ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాల వీక్షణం ఎక్కువైంది… తెలుగులోకి డబ్ చేసి, థియేటర్లలో రిలీజ్ చేయడం, తెలుగు ఆడియోతో ఓటీటీలో పెట్టేయడం ఎక్కువగా సాగుతోంది… పైగా మలయాళంలో ప్రయోగాలు, క్రియేటివ్ థాట్స్, ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే గట్రా మనవాళ్లకు అధికంగా నచ్చుతుంటాయి… యాక్టింగ్ స్టాండర్డ్స్ కూడా…
ఆ హీరోలు మామూలు పాత్రల్ని కూడా చేయడానికి రెడీగా ఉంటారు… మన డొల్ల ఇమేజీ హీరోలకు భిన్నంగా… ప్రత్యేకించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్లను మాలీవుడ్ డైరెక్టర్లు, రచయితలు భలే డీల్ చేస్తారు… హాట్‌స్టార్‌లో స్ట్రీమవుతున్న అబ్రహాం ఓజ్లర్ అనే మలయాళ సినిమాలో మమ్ముట్టి కూడా ఉన్నాడు… మరి మమ్ముట్టి ఉన్నాడంటే ఆ సినిమా రేంజ్ వేరే ఉంటుంది కదా…
మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిందంటే హిట్టన్నట్టే లెక్క… అయితే ఈ సినిమాలో మమ్ముట్టి ఉన్నాడనేది పేరుకే… తనది ఓ అతిథి పాత్ర… అసలు హీరో జయరామ్… మలయాళంలో పాపులరే… తెలుగు ప్రేక్షకులకూ పరిచితుడే… ఇంత చెప్పుకున్నాం కదా, ఇంకేం, సినిమా బాగానే ఉంటుంది అనుకుంటున్నారా..? ప్చ్… అంత సీన్ లేదు..!
Ads
ఓ సీరియల్ కిల్లర్ పాత్ర… బోలెడు సినిమాల్లో చూశాం కదా… థ్రిల్లర్ అనగానే ఓ సీరియల్ కిల్లర్‌ను చూపించేసి, వరుస హత్యలను చూపించేసి, చివరలో ఫాఫం, వాడికీ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది తెలుసా అన్నట్టుగా ఏదో కథ వండి చూపించేస్తారు… ఆ హత్యలను పరిశోధిస్తూ హీరో చివరాఖరికి కిల్లర్‌ను పట్టేసుకోవడం క్లైమాక్స్…
అయితే ఈ సినిమాలో హీరో మొదట్లోనే తన భార్యాపిల్లలను ఈ సీరియల్ కిల్లర్ వల్ల కోల్పోతాడు… కిల్లర్ ఎవడు, ఎందుకు చంపాడనే పరిశోధన సాగుతుండగానే మరికొన్ని హత్యలు… ఒకే తరహా… అదీ మెడికల్ సర్జరీ టూల్‌తో… సినిమా ఎక్కడ ఆసక్తి కోల్పోయిందీ అంటే… ఫ్లాష్ బ్యాక్ ఇంట్రస్టింగుగా లేకపోవడం… పైగా ఇన్వెస్టిగేషన్ కూడా పెద్ద ఆసక్తికరంగా సాగదు… ఏదో సినిమా తీశాం, జనంలోకి వదిలేశాం అన్నట్టుగా ఉంది…
ఈమధ్య కాస్త పాపులర్ అయిన నటి అనస్వర రాజన్ ఉంది గానీ ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు… ఆమె చేయగలిగేది ఏమీ లేదు… జయరామ్ బాగానే నటిస్తాడు, ఈ పాత్ర తనకు మంచినీళ్లు తాగినంత ఈజీ… మమ్ముట్టి గురించి మళ్లీ మళ్లీ చెప్పుకునే పనేమీ ఉండదు కదా… ఎటొచ్చీ సినిమా మరింత గ్రిప్పింగుగా సాగితే బాగుండు అనిపిస్తుంది… పైగా జనానికి ఈ సీరియల్ కిల్లర్ల థ్రిల్లర్లు చూసీ చూసీ బోర్ వచ్చేసింది… ఇదీ అంతే… బోర్..! మమ్ముట్టి ఉన్నంత మాత్రాన సినిమా బాగుంటుంది అనుకుంటే అదీ ఓ ‘భ్రమ’యుగమే… ఇంతకీ అబ్రహాం ఓజ్లర్ టైటిల్ ఏమిటబ్బా అనిపించిందా..? విశేషం ఏమీ లేదు… అది హీరో పాత్ర పేరు..!!
Share this Article