Mohan on Dasari Narayanarao
————————————————-ఉదయం పేపర్ ఆఫీసులో దాసరి నారాయణరావు గార్ని అందరూ చైర్మన్ గారు అనేవారు. ఆయన అభిమాన సంఘాల మనుషులొస్తే డైరెక్టర్ గారు అని పిలిచేవారు. పేపర్లో ఎన్నేళ్లు పన్జేసినా మాకు మాత్రం ఈ పిలుపులు వంటబట్టలేదు. చిన్నప్పుట్నుంచి ‘ఎన్టీవోడు, రేలంగాడు, నాగ్గాడు, అంజి ‘గాడు’ అని సినిమాల గురించి మాట్లాడుకోడం మామూలు. అలాగే ఇరవయ్యేళ్లుగా “దాసరోడు గురూ, డైలాగుల్లో కొట్టేస్తాడు” అని మాట్లాడుకోడం అలవాటు. నిజానికి సినిమాలో ఒక యాక్టర్ గురించో డైరక్టర్ గురించో బెజవాడ లీలా మహల్ దగ్గర రిక్షావాళ్ళూ, హైదరాబాద్ సంధ్య థియేటర్ ముందు స్టూడెంట్ కుర్రాళ్ళూ ఇలా మాట్లాడుకున్నారంటే అతనెవరో భారీ సూపర్ స్టార్ అన్నట్టే. అల్లాటప్పా వాడైతే ప్రస్తావనే రాదు. చాల గొప్ప గుర్తింపు ఉంటే గానీ “నా కొడుకు బ్రహ్మనందం గాడు మొహం అప్పడం లాగా పెట్టేస్తాడురా!” లాంటి కామెంట్ రాదు. ఇలా జనంతో ఆప్యాయంగా తిట్టించుకునే అరుదైన అదృష్టం మా డాక్టర్ డైరక్టర్, ఛైర్మన్ గారైన దాసరోడు లాంటి వాళ్లకి స్పెషల్ గా దక్కుతుంది. అలాటి పర్సనాలిటీ కారికేచర్ వేయడం చాలెంజింగ్ గా ఉంటుంది. కానీ చైర్మన్ గారి సొంత పేపర్లో ఆయన్ని వికారంగా, వెకిలిగా వేస్తే ఆయనకి వంగి దణ్ణాలు పెట్టే జనమంతా కోప్పడిపోతారు. అలాగని జనరల్ మేనేజర్ బొమ్మో, సర్క్యులేషన్ మేనేజర్ బొమ్మో గిశామనుకోండి, “ఎవుడీడూ” అని అంతా అడుగుతారు. వీళ్ళకి ఊరూపేరూ ఉండదుగదా మరి.*** *** ***
పొలిటికల్ కార్టూన్ గీసే ముందు హాండ్ వార్మింగ్ కోసమో, కార్టూన్ తర్వాత రిలాక్స్ అవడానికో స్కెచ్ లు గీయడం అలవాటు. ఒకరోజు అలా పేపరు తిరగేస్తుంటే చిన్న సింగిల్ కాలం సినిమా యాడ్ కనిపించింది. ‘తరం’ అనే సినిమా త్వరలో రాబోతుందని పైన వేలెడు సైజులో దాసరి ఫొటో ఉంది. అచ్చయిన బొమ్మలో కళ్ళూ, ముక్కూ వివరాలు సరిగ్గా అవుపించడం లేదు గానీ తలపాగా, కండువా, గుండ్రటి మొహంలో ఒక సిమెట్రీ ఉంది. అందులో ఖచ్చితమైన జామెట్రికల్ ప్రపోర్షన్ ఉంది. కొద్దిగా తంటాలు పడితే కారికేచర్ రావచ్చు. పెన్సిల్ స్కెచ్ నిముషాల్లోనే అయింది. ఇక చేదామంటే ఇంకా చిక్కులున్నాయి. దాసరిది గుండ్రటి మొహం, కొనదేలిన ముక్కు. చబ్బీగా, ఫన్నీగా ఉండాలంటే ఈ రెండూ అతకవు. కారికేచర్ అయినంతమాత్రాన అడ్డగోలుగా అతిశయోక్తి గీతలు గీస్తే అర్థంలేకుండా పోతుంది. అయినా సరే ప్రయోగమే గనక చప్పిడి ముక్కుగా మార్చా. అలా మార్చడం అంటే అబద్ధపు గీతలు గీయడమే. కానీ ఈ కారికేచర్ దాసరిది అని గుర్తుపట్టడానికి నిజం కంటే అబద్ధమే ఎక్కువ సాయం చేసింది. దాసరి ముందు పళ్ళు రెండూ అంత ఎత్తుగా ఏమీ ఉండవు. కానీ వాటిని బయటికి లాగి పారల్లాగా సాగదీసి ఎక్కడ లేని ఎగ్జాగరేషన్ పెట్టేసరికి బొమ్మకి ఐడెంటిటీ వచ్చింది. పాలకొల్లు పరిషత్తు నాటకాల్లో దాసరి మాత్రం ఏదైనా కారక్టర్ కి ఇలాటి మేకప్ పెట్టి – జనాన్ని నవ్వించి ఉండడా ఏంటి అనుకున్నా. ప్రాక్టీస్ కోసం గీసిందే గనక నా టేబుల్ పక్క నేల మీద ఉండే రఫ్ స్కెచ్ ల గుట్టలో పడేశా. ఇక రోజు వారీ పాకెట్, పొలిటికల్ కార్టూన్ల పని మామూలు. వారం రోజులయింది. ఆఫీసులో చాయ్ లు తెచ్చే బాయ్ లూ, నా దగ్గర కాలక్షేపం చేసే సబ్ ఎడిటర్లూ అందరూ ఆ బొమ్మని ఇతర స్కెచ్ లనీ తొక్కుకుంటూ చాలాసార్లు నడిచారు.
Ads
ఓ రోజు ఉదయమే ఆఫీసులోకొస్తుంటే రిసెప్షన్ దగ్గర విజిటర్స్ రూమ్ లో దాసరి, మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ ప్రసాద్ కూచుని మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి విష్ చేస్తూ నవ్వారు. నేనూ నవ్వాను. కారికేచర్ చూపిద్దునా అనిపించింది. టేబుల్ పక్కు తుక్కులో ఉందో లేదో! వెళ్ళి వెతగ్గా దుమ్ముకొట్టుకున్న బొమ్మ కనిపించింది. దులిపి తీసుకెళ్ళి దాసరికి చూపించా. “నీకసలు బుద్ధుందా మోహన్? నా పళ్లు ఇలా పొరల్లాగా ఉంటాయా? సుబ్బిశెట్టి లాగా ఇలా బొండాం గాడిలా ఉంటానా? ఆ ముక్కేమిటి అర్థంలేకుండా? బొజ్జ ఉంటే మాత్రం? ఇంతలానా?” అని పిచ్చి తిట్లు తిట్టవచ్చునేమోననే అనుమానం పీకింది. కానీ ఆయన ఏమీ కంప్లైంట్ చేయలేదు. చిన్న చిరునవ్వు విరిసింది. పక్కనున్న ఎమ్.డీకి చూపించాడు. ‘మోహన్! ఈ బొమ్మ నేను తీసుకోవచ్చా?.. అన్నాడు. సరదాగా ప్రాక్టీస్ కోసం వేసిందే, అచ్చుకోసం కాదు. తీసుకోవచ్చునని చెప్పాను. బావుందని ముఖస్తుతి కోసమన్నా అనలేదాయన. తిట్టుకోలేదు. అంతే చాలనుకున్నా.
రెండ్రోజులు తిరిగేసరికి ఎడ్వర్టైజింగ్ డిపార్టమెంట్ కి లంచావతారం సినిమా ఫుల్ పేజీ యాడ్ వచ్చింది. పేజీలో పై నుంచి కిందికి నేను వేసిన కారికేచర్ అదే సైజుల్లో పెట్టేశాడు పబ్లిసిటీ ఆర్టిస్ట్. ఉదయం బాక్ పేజి నిండా ఆ రోజుకి అచ్చయింది. మర్నాడు చైర్మన్ గారు కబురంపించారు. మద్రాసులో అందరూ బొమ్మని మెచ్చుకున్నారనీ, మరీ ముఖ్యంగా పబ్లిసిటీ ఆర్టిస్ట్స్ ఆ బ్రష్ స్ట్రోక్స్ ని పొగిడాడని, ఆమాట నాకు మరీమరీ చెప్పమన్నాడని చెప్పాడు. ఇక లంచావతారం లోగో పక్కున ఈ బొమ్మని సింబల్ గా పెడతానన్నాడు. తర్వాత పబ్లిసిటీ అంతా అలాగే కంటిన్యూ అయింది.
బొమ్మని దాసరి మెచ్చుకున్నా సరే అఖిల భారత దాసరి యువశక్తి అనే వెర్రి పేరుండే సంఘం నాయకుడు మాత్రం నన్ను క్షమించేవాడు కాదు. ఉదయంలో దాసరి ప్రశ్నలు సమాధానాలని ప్రతి ఆదివారం నాలుగు బొమ్మలేసేవాణ్ణి. అందుల్లో ఒకటి రెండు దాసరి కార్టూన్లు వచ్చేవి. ఆ పళ్ళు కొంచెం చిన్నివి పెట్టండి సార్ అంటూ యువశక్తి వాళ్ళు గొడవ చేసేవాళ్ళు. లంచావతారం సినిమా చూశాక మాత్రం నా అవతారం మారిపోయింది. సినిమా చూడకముందు ఆయన దగ్గరికి చాలసార్లు మా ఎంప్లాయీస్ యూనియన్ తరపున వెళ్ళేవాళ్ళం: (నేనే వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి) చైర్మన్ గారనే వెరపు, బెరుకూ ఏం ఉండేవి కాదు. ఆయన కూడా డౌన్ టు ఎర్త్ గా మాట్లాడేవాడు. మా ఉద్యోగులూ, జీతాలూ, డి.ఎ. పాయింట్లు ఫలానా రోజుకి ఫలానా ఇవ్వక పొతే పెన్ డౌన్ స్ట్రైక్ చేస్తాం అంతే!:- అంటూ డొక్క చీరే హెచ్చరికల్ని గడగడా చేసేవాళ్ళం. తీరా లంచావతారం చూస్తే అందులో ఆయన గుమాస్తాలా నటించాడు. బాస్ దగ్గర ఎస్ బాస్ అంటూ వంగి వంగి ఉండడం, పనిమీద ఆఫీసుకొచ్చే మనిషిని బెదరేయడం, ఇంట్లో శ్రీవిద్య మీద హజం ఇక చెప్పలేనన్ని వెరైటీ మూడ్స్ లో చార్ సౌ బీస్ గుమాస్తాని చూపించాడాయన.
మా ఉదయంలో మేనేజర్లూ, కింది గుమాస్తాలని అజమాయిషీ చేయడం కంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాడనిపించింది. యాక్టర్ గనక తన పనిగా ఈ బిహేవియరల్ సైన్స్ ని స్పెషలైజ్ చేస్తున్నాడని తెలిసిపోయింది. మా ఆఫీసు గుమాస్తాగాళ్ళని ఎంత పట్టిపట్టి స్టడీ చేయకపోతే అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు? డేంజరస్ మాస్! అర్ధమయిపోయింది. అప్పట్నుంచీ మా డి.ఎ పాయింట్ల కోసం, జీతం కోసం ఆయన్తో దెబ్బలాటకి యూనియన్ వాళ్ళం వెళ్ళేటప్పుడు (అలా వెళ్ళడం గొడవ పడటం తప్పదు మరి) చాలా ఇబ్బందిగా ఉండేది. ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు నడక నుంచీ, చేతులూపడం కళ్ళు తిప్పడం అన్నిటినీ అబ్జర్వ్ చేసే నటుడొకడు ఎదురుగా ఉన్నాడనే కొత్త స్పృహ చాలా చికాగ్గా ఉండేది. సెల్ఫ్ కాన్షస్ గా అయిపోయేవాణ్ణి. మా సమస్యల గురించి సీరియస్ గా చెప్తూ మొహంలోకి చూస్తే విలాసంగా నవ్వుతూ సునాయాసంగా సమాధానం చెప్పేవాడు. అప్పుడిక మరో సమస్య గురించి చెప్పాల్సిన విషయం మర్చిపోయి నర్వస్ గా తడువుకోవాల్సి వచ్చేది. ఉద్యోగము, జీతమూ పోయినా పింగు బాయెరి అని తెగించి యూనియన్ పెట్టాం బానే ఉంది. కానీ ఈ దర్శకరత్న నట వజ్రంతో తగువు పడాలంటే వంద స్పాట్ లైట్లు వేసిన స్టేజి మీద ఒక్కణ్ణి నించున్నట్టు సిగ్గేసేది. ఇదేం ఖర్మరా దేవుడా అనిపించేది.
– MOHAN, ARTIST
1947 మే 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దాసరి జన్మించారు. ఈరోజు దాసరి 74వ పుట్టిన రోజు. ఉత్తమ దర్శకునిగా అవార్డులందుకున్న దాసరి 2017 మే నెల 30వ తేదీన మరణించారు.
ఆర్టిస్ట్ మోహన్ ఈ వ్యాసం రాసి 30 సంవత్సరాలు అయింది.
– TADI PRAKASH, 9704541559
Share this Article