.
Director Devi Prasad.C. …. మా గురువు “కోడిరామకృష్ణ” గారు వెండితెరకు పరిచయం చేసిన నటులెందరో ప్రసిద్ధులయ్యారు. వారిలో ఎక్కువమంది మొదట నటనలో ఏమాత్రం ప్రవేశంగానీ ఆసక్తిగానీ లేనివారే.
- ఒక వ్యక్తి తన పాత్ర ఆహార్యానికి సరిపోతాడనుకుంటే చాలు అతను కాస్ట్యూమరైనా, నిర్మాతైనా, ప్రొడక్షన్ మేనేజరైనా, అసలు సినిమా పరిశ్రమకే సంబంధం లేని మనిషైనా సరే ముఖ్యమైన పాత్రలను వారితో ధరింపచేసి నటింపచేసేవారు.
ఆడిషన్స్, యాక్టింగ్ వర్క్‌షాప్స్ లాంటివి గానీ, ఆ కొత్త నటుడు ఎలా నటించగలుగుతాడో టెస్ట్ చేసి చూడటం గానీ, ట్రైనింగ్ ఇప్పించటం గానీ ఏమీ చేసేవారుకాదు. డైరెక్ట్‌గా షూటింగ్‌లో నటింపచేయటమే.
Ads
ప్రతి పాత్రనీ షాట్‌కి ముందు ఆయన నటించి చూపేవారు.
ఆయా వ్యక్తుల పర్సనల్ మేనరిజమ్స్ ని గమనించి ఆయా పాత్రలకు అన్వయింపచేసేవారు.
ఒక్కొక్కరి సామర్ధ్యాన్నిబట్టి వారినుండి నటనను రాబట్టటానికి కొన్ని టెక్నిక్‌లను ఉపయోగించేవారు.
అదనంగా లీక్ అయ్యే కెమేరాలైట్ ని నియంత్రించటానికి లైట్‌కి అడ్డంగా పెట్టే పల్చటి నల్లటి చెక్కని “బ్లాక్ కట్టర్” అంటారు.
వాటిని కెమేరా డిపార్ట్‌మెంట్‌వాళ్ళకంటే మేమే ఎక్కువ ఉపయోగించేవాళ్ళం.
ఎలాగంటే…
కొత్తగా నటిస్తున్న విలన్ పాత్రధారి తన ఎదురుగా నిలబడ్డ హీరోతో అయిదారు డైలాగ్స్ చెప్పి చాలెంజ్ చేసి వెళ్ళే సీన్ షూట్ చేస్తున్నామనుకోండి….
అసలే అనుభవం లేని కొత్తవాళ్ళు కనుక డైలాగ్స్ గడగడా చెప్పలేరు.
కనుక కెమేరా అవుట్‌ఫ్రేమ్లో హీరో తలవెనుక కొద్ది దూరంలో, ఎదురుగావున్న కెమేరాకి లెఫ్ట్‌లో, రైట్ లో, బ్లాక్‌కట్టర్స్ మీద చాక్‌పీస్‌తో డైలాగ్స్ విభజించి రాసి స్టాండ్స్ కి ఫిక్స్ చేసిపెట్టేవాళ్ళం.
టేక్‌లో కెమేరా పక్కనుండే డైరెక్టర్ గారు నటులతో “నావైపు చూడకుండా వింటూ నేను చెప్పినట్లు చెయ్యండి” అనేవారు.
యాక్షన్ చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండేవారు.
హీరో వెనక కట్టర్ మీద రాసిన డైలాగ్స్ కోపంగా చదువు అంటే చదువుతాడు నటుడు. (సినిమాలో హీరో మొహం చూసి డైలాగ్ చెబుతున్నట్టే కనిపిస్తుంది)
ఇప్పుడు స్ట్రైట్‌గా చూడు అంటే చూస్తాడు.
సీరియస్‌గా గెడ్డం గోక్కో అంటే గోక్కుంటాడు.
ఇప్పుడు రెండో కట్టర్ మీదున్న డైలాగ్ చదువు అంటే చదువుతాడు. ఒక్కసారి హీరో వైపు కోపంగా చూడు…..చూస్తాడు.
ఇప్పుడు రైట్‌లోవున్న కట్టర్ మీది డైలాగ్ గట్టిగా చదువు… తల అటుతిప్పి చదువుతాడు.
మళ్ళీ హీరోవైపు గుడ్లురిమి చూడు …. చూస్తాడు.
మీసం మీద చెయ్యేసి తొడకొట్టు…. తొడగొడతాడు.
హీరోని చూస్తూ కొంచెం నవ్వుతూ అవుట్‌ఫ్రేమ్‌కి వెళ్ళిపో…. వెళ్ళిపోతాడు.
కట్. షాట్ ఓకే.
తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో కావలసిన పర్ఫెక్ట్ మాడ్యులేషన్‌తో డబ్బింగ్ చెప్పించేస్తాం. సదరు నటునితోనే డబ్బింగ్ చెప్పించాలనుకున్నా అక్కడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి.
మరో సినిమాలో ఓ సన్నివేశం.
జర్నలిస్ట్ అయిన హీరోయిన్ విలన్స్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుందనే కోపంతో విలన్ పోలీసులను తీసుకొచ్చి సంసారులుండే ఏరియాలో వ్యభిచారం చేస్తుంది ఈమె అని అభాండాలు వేస్తూ అరెస్ట్ చేయించే సన్నివేశం.
విలన్ పాత్రధారి కొత్త మాత్రమే కాదు అసలు సినిమాలు చూడనైనా చూడని మనిషి.పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు. (మంచి హృదయం మాత్రం ఉంది)
ఎంతసేపూ నేను డైలాగులు చెబుతున్నా ఆయనకు గుర్తుండటం లేదు. ప్రామ్‌ప్టింగ్ కూడా అందుకోలేకపోతున్నారు.
నా కష్టాన్ని చూసిన డైరెక్టర్ గారు “ఓ పని చెయ్యి దేవీ… ఆయన్ని పక్కకి తీసుకెళ్ళి సన్నివేశం మొత్తం వివరంగా చెప్పి అలాంటి సంఘటన వాళ్ళ ఏరియాలో జరిగితే కోపంగా ఆయనైతే ఎలా మాట్లాడతారో అలాగే ఆయనిష్టం వచ్చినట్లు మాట్లాడమను. డబ్బింగ్‌లో దానికి తగ్గట్లు డైలాగ్స్ రాసి చెప్పిద్దాం” అన్నారు.
ఆయనతో అంతా వివరంగా చెప్పి కెమేరా ముందుకు తీసుకెళ్ళాను.
డైరెక్టర్ యాక్షన్ అనగానే ఆయన హీరోయిన్ మీదికి ఒక్కసారిగా దూసుకెళ్ళి “ఏమనుకుంటున్నవే ల…? మా ఏరియాల ఉంటూ గీ దందా ఏందే…? గీ లం…తనమేందే….? నీయ… నర్కుత బిడ్డ… గిది సంసారం గిట్లజేసే ఏరియానే . ఎయ్ జూత్తనిల్వడ్డవేందిరబయ్ ఏమ్ పోలీసోన్విరా నువ్వు … గీ ల..ని తీస్కపొయ్ లాకప్పుల దె.. పో లం…..?
డైరెక్టర్ గారు కట్ కట్ అని అరుస్తున్నా వెంటనే ఆగలేదాయన.
హీరోయిన్ ఒక్కసారిగా బిగుసుకుపోయింది.
అందరూ గొల్లుమంటుంటే ” ఆ కొత్త నటుడు మాత్రం ఏమీ అర్ధం కాక అమాయకంగా “ఏం జేస్న.. మీరు జెప్పినట్టె జేస్నగదే …. మాతాన గట్లాంటి పోర్ని గట్లనే అంటం’’….. అని ప్రశ్నార్ధకంగా చూస్తుంటే డైరెక్టర్ గారు నవ్వుతూ “బ్రహ్మాండంగా చేశారు.ఎమోషన్ పర్ఫెక్ట్‌గా వుంది.కొంచెం కంట్రోల్ చేసుకొని ఆ బూతులు మాత్రం లేకుండా ఇలాగే అదరగొట్టేయండి” అని ఉత్సాహపరిచారాయన్ని.
కొత్త నటులతో ఇలాంటి మరెన్నో విడ్డూరాలు, సరదాలు తరచూ జరుగుతూ వుండేవి మా సెట్స్‌లో.
కలలో కూడా సినీనటులమవుతామని ఊహించనివారు, నటనలో ఓనమాలు తెలియనివారు కూడా మా గురువు గారి ద్వారా వెండితెరకు పరిచయం అయ్యి, ప్రతిభకి పదునుపెట్టుకుంటూ , ఒక్కొక్కరు పలు భాషలలో వందలాది సినిమాల్లో నటించి ప్రముఖ నటులుగా కీర్తించబడటం చరిత్ర. ________ దేవీప్రసాద్.
Share this Article