.
సాదా సీదా ఫెయిరీ టేల్… నయనతార – బియాండ్ ఫెయిరీ టేల్
నయనతార నెట్ ఫ్లిక్స్ చిత్రం చూస్తే ఏమనిపించింది? చాలామందికి ఏ మసాలాలూ లేని మామూలు సినిమా అనిపించింది.
Ads
ఒకప్పుడు సినీతారల జీవితాల గురించి ఎంత ఆసక్తి ఉన్నా, వారు చెప్పేవే బయటకి వచ్చేవి. పబ్లిసిటీ అవసరం కాబట్టి అప్పుడప్పుడు అక్కరలేని స్టోరీలు కూడా వండి వార్చేవారు. అవి కూడా సినిమా పత్రికలలోనే. వారి కుటుంబం, పిల్లలు చాలా అరుదుగా కనిపించేవారు.
సోషల్ మీడియా ప్రవేశంతో సాధారణ జీవితాలు కూడా అసాధారణ సాహసాలతో, రోజువారీ పనులతో అందరికీ దగ్గరవడం మొదలైంది. దాంతో అనివార్యంగా సినిమా తారలు తమ విశేషాలు షేర్ చేసుకోవడం మొదలైంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సినిమావార్తలు క్షణాల్లో చేరిపోతున్నాయి. అంతేనా! ఎవరెవరు ప్రేమలో ఉన్నారు? విడాకులు ఎవరు తీసుకుంటున్నారు కూడా అందరికీ తెలిసిపోతోంది.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక విషయ పరిజ్ఞానం మరింత పెరిగింది. సినిమావాళ్ళే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకప్పుడు రంగస్థల నటుల నుంచి అన్ని వర్గాల వారికీ తగిన మార్కెట్ ఉండేది. ఇప్పుడు తారలే అన్ని మార్కెట్లకు చొచ్చుకుపోయి అందరి పనులూ చేసేస్తున్నారు.
మనకి ఇప్పటికే మహానటి సావిత్రి, జయలలిత,ఎన్టీఆర్ జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఒక సినీ హీరోయిన్ తన జీవితాన్ని ఒక చిత్రంగా చూపిస్తానంటే ఆసక్తిగానే ఉంటుంది. ఎవరివీ సమస్యలు లేని జీవితాలు కావు.
అమాయకంగా, అనామకంగా సినిమా రంగంలో అడుగుపెట్టే అమ్మాయిలకు సమస్యలు ఇంకాస్త ఎక్కువే. వాటిని అధిగమించి అగ్రస్థానానికి చేరుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని దాటింది కాబట్టే నయనతార లేడీ సూపర్ స్టార్ స్టేటస్ సాధించింది.
వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నయన్ తలచుకుంటే ఆమె కథ ఇంకాస్త స్ఫూర్తిదాయకంగా చెయ్యచ్చు. కానీ ఈ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ పెద్దగా మెప్పించలేదనే చెప్పాలి.
మనకి ఎందరో నటీనటులున్నారు. వారి వ్యక్తిగత జీవితాలూ ఆసక్తిదాయకంగానే ఉంటాయి. వాటిని సినిమాగానో, సిరీస్ గానో రూపొందిద్దామని ఎవరూ అనుకోలేదు. నయనతారకు కలిసొచ్చిన అంశం ఇదే. అందుకేనేమో, ఆమె వివాహ ప్రసార హక్కుల కోసం కాకుండా తాననుకొన్న జీవితం చూపడానికి నెట్ ఫ్లిక్స్ ని ఎంచుకుంది.
ఈ చిత్రం బాగుంది అంతే . ఎలాంటి స్ఫూర్తి కలిగించదు. కొత్తగా సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలకు ఎలాంటి సూచనలూ లేవు. ప్రేమలో మోసపోకుండా ఎలా ఉండాలో చెప్పలేదు. తన బలహీనతను బలంగా ఎలా మార్చుకుందో చెప్పలేదు.
ఆడపిల్లలు జీవిత భాగస్వామి విషయంలో ఏ ఫార్ములా నమ్ముకోవాలో చెప్పలేదు. కనీసం పిల్లల సరోగసి గురించి కూడా చెప్పలేదు. ఈ అంశాలు కూడా వివరిస్తే ఇంకా ఎక్కడికో వెళ్లిపోయేది. సింపుల్ గా తేల్చేసారు కాబట్టి నయనతార- విఘ్నేష్ శివన్ ల ప్రేమకథలా మాత్రమే అనిపిస్తుంది.
ధనుష్ తో వివాదం వల్ల ఫ్రీ పబ్లిసిటీ అయితే లభించింది. మొత్తమ్మీద నయనతార అభిమానులకు నచ్చే డాక్యుమెంటరీ మాత్రమే కానీ…ఈ విజయం అనేకమంది నటులకు కొత్త బాట చూపుతుందేమో! -కె.శోభ
Share this Article