మోడీ గారు… తమరు సత్యసంధులు… మరి ఇప్పుడు ఎందుకు చెబున్నారు మాస్టారూ… ఎన్‌డీఏలోకి చేర్చుకోవాలని కేసీయార్ బతిమిలాడాడా..? కేటీయార్‌ను సీఎంను చేస్తాను, ఆశీర్వదించండి అని ప్రాధేయపడ్డాడా..? అదీ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో… తమరేమో… ఠాట్, ఇదేమైనా రాజరికమా..? యువరాజుకు పట్టాభిషేకం చేయడానికి అని తిరస్కరించారా..? అబ్బో… తమ పార్టీలో అసలు వారసత్వ ఉదాహరణలే లేనట్టు..!!
సరే, నువ్వు అవినీతికి కఠోర వ్యతిరేకివి సరే… మరి కేసీయార్ అవినీతిని కక్కించడానికి నీకు తెలంగాణలో అధికారం ఇచ్చేదాకా ఎందుకు ఆగాలి..? ముహూర్తం సరిగ్గా దొరకడం లేదా..? ఏం… దేశమంతటా నీ జేబులోని దర్యాప్తు సంస్థల్ని అనేక మంది నాయకులపై ప్రయోగిస్తూనే ఉన్నావుగా… కేసీయార్ ఎందుకు మినహాయింపు..? కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద అప్పట్లో చాలా మాట్లాడారు మీవాళ్లు… మరి ఇప్పుడేమైంది..? ఇప్పుడు కవిత కేసు కూడా నీరుకారిపోవడానికి కారణం ఏమిటి..? ఓహో, అధికారంలోకి వచ్చేదాకా ఆ కుటుంబం జోలికి వెళ్లదలుచుకోలేదా..?
కర్నాటకలో కాంగ్రెస్‌కు డబ్బు ఇచ్చాడు సరే… కానీ అదెప్పుడు..? మరి ఇప్పుడు తమరు జనంలోకి వచ్చి చెబుతున్నారెందుకు..? కేసీయార్ ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఏం ఖర్చు..? చాలామందికి ఇచ్చాడు… అంతెందుకు..? తనను లీడర్‌గా ఎన్నుకుంటే మొత్తం విపక్ష ప్రచార ఖర్చు భరిస్తానని చెప్పినట్టు ఓ ఘన పాత్రికేయుడు కూడా అన్నాడు… అంత డబ్బు పోగుపడి ఉందిక్కడ… అకస్మాత్తుగా ఇప్పుడు బయటపెడుతున్నారు సరే, కానీ నిన్ను ఆపిందెవరు భయ్యా… నువ్వు అధికారంలోనే ఉన్నావు కదా… కేసీయార్ మీద అవ్యక్త కరుణ అంత గోప్యంగా ఎందుకు కురిపిస్తున్నట్టు ఇన్నేళ్లూ..?
Ads
కేసీయార్, బీజేపీ ఇక్కడ తన్నుకుంటాయి గానీ… ఢిల్లీలో ఇద్దరూ ఒకటే అనే విమర్శలకు ఈ శుష్క ప్రసంగాలు ఓ సమాధానమా..? నిజంగా బీఆర్ఎస్‌పై బీజేపీ పోరాటమే నిజమైతే బండి సంజయ్‌కు అకస్మాత్తుగా ఎందుకు అధ్యక్ష పోస్టు నుంచి తరిమేసినట్టు..? ఆ చల్లటి, చప్పటి రోజుల ఆ పాత కిషన్‌రెడ్డే మళ్లీ అధ్యక్షుడు ఎందుకైనట్టు..? ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టే ఎవ్వడూ కొత్తగా పార్టీలోకి రావడం లేదు… ఉన్నవాళ్లే వెళ్లడానికి బిస్తర్ సర్దుకుంటున్నారు… మునుపెన్నడూ లేనంత నిరాశలోకి కేడర్ కూరుకుపోతోంది… నువ్వా తెలంగాణలో అధికారంలోకి వచ్చి, ఆ కేసీయార్ అవినీతిని కక్కించేది..?
కేసీయార్ పోకడల మీద అంత అసహ్యం ఉన్నవాడివి కదా… మరి మొన్నామధ్య మీ పార్టీ జాతీయ కార్యదర్శులను కూడా ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ స్ట్రాటజీలతో బజారుకు లాగుతుంటే కిమ్మనలేదేం..? పార్టీ బేరసారాల మీద దేశమంతా ప్రచారం చేస్తుంటే కౌంటర్ చేయలేదేం..? బీఆర్ఎస్‌లో ఓ షిండే కోసం వెతకడం దేనికి..? ముందుగా తెలంగాణ బీజేపీలోని కోవర్టుల మీద కదా ఉరమాల్సింది… అధికారంలోకి వద్దువు గానీ, ముందుగా విజయశాంతి, ఏనుగు, రాజగోపాలరెడ్డి, వివేకా నీ మీటింగులకు ఎందుకు రాలేదో కారణాలు కనుక్కో… మన బుడ్డ గోచీ ముందుగా సర్దుకుని, ఎదుటోడి బట్టలు విప్పుదువు గానీ… అవునూ, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీల ప్రకటనకు ఇన్నేళ్లు పట్టిందా తమరికి..?!
Share this Article