Bed Bugs- Red Flag: పారిస్ ను ప్రపంచ ఫ్యాషన్ రాజధాని అంటారు. పారిస్ నగరాన్ని రాత్రి పూటే చూడాలంటారు. “రాత్రి సుందరి” అని పారిస్ ను వర్ణిస్తూ ఇంగ్లీషులో లెక్కలేనన్ని కవితలు. యూరోప్ పర్యటనలో భాగంగా నేను కూడా కళ్లు మూతలు పడుతున్నా… పారిస్ రాత్రి అందాలను కళ్లల్లో నింపుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పారిస్ ఈఫిల్ టవర్ మీద రంగు రంగుల బాణాసంచా కాల్చడం, ఆపై విద్యుత్ దీపాల జిలుగు వెలుగులు ఒక చూసితీరాల్సిన దృశ్యం. ఈఫిల్ టవర్ లోపల ఒక అంతస్తు తరువాత ఇంకో అంతస్తు – రెండు లిఫ్ట్ లు ఎక్కి టవర్ పైన డెక్ లో ఫ్రెంచ్ ఫ్రయిస్ తింటూ టీ తాగుతూ పారిస్ నగరం అందచందాలను చూశాము. ఇతరేతర ఆకర్షణలు కూడా పారిస్ సొంతం. సభా మర్యాద దృష్ట్యా అవి ఇక్కడ అనవసరం.
ఇదివరకు పారిస్ లో వచ్చిన కొత్త ఫ్యాషన్ బాంబేకు రెండు, మూడు నెలల తరువాత వచ్చేది. ఇప్పుడు పారిస్ లో పొద్దున వచ్చిన ఫ్యాషన్ ట్రెండ్ సాయంత్రానికి ప్రపంచమంతా అందుబాటులో ఉంటోంది. ప్రపంచంలో కొన్ని నగరాలు కొన్నిటికి ప్రత్యేకం. పారిస్ ను మించిన ఫ్యాషన్లు ప్రపంచంలో ఎన్నయినా రావచ్చుగాక. పారిస్ ప్రత్యేకత పారిస్ దే.
Ads
2024 ఒలింపిక్స్ పారిస్ లో జరుగనున్నాయి. ఈ ఒలింపిక్స్ ఫ్యాషన్ పరిశ్రమకు గొప్ప వ్యాపార అవకాశం. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అంతర్జాతీయ పర్యాటకులను కట్టిపడేయడానికి సౌందర్యసాధనాల వస్త్ర చర్మ ఉత్పత్తుల పరిశ్రమ కొత్త కొత్త ఉత్పత్తుల తయారీలో తలమునకలుగా ఉంది. క్రీడలను ప్రతిబింబించేలా అనేక వస్తువులను తయారు చేస్తున్నారు. ఒకటి కొనేవారు నాలుగు కొనేలా వింత వింత మార్కెటింగ్ ఫార్ములాలను సిద్ధం చేస్తున్నారు.
ఈలోపు పారిస్ పెద్ద ప్రమాదంలో పడింది. పారిస్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా నల్లులు వృద్ధి చెంది ఊరంతా నల్లులమయం అయిపోతోందట. పర్యాటకులు ఎక్కడ కుర్చీలో అరగంట కూర్చున్నా నల్లులు మౌనంగా రక్తం తాగి మర్యాదగా పంపిస్తున్నాయట. లాడ్జుల్లో పరుపుల నిండా నల్లులే. థియేటర్లలో కుర్చీల నిండా నల్లులే. సిటీ బస్సుల సీట్లలో నల్లులే. నాలుగు రోజులు కాగితాల కట్టలు కదిలించకపోతే నల్లులే.
పారిస్ మీద నల్లుల యుద్ధం ఆకస్మికం జరిగింది కాదు. నాలుగయిదేళ్లుగా నల్లులు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. మూడేళ్ల క్రితం పారిస్ అధికారికంగా నల్లులపై పోరాటం ప్రారంభించింది. నల్లుల దాడుల మీద ఫిర్యాదులు చేయడానికి ఒక ఆన్ లైన్ పోర్టల్, టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. క్రిమిసంహారక మందులు చల్లారు. పొగ వదిలారు. వేడి ఆవిర్లు వదిలారు. కొత్తగా సున్నాలు కొట్టించారు. వింత వింత మిశ్రమాల్లో విషరసాయనాలు చల్లారు.
వీటితో మనుషుల ఊపిరితిత్తులు దెబ్బ తింటున్నాయి కానీ…అవన్నీ నల్లులకు పోషకాహారమే అయి…ఇంకొంచెం బలిశాయి. దాంతో పారిస్ మేయర్ కు దిక్కు తోచడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లుల నిర్మూలన నిపుణుల సలహాలు ఏవి పాటించినా…ఇప్పటికయితే ఫలితం లేదు. ఈవార్తలు బయటికి ఎక్కువగా పొక్కితే ఒలింపిక్స్ కు వచ్చే క్రీడాభిమానులు తగ్గిపోతారని కౌన్సిల్ ఆఫ్ పారిస్ (నగరపాలక సంస్థ) వణికిపోతోంది.
ఈ సమస్య ఒక్క పారిస్ నగరానికే పరిమితం కాలేదు. ఫ్రాన్స్ దేశంలో చాలా ఊళ్లల్లో ఇలాగే ఉంది పరిస్థితి. కాకపొతే పారిస్ రక్తం తాగే నల్లులు ప్రపంచ వార్త అవుతున్నాయి . మిగతా ఫ్రాన్స్ నల్లుల వార్తలకు ప్రాధాన్యం రాలేదు. అంతే. దోమకాటుతో డెంగ్యూ, ఇతర వ్యాధులు ఎలా వస్తాయో అలాగే నల్లికాటుతో కూడా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ ప్రజారోగ్యశాఖ భయపడుతోంది.
క్రీడాభిమానుల సంగతి తరువాత… ముందు నల్లుల కాట్లకు గురై రుద్దుకుంటూ… గీరుకుంటూ… రక్తహీనులై క్రీడాకారులు కనీసం గ్రవుండు దాకా రాగలరా? వచ్చినా అడగలారా? ఆడినా పూర్తి సామర్థ్యం ప్రదర్శించి గెలవగలరా? అని అంతర్జాతీయ క్రీడా విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చరిత్రలో ఫ్రెంచ్ విప్లవం ఒక తప్పనిసరి పాఠం. అలాంటి ఫ్రెంచ్ ఇప్పుడు నల్లుల మీద చేసే పోరాటం ఫ్రెంచ్ రెండో విప్లవంగా చరిత్రలో నల్లులాక్షర లిఖితం అవుతుందేమో!
సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో నల్లులు కూడా ప్రాణులే. వాటికీ ముద్దు ముచ్చటా ఉండదా? ముందు వరుసలో కూర్చుని ఒలింపిక్స్ చూడాలని ఉండదా? వాటి ఆహారం మనుషుల రక్తం. అది సృష్టి ధర్మం. వ్యవస్థలో కనిపించకుండా మన రక్తం పీల్చే దుర్మార్గాలు ఎన్నో ఉంటాయి. “నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టకుండా… ముద్దు పెట్టుకోవాలా?” అని ఆఫ్టరాల్ చిన్నాతి చిన్న చీమే అడిగింది- గడ్డిమోపు అడ్డమొచ్చిన కథలో. అలాంటిది బొద్దింకలంత తెగ బలిసిన పారిస్ నల్లులు అడగవా! ఏమిటి? వెళితే ఆవురావురుమని రక్తం జుర్రుకోవా! ఏమిటి?
ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఇప్పుడు ప్రపంచ నల్లుల రాజధాని అయ్యిందా! ఈ నగరానికి ఏమయ్యింది? – పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article