.
Yanamadala Murali Krishna …… ఏ టెక్నాలజీతో మెరుగైన శబ్దాన్ని వినగలము?
2000 సంవత్సరం తర్వాత అంతా డిజిటల్ మయం అయిపోయింది. శబ్దం, దృశ్యం, అక్షరం ఒకటేమిటి అన్నీ 0, 1 డిజిటల్ ఫార్మాట్ లోనే వస్తున్నాయి. మొదట్లో శబ్దాన్ని షెలాక్, వినైల్ రికార్డులపై ముద్రించేవారు. తదుపరి మాగ్నెటిక్ టేపులపై ధ్వని ముద్రణ చేశారు.
తర్వాతికాలంలో కంపాక్ట్ డిస్కులపై డిజిటల్ రూపంలో శబ్దాన్ని పునరుత్పత్తి కోసం ఉంచుతున్నారు. డిజిటల్ కాని వాటన్నింటినీ అనలాగ్ అంటారు.
Ads
సంగీతం, చలనచిత్రాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి రావడంతో జనబాహుళ్యానికి అవి చేరువయ్యాయి. ఖర్చు తక్కువ కావడమే కాకుండా… తక్కువ స్థలంలోనే వాటిని ఉంచగలము. అలాగే వాటికి సంబంధించిన ఉపకరణాల మెయింటనెన్స్ కూడా బాగా తక్కువ ఖర్చుతో కూడినది. తదుపరి కాలంలో వచ్చిన ఇంటర్నెట్ తో మరింత చౌకగాను, పెద్దగా చోటు ఆక్రమించకుండాను కావాల్సిన దృశ్యాన్ని చూడడం, శబ్దాన్ని వినడం సాధ్యపడింది.
కాగా వినైల్ రికార్డులు, ఆడియో క్యాసెట్స్ ఇంకా అందుబాటులో ఉండటమే కాకుండా… ఇటీవలికాలంలో మరింతగా ప్రజాదరణ పొందుతున్నాయి. వీటి వాడకం వెనుక కేవలం నోస్టాల్జియా తప్ప ఇంకేమీ లేదని ఆధునిక యువతలో చాలా మంది భావిస్తుంటారు. అసలు డిజిటల్ కి మించిన శుద్దమైన శబ్దాన్ని ఇచ్చేది ఏదీ లేదని కూడా వింటూ ఉంటాం.
కానీ వినైల్ రికార్డులు, ఆడియో క్యాసెట్స్ లో సంగీతాన్ని ఆస్వాదించే వారు మాత్రం డిజిటల్ కన్నా ఇవే మెరుగైన శబ్దాన్ని ఇస్తాయి అని చెబుతారు. వాస్తవం ఏమంటే… ఏ ఫార్మాట్ కి ఆ ఫార్మాటు ప్రత్యేకమైన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. దేనికదే గొప్పది. కచ్చితంగా నోస్టాల్జియాకి మించిన ఫ్లేవర్ వినైల్ రికార్డులు, ఆడియో క్యాసెట్స్ జస్తాయి. అందుకే వాటిని ఇష్టపడేవారు ఖరీదైనా, కష్టమైనా వాటిలోనే సంగీతం వినడానికి ఆసక్తి చూపుతున్నారు.
దాదాపు అన్ని గొప్ప పాత ఇంగ్లీష్ ఆల్బమ్స్ సరైన క్వాలిటీతో ఇంటర్నెట్ కి అప్లోడ్ చేయడంతో అవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయితే మన దేశీయ భాషలయిన తెలుగు సహా అనేక భాషలలో ఉన్న సంగీతాన్ని, చలనచిత్రాలను సరైన క్వాలిటీతో డిజిటల్ ఫార్మాట్లో అప్లోడ్ చేయలేదు. ఇదేమీ లాభసాటి వ్యవహారం కాదు కాబట్టి…
ఆసక్తి, ఓపిక ఉన్న కొంతమంది తమకు అందుబాటులో ఉన్న నాన్ ప్రొఫెషనల్ ఎక్విప్ మెంట్ తో అప్లోడ్ చేయడంతో… వాసి ఉన్నప్పటికీ తక్కువ నాణ్యమైన సంగీతమూ, దృశ్యం మాత్రమే డిజిటల్ ఫార్మాట్లో ఆన్లైన్ లో లభ్యమవుతున్నవి.
అందుకే మంచి సంగీతం వినడానికి ప్రాంతీయ భారత భాషలలోని ఉత్సాహవంతులు, ఆసక్తి ఉన్నవారు ఇప్పటికీ వినైల్ రికార్డులు, ఆడియో క్యాసెట్స్ పైనే నమ్మకం పెట్టుకున్నారు.
నా దగ్గర చాలా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ వినైల్ రికార్డ్స్ వున్నాయి. మంచి సిస్టమ్ వున్నా, వినాలనే ఆసక్తి వున్నా కొన్ని కారణాల వల్ల వినడం కుదరడం లేదు. నాకు స్టీరియా ఆడియో సిస్టమ్స్ మీద చాలా అవగాహన వుంది. ఒకానొక దశలో అందరు ఆడియోఫైల్స్ చేసే విధంగా నెమ్మదిగా DIY అనబడే సొంతంగా ఏదో చేసేసే ప్రయత్నం మొదలు పెట్టి ఆపేసా. విజయన్ అనే ఇక్కడే పెరిగిన మలయాళీ ఫ్రెండ్ ఒకరు నాకు ఎలక్ట్రానిక్స్ విషయాలు చెప్పేవారు.
కాకినాడలో టర్న్ టేబుల్ నుండి కాసెట్స్ రికార్డింగ్ చేసే సెంటర్స్ కి నీడిల్ అనబడే స్టైలస్ లేక చాలా కాలం పక్కన పడేసిన సందర్భం వుంది. అప్పుడు ముంబై లో తెలిసిన వారి ద్వారా క్లాసిక్ 700 అనే స్టైలస్ ని రప్పించి రెండు సెంటర్స్ కి మూడేసి చొప్పున ఇచ్చా. కాకినాడలో సిటీ మ్యూజికల్స్ షాప్ లో వారితో మా రామచంద్రపురం కనెక్షన్ (వారిది మాచవరం, మా ఊరుకి 6 కిలోమీటర్లు) కారణంగా నాకు ఒకసారి 70 కొత్త లాంగ్ ప్లే రికార్డులు ఇచ్చారు………
ఫోటో : ఆడియో క్యాసెట్… వీడియో రికార్డింగ్ లో కుడి, ఎడమ రెండు చానల్స్ లో వేర్వేరు శబ్దాలు వస్తాయి. 1980 ల నుండి మనదేశంలో స్టూడియో రికార్డింగ్ లోనే ఎక్కువ చిత్రాలు విడుదలయ్యాయి. టేప్ రికార్డర్లో రెండు చానల్స్ ఉన్నప్పటికీ ఒక్క ఛానల్ మాత్రమే వినగలిగే ఏర్పాటు కూడా ఉంటుంది.
నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 2600 రూపాయలతో మా నాన్న బూమ్ బాక్స్ అనబడే స్టీరియో ఆడియో సిస్టమ్ కొన్నారు. మొత్తం శబ్దాలన్నీ ఒకే ఛానల్ లో వచ్చే దానిని మోనో అంటారు. పాత సినిమాలు, పాటలు మోనో ఫార్మాట్ లోనే ఉంటాయి.
మా రామచంద్రపురంలో ఝాన్సీ ఆడియో రికార్డింగ్ సెంటర్ సుబ్బారావు పాత సినిమా పాటలను రెండు ఛానెల్స్ లో వేర్వేరుగా వచ్చే విధంగా రికార్డ్ చేశారు. అంటే రెండు కాసెట్స్ లో చెయ్యాల్సింది ఒకే కాసెట్ లో చేశారన్న మాట. ఒక కాసెట్ మిగులు. ఆ ప్రయోగం బాగుండింది. కానీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. నాకు నచ్చిన ఒక్కో చిత్రంలో ఒక్కోపాట ఓపికతో ప్రిన్స్ మ్యూజికల్స్ చిట్టిబాబు చేసి ఇచ్చేవారు….
Share this Article