదు ఈ వర్ష…)
ఆమె నిజానికి ఇండిగోలో ఎయిర్ హోస్టెస్… యశ్, ఆమె ఇంటర్మీడియెట్ (కర్నాటక) చదివేప్పుడు లవ్వు… ఎనిమిదేళ్ల లవ్ ట్రాక్ అనంతరం లాస్ట్ ఇయరే పెళ్లిచేసుకున్నారు… అది వేరే కథ… కానీ ఆమె కాస్త కామెడీని పండించగలదు, టైమింగ్ ఉంది… కాకపోతే కామెడీ స్క్రిప్టింగ్ సరిగ్గా లేదు, ఆమెకు బాగా తోడ్పాటు ఇవ్వగల ఇతర కేరక్టర్లు లేవు… ఏదో మోనాల్, యశ్ లవ్వు అనే అంశం, ఈ వర్ష ఏడుపు చుట్టూ తిప్పుతున్నారు… ఇంతకీ మనం చెప్పుకునేది ఏమిటంటే..? గరిష్టంగా నాన్-తెలుగు… ఇది గాకుండా డాన్స్ ప్లస్ పేరులో ప్లస్ అంటే ఏమిటో అర్థమైంది కదా… సర్కస్ ఫీట్లు, కామెడీ స్కిట్లు… దాన్ని మనం డాన్స్ షో అని నమ్మాలి… బాగుందిరా అబ్బాయ్… అన్నట్టు చెప్పడం మరిచేపోయాం… ఢీ షోలోనూ అదే ఏడుపు కదా… పూర్ణ, రష్మి, మొన్నమొన్నటిదాకా వర్షిణి… వాళ్లూ సేమ్, భాష విషయంలో అమ్మారాజశేఖర్కు బంధువులే…!! తెలుగు టీవీ సీరియళ్లలో హీరోయిన్లు, ఉపహీరోయిన్లు గట్రా ఎక్కువగా కన్నడ నటులే… సో… తెలుగు టీవీ అంటేనే నాన్-తెలుగు ఠీవీ…! అరెరె, తిట్టడం లేదోయ్, బాగానే నెట్టుకొస్తున్నందుకు అభినందిస్తున్నా…!!
Share this Article