Ondu Motteya Kathe…. ఇది ఓ కన్నడ సినిమా… 2017లో వచ్చింది లెండి… రాజ్ శెట్టి అనే కొత్త దర్శకుడు తనే నటించి, తనే దర్శకత్వం వహించిన సినిమా… మంచి అవార్డులు, ప్రశంసలు గట్రా అందుకుంది… దీన్ని మళయాళంలో Thamaasha పేరిట 2019లో రీమేక్ చేశారు… హిందీలో దీన్ని Ujda Chaman పేరిట అదే సంవత్సరంలో రీమేక్ చేశారు… సేమ్ లైన్‌లో అదే సంవత్సరం బాల అనే సినిమా హిందీలో వచ్చింది… కాపీ రైట్స్ గట్రా వివాదమూ నడిచింది… ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి పెడ్నేకర్ తదితరులు నటించిన ఈ సినిమా కలెక్షన్లను కూడా బాగా దున్నేసింది… ఇవన్నీ ఒకటే లైన్… హీరో బట్టతల, పెళ్లి కష్టాలు… కన్నడ సినిమాకు ఒరిజినల్, ప్రేరణ, స్పూర్తి ఏ సినిమాయో తెలియదు కానీ… అదే లైన్‌లో మన తెలుగు హీరో అవసరాల శ్రీనివాస్ రాసుకుని, నటించి #నూటొక్కజిల్లాలఅందగాడు పేరిట వదిలాడు తెలుగు ప్రేక్షకుల మీదకు… ఐనా తననెందుకు నిందించడం, తెలుగులో దాదాపుగా ప్రతి సినిమా కథా ఇలా బయటి నుంచి ఎత్తుకొచ్చుకున్నదే కదా… పాటలు, ట్యూన్లు, కథలు… అన్నీ సేమ్ షేమ్…
నకల్ మార్నేకే లియే బీ అకల్ చాహియే… కాపీ కొట్టడం ఓ కళ… దాన్ని మనకు అనువుగా మార్చుకోవడం మరో కళ… ఒక త్రివిక్రమ్ చూడండి, ఒక రాజమౌళి చూడండి… అవసరాల శ్రీనివాస్ పాపం మంచోడు, అలాంటి మంచోళ్లకు కాపీ కళలో అంత త్వరగా పట్టుచిక్కదు… అదుగో అక్కడ వచ్చింది చిక్కు… నిజానికి బట్టతల కష్టాలు అనే కాన్సెప్టు తెలుగు ప్రేక్షకులకు కొత్తదే… ప్రస్తుతం యూత్‌ను పీడిస్తున్న సమస్యల్లో ఇది కూడా ముఖ్యమైనదే… పెళ్లికాకముందే ఎకరాలకు ఎకరాలు ఎండిపోతూ, ఆ మిగతా జుత్తు కూడా పీక్కునే యువకుల సంఖ్య ఏటేటా ఇంకా పెరుగుతోంది… జుట్టు రాలడాన్ని తగ్గించే మందులు, జుట్టు నాట్లు వేసి, కొత్తగా మొలిపించే ‘ప్లాంటేషన్ ప్రక్రియ’లకు కోట్లకుకోట్ల టర్నోవర్ పెరుగుతోంది… ముక్కూమొహం ఓ మోస్తరుగా ఉన్నా సరే, చిరుబొజ్జ కనిపిస్తున్నా సరే, భర్త లేదా ప్రేమికుడి జుట్టు నిండుగా, ఒత్తుగా, దట్టంగా, బారుగా ఉండాలని కోరుకునే మహిళల సంఖ్య కూడా ఎక్కువే… సో, ఈ కథ కనెక్ట్ కావాలి నిజానికి… అయితే..?
Ads
మాంచి కామెడీ సీన్లను రాసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది… కామెడీ రాయడం, పండించడం అంత వీజీ కాదు… సంగీతం బాగాలేదు, పాటలు బాగాలేవు… ఇంకేముంది..? ఈ తడబాటు స్పష్టంగా తెలుస్తూనే ఉంది… కానీ కొన్ని అంశాల్లో సినిమాను మెచ్చుకోవాలి… అవసరాల శ్రీనివాస్ ఒద్దికగా, అణకువగా ఉండే హీరో… నిజానికి తను హీరో కాదు, మంచి నటుడు… ఫాల్స్ ఇమేజీ కోసం, మాస్ ఇమేజీ కోసం ఫార్ములా రొడ్డకొట్టుడు వేషాలకు ప్రయత్నించడు… పాత్ర స్వభావాన్ని బట్టి ఒదిగిపోతాడు, ఇందులో కూడా అంతే… మన సూపర్ హీరోల పైత్యాలతో పోలిస్తే శ్రీనివాస్ ధోరణి నచ్చుతుంది… కాకపోతే ఇక్కడ కథ సరిగ్గా వండబడలేదు, అంతే… వెకిలి సీన్ల జోలికి కూడా పోలేదు సినిమాలో… ఇక హీరోయిన్ రుహానీ శర్మ మనకు కొత్తేమీ కాదు, ఇంతకుముందు చిలసౌలో చేసింది ఈ హిమాచలి… ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో బోల్డ్ పాత్రలకూ సై అన్నట్టుంది… కొత్తగా చెప్పడానికి ఏముంది, ఆల్‌రెడీ ఓ ‘డర్టీ’హరి సినిమాలో చేసిందిగా ఈ బోల్డ్ బ్యూటీ… మొత్తానికి సినిమా చూస్తే పోయేదేమీ లేదు, చూడకపోయినా పోయేదేమీ లేదు…!! ఇంతకుమించిన రివ్యూ కూడా అక్కర్లేదు…
Share this Article