ఎయిర్ ఇండియా తిరిగి టాటాల చేతుల్లోకి చేరనుందనే వార్త నిన్నంతా వైరల్..! సోషల్ మీడియా అత్యంత పాజిటివ్‌గా రియాక్టయింది… ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడాన్ని, మోడీ ప్రభుత్వ పోకడల్ని నిత్యమూ నిరసించేవాళ్లు కూడా ఎయిర్ ఇండియా అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నారేమో గానీ అది టాటాల చేతుల్లోకి వెళ్లే అవకాశాల్ని మాత్రం విమర్శించడం లేదు… అంటే వాళ్ల ఉద్దేశంలో… వెళ్తే గిళ్తే ఎయిర్ ఇండియా టాటాల చేతుల్లోకి వెళ్లడం గుడ్డిలో మెల్ల అన్నమాట..! నిజానికి ఇప్పుడు దేశంలో ఆదానీ, అంబానీలదే చెల్లుబాట… వాళ్లేది అనుకుంటే అదే శాసనం… దాదాపు ప్రతి రంగంలోకి ఆ అక్టోపస్‌లే చొచ్చుకుపోతున్నయ్… ఈ స్థితిలో ఎయిర్ ఇండియా కొనుగోలుకు పెద్ద బిడ్డర్ టాటా అనే విషయం బయటపడటం ఆశ్చర్యాన్ని కలిగించింది… ఎయిర్ ఇండియా టాటాల చేతుల్లోకి వెళ్లడం మంచిదే అనే ఓ స్థూలాభిప్రాయం నిన్న సోషల్ మీడియాలో బలంగా వ్యక్తమైంది… అది టాటా క్రెడిబులిటీ… వ్యాపారంలో కొన్ని విలువలు, ప్రమాణాలు పాటిస్తారనే ఓ నిశ్చితాభిప్రాయం జనంలో ఉంది… అందుకే 60 వేల కోట్ల అప్పుల్లో మునిగి కొట్టుకుంటున్న ఎయిర్ ఇండియా సంస్థకు టాటాలే శరణ్యమనే భావన కనిపించింది…
హయ్యెస్ట్ బిడ్డర్ టాటాలే అయినా, ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు కాబట్టి ప్రభుత్వవర్గాలు ఈ అమ్మకాన్ని ధ్రువీకరించడం లేదు… కానీ టాటా చేతుల్లోకి వచ్చేసినట్టే…! స్పైస్‌జెట్ ఈ కొనుగోలు పోటీలో వెనుకబడింది..! నిజానికి ఎయిర్ ఇండియా టాటాలపరం కావడాన్ని భారతీయ సమాజం వ్యతిరేకించడం లేదంటే దానికి మరో కారణం ఉంది… ఎయిర్ ఇండియా వాస్తవానికి టాటాలదే… అప్పుడెప్పుడో 1932లో జేఆర్డీ టాటా స్వయంగా ఎస్టాబ్లిష్ చేశాడు ఈ సంస్థను, దేశంలోని మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ సంస్థ… మొదటి విమానాన్ని కూడా తనే స్వయంగా కరాచీ నుంచి బొంబాయికి నడిపాడు… తను అప్పటికే లైసెన్స్‌డ్ పైలట్… అప్పట్లో దాని పేరు టాటా ఎయిర్ సర్వీసెస్, తరువాత టాటా ఎయిర్ లైన్స్‌గా పేరుమారింది… రెండో ప్రపంచయుద్ధం తరువాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారి, ఎయిర్ ఇండియాగా మారిపోయింది… 1948లో, అంటే స్వరాజ్యం వచ్చిన మొదట్లోనే ఈ సంస్థలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది అప్పటి ప్రభుత్వం…
Ads
టాటాలు ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా నెహ్రూ 1953లో పూర్తిగా జాతీయ చేశాడు… దాంతో భారతీయ తొలి విమానయాన సంస్థ కథ అలా ముగిసిపోయింది….. కాదు, ముగిసిపోలేదు… కథ ఎక్కడ మొదలైందో, అక్కడికి వచ్చి చేరింది… అది మళ్లీ దాని మాతృసంస్థ, అనగా టాటాల వద్దకే చేరుతోంది… కాకపోతే ఈమధ్యలో బోలెడు వైఫల్యాలు… ఎయిర్ ఇండియాతోపాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ పెట్టింది ప్రభుత్వం… తరువాత నాలుక కర్చుకుని, చేతులు మూతులు కాల్చుకుని రెండింటినీ కలిపేసింది… దాంతో మరింత సంక్షోభం… అస్తవ్యస్త విధానాలు, సహజంగానే ప్రభుత్వరంగంలో కనిపించే అవినీతి, నిర్లక్ష్యం, అధికఖర్చు వంటి అన్ని అవలక్షణాలతో ఏటేటా అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది… ఇక వేరే దిక్కులేక ప్రైవేటీకరించాలని నిర్ణయించింది… అది సా-గీ సా-గీ కథ ప్రస్తుతం ఇక్కడి వరకూ వచ్చింది… అధికారిక ప్రొసీజర్ ఒక్కటే మిగిలింది… అది కాస్తా పూర్తయితే…… టాటా టు ఎయిర్ ఇండియా… కాదు కాదు… ఎయిర్ ఇండియా ఇకపై టాటా…!!
Share this Article