సలార్ సమీక్ష కాదిది… ప్రతిస్పందన… హీరో చేతి చావు
కొన్ని అంతే. అలా జరిగిపోతాయి. దానికి కార్యకారణ సంబంధాలు; గ్రహచారాలు వెతుక్కుని లాభం లేదు. అలా రెండు మూడు చీకటి రాత్రుళ్లు ఆపి ఆపి ఓటీటీలో సలార్ సినిమాకు నేను గురయ్యాను. అనిమల్ సినిమాను ప్రత్యేక దృష్టితో చూడాలని స్వయం ప్రకటిత సినీ మేధావులు ప్రవచిస్తున్నారు. అలా కెజిఎఫ్ బ్రాండ్ ప్రశాంత్ నీల్ సినిమాలను కూడా ప్రత్యేక దృష్టితో చూడాలి.
వయసు వల్ల వచ్చిన దృష్టి మాంద్యమో లేక చీకట్లో జరిగిన చీకటి సామ్రాజ్యపు వాస్తవిక చిత్రీకరణకు నలుపు అవసరమయ్యిందో కానీ… నాలాంటి సినీ నిరక్షర చక్షులకు ఈ సినిమాలో వెలుగన్నదే కనిపించదు…. ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కాకూడదు.
Ads
ఆపి ఆపి నిద్రపోవడానికి ముందు అనేక విడతల్లో మగతలో చూడడం వల్ల సలార్ సినిమాలో కథను నేను పట్టుకోలేకపోయాను. కాబట్టి కథను, కథనాన్ని సమీక్షించే నైతిక హక్కును కోల్పోయాను. పాటల్లో సంగీత సాహిత్యాలు కనీసం ఇంగువ కట్టిన గుడ్డ కూడా కాదు. వాటి ఊసే అక్కర్లేదు…
ఇందులో నాకు నచ్చిన విషయం- హీరోగా ప్రభాస్ నరుకుడు. సొరకాయ పరపరా కోసినట్లు; క్యాబేజీ తరిగినట్లు; కొత్తిమీర తురిమినట్లు; లేత వంకాయ తొడిమ విరిచినట్లు; చెట్ల కొమ్మలు నరికినట్లు; పూలు తెంపినట్లు; అరటి ఆకులు మధ్యకు కోసినట్లు; కలుపు మొక్క ఏరిపారేసినట్లు; విత్తనాలు విసిరిసిరి చల్లినట్లు; గట్లల్లో చెట్లను కూకటివేళ్లతో పెకలించినట్లు; శవాలను తూర్పారబట్టినట్లు; శవాలను గోనెసంచుల్లో వేసి బండ్లకు కట్టినట్లు; రక్తం కాలువలు కట్టినట్లు; భయవిహ్వల హింస… ప్రశాంత ప్రమోద ప్రహృష్ట హంస గీతమైనట్లు; చావు జాతరకు మరో ప్రపంచపు అరుణవర్ణ లోకం అర్ణవమై ఎలుగెత్తి బృందగానం పాడినట్లు; కత్తికి ఎదురెళ్లి సినిమా తెర పరా పరా చిరిగి… విశ్రాంతిలో ప్రేక్షకుల బలానికి రక్తం లోటాల్లో ఇచ్చినట్లు… చంపితే ఇలా విసుగు విరామం లేకుండా చంపాలి అని పరమ శాంతమూర్తులు కూడా వంటిళ్లలో కత్తులు పట్టుకుని వీధుల్లో పడేలా… ఆ చంపుడు ఒక అనిర్వచనీయ మృత్యుహేల- భలే భలే హొమ్ బలే ప్రశాంత్ నీల్ లీల!
‘ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక.. గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు! చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడ్రా’ … ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందా…? ఇదీ దాదాపు అంతే, కూరగాయల్ని తరిగినట్టు… తురిమినట్టు… బాబోయ్…
ఇంతకూ… నా పేరేమిటి? ఇలా పగలే పగల సెగల చీకట్లు కమ్ముకున్నాయేమిటి?
- నిస్సహాయ సాలార్ సగటు మౌనప్రేక్షకుడిని… నా ఇంటికి దారేది? ఎర్రగడ్డకు బస్సేది?…. 9989090018
Share this Article