ఒరేయ్ అప్పల్నాయుడూ మనోడు దంచినాడ్రా… ఒక్కొక డవిలాగ్.. ఒక్కొక్క మాట ఇంటుంటే అచ్చం మనూరి గుంటడు సూరిగాడు లేడూ .. అచ్చం ఆడు మాట్లాడుతున్నట్లే ఉందిరా .. ఆడికన్నా ఈడికి ఒళ్లీరుకు కుసింత ఎక్కువే ఉన్నట్లుంది .. మహా సుల్లారం గుంటడి క్యారెక్టర్… అచ్చం దించీనాడు అనుకో… ఓడియమ్మా … ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకనుంచి ఇంకోలెక్క… మన బాసకూ ఫై స్టార్ రేటింగ్ వచ్చేత్తాది.. ఎప్పుడో రావడం కాదురా.. అల్రెడీగా వచ్చిసింది..
ఇకనుంచి ఎవుడైనా మన పార్తీపురం.. సికాకుళం.. ఇజీనారం భాష మాట్లాడాల్సిందే.. మనను ఎక్కిరించేరోజులు పోనాయి… మాది బొబ్బిలి.. కోటబొమ్మాళి అని ఏసీ బస్సుల్లో కూడా గట్టిగా అరవొచ్చు.. ఏసీ రైల్ టిక్కెట్ కోసం మెల్లిగా సిగ్గుపడుతూ సెప్పక్కర్లేదు. ఏయ్ టీసీ మా ఇజినరానికి ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ఖాళీ ఉందేటి. ఉంతే ఒక రెండు ఇచ్చిమీ అనొచ్చు… ఇక మన భోగాపురం ఏర్పోర్ట్ రెడీ ఐతే తస్సాదియ్యా బొంబాయిలో కూడా ఎయిర్ లైన్స్ గుంటను అమ్మీ యిజీనారం టిక్కెట్ ఇచ్చిమి అని డబ్బులు కౌంటర్లోకి దర్జాగా ఇసరొచ్చు.. మెల్లిక సిగ్గుపడుతూ సెప్పక్కర్లేదు.. అంటూ చెప్పుకుపోతున్నాడు పైడిరాజు..
ఏట్రా నీ బాధ… పండుగు అప్పుడే మొదలైందా.. నాటు సారా కవర్లు తెచ్చి కల్లంలో దాసీసీ ఒక్కోటీ మింగుతూ ఇలా వాగుతన్నవేట్రా
అన్నాడు ఒక్క మొట్టికాయేసి అప్పలనాయుడు.. మళ్ళీ ఎంటనే పైడిరాజు తగులుకున్నాడు ఇన్నాళ్లు ఒట్టి కామెడీగాళ్లకు.. ఇగటాలు అడ్డానికి మాత్రమే మన యిజీనారం భాష వాడీవోళ్ళు .. ఇకనుంచి దీంతల్లి ఎవుడైనా మనూరు భాష నేర్సుకోవాల్సిందే.. ఒరేయ్ మనం తల్సుకుంటే సినిమావాళ్ళకు నేర్పడానికి మన కోట కాడ మనమే ఒక కోసింగ్ సెంటర్ ఎట్టివోచ్చు తెలుసా.. పవన్… చిరు.. బాలయ్య.. వెంకీ.. ఇక కొత్త హీరోయిన్ గుంటలు కూడా మనకాడికి రావాల.. మనం వాళ్లకు సదువుసెప్పాల … మన ఎటకారం.. మన సుల్లరం .. మన పుచ్చింత .. మన మెడపోత్తరం అన్నీ సినిమావాళ్ళకు మప్పిద్దుమా.. మనకూ పేరొస్తాది.. డబ్బులుకూడా వస్తాయిరా అన్నాడు..
Ads
ఓరే మెంటల్ దెంగిడి గుంటడా మందులో నవాసరం ఎక్కువై ఏదేదో వాగుతున్నావ్ కానీ అసలు ఏటయ్యిందిరా అన్నాడు.. అప్పల నాయుడు.. దెబ్బకు పైడిరాజుకు సిర్రెత్తుకొచ్చింది… ఓరప్పిగా ఇన్నాళ్లు రాయలసీమ…. కోనసీమ.. తెలంగాణ యాసలు సినిమాల్లో కనబడేవి.. ఒకాల మన యిజీనారం మాటలు ఎక్కడైనా ఇనబడినా అవన్నీ కామెడీ గాళ్ళకు పెట్టేవాళ్లు..ఇప్పుడు అలాక్కాదు .. ఏకంగా హీరోకు పెట్టారు.. గుంటడు మన నాగ్గాడి మనవడు.. ,మన కింగ్ నాగార్జున కొడుకు..
సింపి పారీనాడు .. డైలాగ్స్ ఇనలేదేట్రా అన్నాడు.. ఒసే . నిజమేనేట్రా అన్నాడు అప్పలనాయుడు.. దెబ్బకు పైడిరాజు కళ్ళు తారాజువ్వల్లా మెరిసిపోనాయి.. అవతలోడికి తెలీనిది ఈడికి ఏదైనా గెలిసింది అంటే ఇక ఒంటిమీద గుడ్డ ఆగదు. దెబ్బకు ఓమోస్తరు ప్రొఫెసర్ మాదిరి మెడ పక్కకు వంచి మళ్ళీ తగులుకున్నాడు.. ఒర్ అప్పిగా నిన్న మన నాగ సైతన్య తండేల్ టైలర్ వచ్చిందిరా.. అందులో సైతన్య అచ్చం మనూరి సేపలోల్ల భాషలో ఇచ్చికెలిపోనాడు..
అంటే ఇన్నాళ్లూ కామెడీగాళ్లకు వాడే మన భాష ఇప్పుడు హీరోకు పెట్టార్రా … అంటే రేపేల్లుండి రామ్ చరణ్ కూడా ఒక సినిమా చెయ్యొచ్చు.. మన బుడ్డోడు ఎన్టీయార్ కూడా ఒక సినిమా మన భోగాపురం కాసి తియ్యొచ్చు.. ఆళ్ళిద్దరికి మనమే భాష నేర్పొచ్చు.. ఆ ఛాన్స్ రావొచ్చు.. ఎవులి తలరాత ఎవులు చూడొచ్చారు.. అన్నాడు పైడిరాజు .. సర్లేగానీ పండక్కి గొర్రెపోతు కొనాలి అలమండ సంతకు ఎల్దుమేటి అన్నాడు అప్పలనాయుడు.. సరే పోదాం అంటూ బయల్దేరారు…
(తెలంగాణ యాస పెడితే తెలంగాణలో తప్ప ఆంధ్రాలో పెద్ద వర్కవుట్ కావడం లేదు, దసరా సినిమాకు, బలగం సినిమాకు అదే మైనస్సు, ఇక రాయలసీమ యాస కూడా పర్లేదు, పైపైన యాస వోకే, ఫుల్లు యాసలో మాట్లాడితే అర్థం కాదు, ఇప్పుడిక నాగచైతన్య తండేల్ సినిమాలో ఉత్తరాంధ్ర యాస టేకప్ చేశాడు, వర్కవుట్ అవుతుందా….. ఇలా ఓ పెద్ద వెబ్ సైట్ ఏదేదో రాసుకుంటూ పోయింది… అది చదివి బాధేసి, ఇదుగో మా యాసలో నేను హర్టయిన ఫీల్‌తో… ఇలా రాసుకొచ్చానన్నమాట… By కొప్పర గాంధీ)
Share this Article