పిల్లల కాపీలకు ఊరుమ్మడి సాయం!
కొన్ని దృశ్యాలు మనసును మరులుగొలుపుతాయి. కొన్ని చిత్రాలు మనసును పులకింపచేస్తాయి. కొన్ని దృశ్యాలు కలకాలం గుర్తుండిపోతాయి. కొన్ని దృశ్యాలు ఒకానొక రుతువులోనే దర్శనమిస్తాయి. అలా గ్రీష్మరుతువు ఎండలు మొదలుకాగానే పరీక్షల వేళ అక్కడక్కడా కనిపించే దృశ్యమిది.
“భారతదేశము నా మాతృభూమి…నేను నా దేశమును ప్రేమించుచున్నాను…” అని చేయి చాచి ప్రమాణం చేసే భావి భారత పౌరులైన విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసే వేళ…వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పడే తపన అంతా ఇంతా కాదు. తమ పిల్లలకు మంచి మార్కులు రావాలని మొక్కులు మొక్కుకునేవారు కొందరు. ముడుపులు కట్టుకునేవారు కొందరు. ఉపవాసాలుండేవారు కొందరు. పిల్లలతోపాటు తాము కూడా నిద్రాహారాలు మాని చదివేవారు కొందరు. ఇవన్నీ వింటున్నవే. కంటున్నవే.
Ads
“నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి;
కవులు కంటున్న కలలు మనుష్యుల్లో ఫలిస్తాయి”
అన్నాడు శేషేంద్ర.
అలా తల్లిదండ్రులు కంటున్న కలలు పిల్లల పరీక్షల్లో ప్రతిఫలిస్తాయి.
ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు.
ఇన్ని చేసినా…తమ పిల్లలు కనీసం 35 మార్కులతో గండం గట్టెక్కే మార్గం లేదనుకున్నప్పుడు…ఇతర మార్గాలను వెతుకుతారు. అవి అక్రమ, అనైతిక, చట్ట వ్యతిరేక మార్గాలైనా భయపడరు. పిల్లలు బుద్ధిగా కాపీలు కొట్టడానికి వీలుగా చిట్టీలు అందించడానికి పరీక్షా కేంద్రం గోడలకు నిచ్చెనలు వేస్తారు. రాతిగోడలను తాళ్ల సాయం లేకుండా ఎక్కేస్తారు. కిటికీలు పట్టుకుని వేలాడుతూ…ప్రశ్నలడిగి…దానికి తగిన సమాధానం కాగితాలను చించి…అందిస్తారు. సరిగ్గా కాపీ కొడుతున్నారో లేదో కిటికీలోనుండే అంతెత్తున వేలాడుతూ…పర్యవేక్షిస్తారు. పిల్లలు సక్రమంగా, సావధానంగా కాపీ కొట్టారు అని నిర్ధారణ అయ్యాకే చిట్టిలను తిరిగి తీసుకుని…ఒద్దికగా ఒక్కో రాతిని ఆసరాగా చేసుకుని భద్రంగా కిందికి దిగుతారు.
ఇదొక ఊరి సామూహిక బాధ్యతగా, నైతిక కర్తవ్యంగా, ఊరి ఆత్మగౌరవ సమస్యగా భావించే ఊళ్లు ఆత్మనిర్భర భారత్ లో ఇప్పటికీ చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఎంత అరాచకమైనదైనా దానికి మించిన మంచి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజాస్వామ్యమే ఒక్కోసారి శిరోభారమైనా…అదే శిరోధార్యమవుతుంది. అలా మన పరీక్షల విధానమంతా తప్పుల తడకే అయినా…అంతకు మించిన మంచి ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే అనుసరణీయమయ్యింది.
…ఇలాఊరుమ్మడి సాహస ప్రయత్నాలతో, గోడదాటు విన్యాసాలతో చిట్టి చిన్నారి పిల్లలకు కాపీ చిట్టీల పోషకాహారమందించి…వారు అత్తెసరు మార్కులతో అయినా పాస్ అయినప్పుడు…
ఆ తల్లిదండ్రుల కళ్లల్లో రాలే ఆనంద బాష్పాల ముందు అన్యాయం, అక్రమం, నేరం, దోషం, అనైతికత, డీబార్, ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకోవడాలు, సిగ్గుచేటు, పట్టుబడితే అరెస్టులు లాంటివి దూదిపింజల్లా గాలికి తేలిపోవాల్సిన విషయాలు.
ఒక ఊరి పిల్లల పరీక్ష ఫలితాల సమున్నత కీర్తి కిరీటం కోసం ఆ ఊరుపడే తపనలో భాగంగా దీన్ని చూడాలే తప్ప…ఇతర కొలమానాలతో కొలవకూడదు!
శివుడు దక్షిణామూర్తిగా ఉంటే లోకాల సందేహాలను నివృత్తి చేయగలడు. అలాంటి శివుడికి సందేహాలొస్తే సుబ్రహ్మణ్యస్వామి దగ్గర నివృత్తి చేసుకోవాలి. అప్పుడు కొడుకైనా గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి…రావి చెట్టు కింద రాతి అరుగు మీద కొడుకు సుబ్రహ్మణ్యస్వామి పైన కూర్చుంటే…తండ్రి శివుడు కింద కటిక నేలమీద కూర్చుంటాడట. ఈ సందర్భాన్ని ఒక వీడియోగా రికార్డ్ చేసి స్తోత్రాల్లో బిగించి రుషులు మనకెందుకిచ్చినట్లు? చదువు, జ్ఞానానికి ఇవ్వాల్సిన విలువ గురించి తెలుసుకోవాలని. చదువు చెప్పే గురువు కొడుకే అయినా…తాను ఆదిదేవుడైనా…గురువు గురువే; శిష్యుడు శిష్యుడే అని తెలియజెప్పడానికి. ఆ గురువు పైన ఉంటే..ముందు శిష్యుడు చేతులు కట్టుకుని కింద కూర్చోవాలని. గురువు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడాలని. నిలబడి పాస్ కావాలని.
కొంపదీసి…
ఈ సుబ్రహ్మణ్య గురు స్థానం; శివుడు పాటించిన శిష్య మర్యాద గురించి హర్యానా చంద్రావతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గర పదో తరగతి పరీక్ష పిల్లలకు స్లిప్పులందిస్తున్న సాహసికులకు చెబుతారా? ఏమిటి?
ఆదర్శాలు ఊరికే అనుకోవడానికి- అంతే! ఆచరణ ప్రమాణాలు “చంద్రావతి” అద్దంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి! –పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article