వైఎస్ షర్మిలను కుటుంబసన్నిహితులు షమ్మీ అని పిలుస్తారు..! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడబడ్డాక తెలిసిన కొత్త విషయం ఇదొక్కటే..!! అంతకుమించి ఆమె కొత్తగా ఏమీ చెప్పలేదు, ఒక్కటంటే ఒక్క కొత్తవిషయాన్ని ఆర్కే ఆమె నోటితో చెప్పించలేకపోయాడు… బహుశా అత్యంత భారీ ప్రచారంతో విడుదలై అట్టర్ ఫ్లాపయిన ఆర్కే సినిమా ఇదేనేమో… ఒక ఇంటర్వ్యూకు, అదేలెండి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకు విస్తృత ప్రచారం జరిగింది… చాలారోజులుగా ఈ ఇంటర్వ్యూలు ఆగిపోయి, మళ్లీ ఇప్పుడు సీజన్-3 పేరిట ఓ కొత్త వెబ్ సీరీస్ తరహాలో ప్రారంభమవుతుండటం, సహజంగానే ఆర్కే ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా సాగుతాయనే పేరుండటం, షర్మిల కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో తిరుగుతుండటం కారణంగా… ఈ ఇంటర్వ్యూ అంటే ఓ ఆసక్తి ఏర్పడింది… వైఎస్ కుటుంబ వ్యతిరేకి రాధాకృష్ణ వైఎస్ బిడ్డ షర్మిలతో ఇంటర్వ్యూ అంటేనే ఆమాత్రం ఇంట్రస్టు ఏర్పడుతుంది కదా… సరే, ఇంటర్వ్యూ అయిపోయింది… రెండు ఫుల్ పేజీల మేరకు ఈ ఇంటర్వ్యూను పబ్లిష్ చేశారు… అసలు అందులో ఏముందని..? అందుకే ఆర్కే ఇంటర్వ్యూ ఎలా ఫ్లాపయిందనేది, ఎందుకు ఫ్లాపయిందనేది కూడా సోషల్ మీడియాకు ఓ వార్తగా మారిపోయింది… (మంత్రి అనిల్ భాషలో చెప్పాలంటే పవన్ కల్యాణ్ సినిమా అన్నట్టుగా ప్రచారం చేసి, సంపూర్ణేష్ సినిమా రిలీజ్ చేశారు…)
నిజంగానే షర్మిలకు జగన్‌తో విభేదాలు ఉన్నాయనీ, అందుకే తెలంగాణలో ఆమె సొంత పార్టీ పెట్టుకుందనీ ఆర్కే నమ్ముతున్నట్టున్నాడు… గతంలో తన వీకెండ్ (weekend, not weakened) కామెంట్లలో కూడా అలాగే చెప్పుకొచ్చాడు, రాసుకొచ్చాడు… ఆమె కూడా ఆ ప్రచారమే కోరుకుంటోంది… (అంత పాత్రికేయ అనుభవమున్న ఆర్కే సైతం ఆమె పార్టీ పుట్టుక వెనుక వ్యూహం ఏమిటో తెలుసుకోలేక, జగన్ ఆంతర్యం అర్థం చేసుకోలేక, ఆమె ఎవరు వదిలిన బాణమో అంతుపట్టక కిందామీదా పడుతున్నాడు… ఇప్పుడు ఆమె పార్టీని విపరీతంగా ప్రమోట్ చేస్తుండటానికి తనకే ఓ సమర్థన లేదు)… జగన్‌తో విభేదాలకూ, కొత్త పార్టీ పుట్టుకకూ లంకె ఏమిటో ఆర్కే ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇప్పించలేకపోయాడు… చాలా ఇష్యూస్ జస్ట్, ఆర్కే అలా ప్రస్తావించి వదిలేశాడు, ఆమె తామరాకు మీద నీటిబొట్టులా అత్యంత లౌక్యంగా తప్పించుకుంది… (Closed Heart With RK)… నిజానికి ఆర్కే ఇంటర్వ్యూలు ఓ చిట్‌చాట్ తరహాలోనే సాగుతూ కీలకాంశాల్ని టచ్ చేస్తుంటాయి… ఇంటర్వ్యూకు ముందే అడగాల్సిన ప్రశ్నలపై కొంత ఎక్సర్‌సైజ్ జరుగుతుంది… తను స్వతహాగా సీనియర్ జర్నలిస్టు కాబట్టి అప్పటికప్పుడు ప్రశ్నలల్లుతూ ఎదుటివారి అంతరంగాన్ని విప్పే ప్రయత్నం చేస్తాడు… నిజంగానే ఆర్కే ఇంటర్వ్యూలు బాగుంటాయి కూడా… (నాన్-పొలిటిషియన్స్ ఇంటర్వ్యూలు అయితే వాళ్ల రంగాలపైనా బేసిక్స్ ముందే చదువుకుని వస్తాడు…)
Ads
ఆమె ప్రసంగాలకు కూడా ఇలాగే ఎక్సర్‌సైజ్ జరుగుతుంది… అలాంటిది ఆర్కే ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో ముందే ఊహించి, ఏం చెప్పాలో చర్చించి, వెల్ ప్లాన్‌డ్‌గా వచ్చింది ఆమె… తను చెప్పాలనుకున్నదే చెప్పింది… ఇంతకుముందు ప్రెస్ మీట్‌లో ఏం చెప్పిందో ఇప్పుడూ అదే చెప్పింది… పలు విషయాల్లో ఆర్కే అసలు ప్రశ్నలు వేశాడు, కానీ అనుబంధ ప్రశ్నలే వేయలేకపోయాడు… ఉదాహరణకు, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యపై…! “సంబంధం లేదు అని సజ్జల మాట్లాడటం బాధనిపించింది… జగన్ పార్టీ కోసం అమ్మా, నేను ఎంతో వర్క్ చేశాం” అని ఆమె చెబుతున్నప్పుడు…! సజ్జల షర్మిలతో సంబంధం లేదని అనలేదు, ఆమె పార్టీకి వైఎస్సార్సీపీకి సంబంధం లేదు అన్నాడు… అందులో తప్పేముంది..? అది వైసీపీ పొలిటికల్ స్టాండ్… బయటకి చెప్పేది ఇదే…!! ఈ ఇష్యూ మాత్రమే కాదు… వైఎస్సార్సీపీ, వైఎస్సార్టీపీ పేర్లలో సామ్యం నుంచి, రెండింటికీ పీకేయే స్ట్రాటజిస్టుగా పనిచేస్తున్న వైనం దాకా… అడగాల్సిన ప్రశ్నలు అన్నీ పైపైన సాగాయి… కొన్ని అసలు జాడేలేకుండా పోయాయి… స్థూలంగా ఆర్కే ఇంటర్వ్యూ ఇంత నిస్సారంగా, చప్పగా, పథ్యం కూడులా ఉండటం మొత్తం తన కెరీర్ ఇంటర్వ్యూలలో ఇదే మొదటిసారి కావచ్చు బహుశా..!!
Share this Article