పేరు – డాక్టర్ విశాల్ వాని
ఊరు – బాంబే
ప్రత్యేకత- బాంబేలో డాక్టర్ రాహుల్ ఘులే స్థాపించిన రైల్వే స్టేషన్ల దగ్గర పనిచేస్తున్న 25 ఒక రూపాయ క్లినిక్ లలో డాక్టర్.
——————
పేరు – డాక్టర్ సుశోవన్ బెనర్జీ
ఊరు – కలకత్తా
వయసు – 82
ప్రత్యేకత – లండన్లో చదివి, కొంతకాలం అక్కడే పనిచేసి అర్ధ శతాబ్దంగా కలకత్తాలో ఒక రూపాయకే వైద్యం చేస్తున్న డాక్టర్.
——————-
పేరు- డాక్టర్ ఎస్ పి ముఖర్జీ
ఊరు – రాంచి
ప్రత్యేకత – అరవై ఏళ్లుగా అయిదు రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్
——————
Ads
పేరు- డాక్టర్ శంకర్ రామ్ చందాని
ఊరు – సంబల్ పూర్, ఒరిస్సా
ప్రత్యేకత – వైద్య విద్యాలయంలో టీచర్ గా పనిచేస్తూ, పొద్దున్న సాయంత్రం పది రూపాయలకే వైద్యం చేస్తున్నారు.
—————–
పేరు – డాక్టర్ ఎస్ సి శంకర్ గౌడ
ఊరు – మాండ్య, కర్ణాటక
ప్రత్యేకత- ఉదయం రైతుగా పొలాల్లో పని. మధ్యాహ్నం అయిదు రూపాయలకే వైద్యం.
——————-
ఈ వార్త ఎవరిగురించో అర్థమయ్యింది కదా. దేశ వ్యాప్తంగా రూపాయ నుండి పది రూపాయల్లోపు ఫీజుతో వైద్యం చేసే కొందరు వైద్యుల గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా చక్కటి స్ఫూర్తిదాయకమయిన వ్యాసాన్ని ప్రచురించింది. ఇందులో ఎవరికి వారే ప్రత్యేకం. ఒకరితో ఒకరిని పోల్చడానికి వీల్లేనంత గొప్పవారు. సేవా పరాయణులు. అందరిలో ఉన్న సుగుణాలను గుదిగుచ్చితే ఇలా ఉంటాయి.
1. వైద్య విద్య పూర్తవ్వగానే రోగులకు అత్యంత తక్కువ ఫీజుతో వైద్యం చేయాలని నిర్ణయించుకున్నారు.
2. ఒక్కొక్కరు రోజుకు కనీసం మూడు వందల మందిని పరీక్షిస్తున్నారు.
3 . ఒక రూపాయి ఇవ్వకపోయినా వైద్యం చేస్తారు.
4. రాత్రి పగలు ఏ వేళ తలుపు తట్టినా వైద్యం చేస్తారు.
5 . రోగ నిర్ధారణకు, మందులకు కూడా అతి తక్కువ ఖర్చు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
6 . వీరిలో ఇద్దరు, ముగ్గురిని ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చి సన్మానించింది.
7. కలకత్తా ఒక రూపాయ డాక్టర్ డయాలసిస్ పేషంట్. డయాలసిస్ చేయించుకునే రోజు కూడా రోగులను చూడడం మానరు.
8 . మాండ్య డాక్టర్ తో మాట్లాడితేనే సగం రోగం తగ్గిపోతుంది.
9 . ఈ డాక్టర్ల క్లినిక్ ల పక్కన టీ షాపులు నడిపేవారి ప్రశంసాపూర్వక మాటనే టైమ్స్ ఈ వార్తకు హెడ్డింగ్ గా పెట్టింది.
“The doctors who charge less than what a cup of tea costs”
ఆధునిక కార్పొరేట్ వైద్యం, వైద్యులు ఎలా ఉన్నారో ఇక్కడ మాట్లాడుకోవడం అనవసరం. ఇంత గొప్ప వార్త చర్చలో ఆ ప్రస్తావన అభాస కూడా. అతకదు.
వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయంటే, ఎండా కాలంలో ఎండలు కాస్తున్నాయంటే లోకంలో ఇంకా ఇలాంటి మహనీయులు ఉండబట్టి.
“సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్”
వీరి గురించి ఎంతయినా రాయవచ్చు. రాయాలి కూడా. వారి సేవ ముందు ఎంత రాసినా తక్కువే అవుతుంది కాబట్టి- ఇంతకంటే రాయలేక…వారికో దండం. వారి సేవలకు శతకోటి దండాలు……… By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article