.
ఒక్కసారి యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల జాబితా చదవండి… Austria, Belgium, Bulgaria, Croatia, Republic of Cyprus, Czech Republic, Denmark, Estonia, Finland, France, Germany, Greece, Hungary, Ireland, Italy, Latvia, Lithuania, Luxembourg, Malta, Netherlands, Poland, Portugal, Romania, Slovakia, Slovenia, Spain and Sweden…
ఇవన్నీ మేం మీకు తోడుగా ఉంటాం, నీకేమీ భయం లేదు, ఛలో పోరాడదాం అని ఉక్రెయిన్ జెలెన్‌స్కీకి హామీ ఇచ్చాయి… రష్యా దురాక్రమణకు వ్యతిరేకం, అమెరికా సపోర్ట్ లేకపోయినా సరే అన్నాయి… నిజంగా రేప్పొద్దున అవసరమొస్తే ఉక్రెయిన్‌కు యుద్దసాయం చేయగల కంట్రీ ఏముంది ఈ జాబితాలో..?
Ads
ఫ్రాన్స్, జర్మనీ… ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొన్న నేపథ్యంలో అవీ ముందుకు రావు… ఈ దేశాల్లో చాలావరకూ నాటోలో కూడా ఉన్నాయి… ఇదే యూరోపియన్ యూనియన్‌లో రష్యా, బ్రిటన్, నార్వే, స్విట్జర్లాండ్ అసలు సభ్యదేశాలు కావు… ఇలా రెండు కూటములూ నానాజాతి సమితి… ఇన్నాళ్లూ అమెరికా సారథ్యంలో రష్యాపై పోరుకు కొన్ని దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేశాయి…
ఇప్పుడు అమెరికాయే తప్పుకుంది… అంతేనా..? ఇన్నేళ్ల సాయానికి ప్రతిగా ఖనిజ వనరులు తవ్వుకుంటాం, ఒప్పుకో అని గద్దిస్తోంది… సరే, జెలెన్‌స్కీ తలవంచకుండా ధిక్కరించి వచ్చేశాడు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ హీరో అంటోంది… అమెరికా సుంకాల ప్రతిపాదన వాటికి మంటెక్కిస్తోంది కాబట్టి…
నిజానికి ఈ రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అసలు నేరగాడు జెలెన్‌స్కీ… నాటో ఆడించినట్టల్లా ఆడాడు… ఓ అందమైన దేశం ఇప్పుడు ఓ శిథిలచిత్రం… దాదాపు కోటి మంది వెళ్లిపోయారు… ఎటుచూసినా విధ్వంసం ఆనవాళ్లే… ఎన్ని బిలియన్లు ఖర్చుపెట్టినా దాన్ని పూర్వ స్థితికి తీసుకురాలేరు…
నాటోను చూసుకుని రెచ్చిపోయాడు… నేనే యుద్ధం మొదట ఒంటరిగా ఆరంభించాను అనే గప్పాలు, బీరాలు తప్ప నాటో లేకపోతే అసలు రష్యాతో యుద్ధమేది..? ఒక పాలకుడు ఎలా ఉండకూడదో జెలెన్‌స్కీ ఓ ఉదాహరణ…
ఇప్పుడు అమెరికా జోబిడెన్ పాలనలో లేదు… ట్రంప్… అమెరికా కోణంలో మాత్రమే, దాని ఆర్థిక స్థితిని చక్కబెట్టే కార్యక్రమంలో ఉన్నాడు… తను రాజకీయ నాయకుడే కాదు, వ్యాపారి కూడా..! ప్రపంచాన్ని శాసించాలనే ధోరణితోకాదు, ముందు తన గోచీబట్ట సర్దుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు… వివిధ విభాగాల సిబ్బందిని ఇంటికి పంపించాడు…
వివిధ దేశాలకు రకరకాల కారణాలతో ఇచ్చే సాయాన్ని ఆపేశాడు, WHO వంటి సంస్థల నుంచే వైదొలిగాడు… చివరకు రష్యాతోనే కాదు, ఈమధ్య చైనాతో అమెరికాకు పెరిగిన దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాడు… అందుకే తైవాన్ విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు…
సో, ఇప్పుడు ఉక్రెయిన్ రెంటికీ చెడ్డ… కాదు, అన్నింటికీ చెడినట్టయింది… రష్యాతో సంధి అవసరమే లేదు అంటే… ఇప్పుడు తన వెంట ఉండేదెవరు..? రష్యాతో ఢీకొట్టగల సాధనసంపత్తి ఉన్న దేశాలేమున్నయ్..? కెనడాకు అంత సీన్ లేదు, బ్రిటన్ ఆర్థికస్థితీ బాగాలేదు…
ఇంతదూరం వచ్చాక రష్యా కూడా అంత ఈజీగా వదిలేయదు… అమెరికా వదిలేశాక ఇక రష్యా దూకుడు మరింత పెరుగుతుంది… సో, ట్రంపును నిలదీసి హీరో అనిపించుకోవడం కాదు, రేప్పొద్దున ఏమిటి..? ముందు ఏ దారీ కనిపించడం లేదు… మళ్లీ ఆ ట్రంపే దిక్కు, చూస్తూ ఉండండి..!!
Share this Article