ఎంతసేపూ బీఆర్ఎస్ పార్టీకి బాకా… కేసీయార్‌కు భజన… మరేమీ పట్టదు పత్రికగా పిలవబడే ఓ పార్టీ కరపత్రికకు… ఎస్, కేసీయార్ సొంత పత్రిక అలా గాకుండా ఇంకెలా ఉంటుంది అంటారా..? అరెరె, కేసీయార్ ఇమేజీ దెబ్బతినిపోయిందని ఆగమాగమైపోతే ఎలా..? ఉలిక్కిపడి భుజాలు తడుముకుంటే ఎలా..? తాజాగా ఆంధ్రజ్యోతి వర్సెస్ నమస్తే తెలంగాణ మరో వివాాదం చదువుతుంటే ఇలాగే అనిపిస్తోంది…
నమస్తే తెలంగాణ రంగురుచివాసనచిక్కదనం అన్నీ బీఆర్ఎస్ పార్టీయే… కేసీయారే… దానికి వేరే లోకమే అక్కర్లేదు… అసలు అది పత్రిక అనే నిర్వచనంలోకి రాదు… అలాగని ఆంధ్రజ్యోతి ఏమీ శుద్ధపూస కాదు… అదీ ఓ పార్టీకి మౌత్ పీసే… అదీ తెలుగుదేశం, చంద్రబాబుల భజనపత్రికే… కాకపోతే తెలంగాణకు వచ్చేసరికి దాని ప్రయారిటీలు వేరు… మరీ నిష్పాక్షికం అని క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేం… ప్రజాప్రయోజనాలు అనే కోణం గాకుండా కేసీయార్‌తో పత్రిక ఓనర్‌కున్న సంబంధాలను బట్టి అది కొన్నిసార్లు తిట్టేస్తుంది… అంటే నెగెటివ్ స్టాండ్ తీసుకుంటుంది… ప్రస్తుతం అదే స్టేటస్ నడుస్తోంది…
సరే, రాధాకృష్ణ నెగెటివ్ స్టాండ్‌కు కారణం ఏదైనా సరే… జనం కోణంలో కొన్ని స్టోరీస్ వస్తున్నాయి… ఓ ప్రతిపక్ష పాత్ర… పత్రిక ఉండాల్సింది ఆ పాత్రలోనే… ప్రత్యేకించి బీఆర్ఎస్ వంటి అధికార పార్టీ అక్రమాలు కొన్నయినా జనంలోకి వెళ్లాలి, వెళ్తున్నాయి… ఇది రాధాకృష్ణ, కేసీయార్ సంబంధాలు బాగుపడేవరకు మాత్రమే కావచ్చు… ఐనా ఎంతోకొంత బెటరే కదా… కానీ నమస్తే ఊరుకోదు… కేసీయార్‌కన్నా ఎక్కువ బాధపడిపోతుంది… అయ్యో మా సార్ మీద ఈగవాలింది, పెద్ద కత్తి తీసుకుని నరికెయ్ దాన్ని అన్నట్టుగా స్పందిస్తూ ఉంటుంది…
Ads
రాష్ట్రంలో బియ్యం మాఫియా గురించిన వార్తలు ఇవే… ఎస్, బీఆర్ఎస్ పేరుకు, పైకి కేంద్రాన్ని బూతులు తిడుతుంది… ధాన్యం కొనడం లేదు, తెలంగాణ రైతులకు ద్రోహం, అన్యాయం అంటూ… నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం రైస్ మాఫియా బలంగా ఉంది… ప్రభుత్వ ముఖ్యుల మద్దతు, ఉన్నతాధికారుల అవినీతి తోడ్పాటు… వేల కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టింది… మిల్లర్లు సొమ్ముచేసుకున్నారు… నిజంగా చర్యలు తీసుకుంటే సగం రైస్ మిల్లులు మూతపడి, ఓనర్లు జైలులో ఉండాలి… కానీ జరగదు… అంత బలమైంది రైస్ మాఫియా…
ఈ స్థితిలో జస్ట్ కాగితాలపైనే లావాదేవీలు రాసేసి, కొన్ని వందల కోట్లను మిల్లర్లు, ప్రభుత్వ ముఖ్యులు, అధికారులు కలిసి కాజేసే పన్నాగం పన్నారు… ఇదీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఫస్ట్ పేజీ వార్త…
నిజానికి ప్రజలు, సొసైటీ కోణంలో మంచి స్టోరీ… లోలోపల ఏం జరుగుతుందో రిపోర్టర్ వివరంగానే రాసిన పరిశోధనాత్మక కథనం… రైస్ మాఫియాకు సహకరించే దిశలో ప్రభుత్వం ఎలా తోడ్పడుతున్నదో అందరికీ అర్థమయ్యేలా రాయబడిన స్టోరీ… నమస్తేకు ఎలాగూ ఇది చేతకాదు, చేతకానివ్వరు కదా… పైగా దీంతో కేసీయార్ ఇమేజీకి భారీ నష్టం అనుకుని ఉలిక్కిపడి ఓ కౌంటర్ రాసింది అర్జెంటుగా…
ఆంధ్రజ్యోతిని తిట్టిపోసింది… అసత్యపురాతలు అంటూ ఓ స్టోరీ పబ్లిష్ చేసిపారేసింది… అచ్చంగా ఇదీ ప్రజావ్యతిరేక కథనం… ఒక భారీ స్కామ్ జరగబోతుంటే, దానిపై ముందుగానే అలర్ట్ చేసిన ఆంధ్రజ్యోతిది పాత్రికేయ ద్రోహమా… అబ్బే, స్కామ్ ఏమీ లేదని, నిజాలు దాచేసి, సపోర్ట్ చేస్తున్న నమస్తేది పాత్రికేయ ద్రోహమా..? గంగ చంద్రముఖిగా మారినట్టు… జర్నలిస్టు పూర్తిస్థాయి కార్యకర్తగా మారితే ఇదుగో ఇలాంటి కౌంటర్లే పబ్లిష్ అవుతుంటాయి…
అది అసలే ఆంధ్రజ్యోతి… ఊరుకోలేదు… నేను రాసిందేమిటి..? అసలు నీ కౌంటర్ ఏమిటి..? స్కామ్‌కు సపోర్ట్ చేయాలంటే కూడా కాస్త క్వాలిటీ ఉండాలోయ్ అన్నట్టుగా మరో రీకౌంటర్ పబ్లిష్ చేసింది ఈరోజు… నమస్తేను బట్టలిప్పి బజారులో నిలబెట్టింది… చూడబోతే ఓ పెద్ద స్కామ్‌కు నమస్తే సపోర్ట్ చేస్తున్న కలరింగ్ వచ్చేసింది…
అంటే, పరోక్షంగా ఇందులో ప్రభుత్వ ముఖ్యుల పాత్ర ఉంది కాబట్టే నమస్తే ఇలా ఆ మాఫియాకు సపోర్ట్ చేస్తున్నదనే భావనను తనే క్రియేట్ చేసింది… మొహంపై ఈగ వాలితే కత్తితో ఖండించినట్టు ఉందని చెప్పింది ఇందుకే… ఈ రైస్ మాఫియా విషయంలో ఆంధ్రజ్యోతి వార్తలు సరైన దిశలో ఉన్నాయి… నమస్తే మాత్రమే పింక్ పేపర్ తరహాలో ప్రజావ్యతిరేక కోణాన్ని ఎంచుకుంది…!! నమస్తే ఉలిక్కిపడితే కేసీయార్ ఉలిక్కిపడ్డట్టే… మరి ఎందుకు కేసీయార్ ఈ కథనాలపై ఉలిక్కిపడుతున్నట్టు…!?
Share this Article