.
Ashok Pothraj.....
#Maargan ……. హైదరాబాద్ మహానగరంలో వరుస హత్యలు.., పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ (విజయ్ ఆంటోని) అసిస్టెంట్ డీజీపీగా హైదరాబాద్‌లో పనిచేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్ వ్యవహారం పోలీస్ డిపార్ట్మెంట్ సవాల్‌గా మారుతుంది.
ఈ పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్ వెంటాడే బాధ్యతను ధ్రువ్ తీసుకుంటాడు. అరవింద్ (అజయ్ ధిషాన్) యువకుడిని అదుపులోకి తీసుకొని తన టీమ్ (బ్రిగిడా) తో ఇంటరాగేషన్ చేస్తుంటాడు. హత్య తర్వాత వారి డెడ్ బాడీలు నల్లగా మారిపోతుంటాయి.
Ads
ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు వరుస హత్యలు చేస్తున్నారు? మృతుల బాడీ నల్లగా మారడానికి కారణం ఏమిటి? ధ్రువ్ దర్యాప్తు ఎలా సాగింది. ఈ సీరియల్ కిల్లింగ్ వ్యవహారాల వెనుక అసలు కుట్ర ఏమిటి? చివరకు సీరియల్ కిల్లర్‌ను ఎలా గుర్తించాడు? మిస్టరీ క్రైమ్‌ను ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడనే ప్రశ్నలకు సమాధానమే మార్గన్ సినిమా కథ.
మర్డర్ మిస్టరీ కథలు సింపుల్ గా ఒకే రూట్ లో ప్రయాణం చేస్తుంటాయి. మర్డర్, ఇన్వెస్టిగేషన్, క్లూ, ట్విస్ట్, కిల్లర్ రివీల్. కానీ గొప్ప స్క్రీన్‌ప్లేలు ఇదే మూసలో కొత్త దారులకు తెరలేపుతాయి. ‘మార్గన్: ది బ్లాక్ డెవిల్’ కూడా ఇదే మిస్టరీ రూట్‌ను తీసుకుంది.
కానీ మార్గ మధ్యంలో మాత్రం ఓ చోట తన రూట్ మార్చుకుంది. ఓ మర్డర్ మిస్టరీగా మొదలైన కథ, అరవింద్ అనే పాత్ర ద్వారా ఆకస్మాత్తుగా సైకలాజికల్, ఆధ్యాత్మిక కోణాల్లోకి మలుపు తీసుకుంటుంది. నీటికి మనిషికీ మధ్యన ఒక తాత్విక సంకేతాలు ఉంటాయనే కొత్త అంశానికి తెర లేపారు. అందులో ఒక తాబేలు ఎంట్రీ మైండ్ బ్లోయింగ్ అటాచ్ మెంట్…
మనకు ఇక్కడే దర్శకుడి కొత్త ప్రయత్నం చేసాడని అర్థం అవుతుంది. ‘ఎవరు చంపారు?’ అనే ప్రశ్న కాకుండా, ‘ఎందుకు చంపారు?’ అన్న యాంగిల్ ని ఎక్సప్లోర్ చేసారు. ఏదైమైనా ఫస్టాఫ్ వరకు టెన్షన్ ని నిలబెట్టిన కథ, రెండో భాగంలో ఇన్విస్టిగేషన్ తో స్లో అయ్యింది.
అరవింద్ పాత్రకు అనవసరంగా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో కథ పూర్తిగా అతని మీద డిపెండ్ అవుతుంది. ఈ సినిమా నుంచి తెలుసుకోవాల్సిన గొప్ప పాఠం… విలన్ ఎప్పుడు శక్తిమంతుడిగా కనపడతాడంటే… అతని లాజిక్స్, రీజన్స్ బలంగా, మనం నమ్మదగినవిగా ఉంటేనే కథనంలో గ్రిప్ ఉంటుంది అనీ..!
చిక్కుముడులు వేయడం కంటే.. ఆ ముడులను విప్పే విధానం ఒక థ్రిల్లర్ సినిమాకి కీ పాయింట్. ఆ కీ పాయింట్ ను లియో జాన్ పాల్ డీల్ చేసిన విధానం మైనస్ అనే చెప్పాలి. అందువల్ల 100 నిమిషాలపాటు బిల్డ్ చేసిన థ్రిల్ మొత్తం ఆఖరి 20 నిమిషాల్లో నీరుగారిపోయింది. కథలో డెడ్ బాడీల్లాగే నల్లబారింది కథ… కథనం సరిగ్గా రాసుకుని, రీజనింగ్ అనేది ఇంకాస్త బలంగా ఉండుంటే మంచి సినిమాగా నిలిచేది.
“మూడ్ తేలిపోతే మర్డర్ స్కీమ్ వర్క్ అవ్వదు. స్క్రీన్ మీద మర్డర్ జరగడం కాదు, అది మనలో జరగాలి…” ఇక అరవింద్ లవ్ స్టోరీ ఈ కథలో ఓ ప్యాచ్ అనిపిస్తుంది. కొద్దిగా అసంబద్ధంగా అనిపించినా, అతని అసాధారణమైన మెమరీ పవర్, గతాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లా తిప్పే ప్రతిభ, సూక్ష్మదేహం అనేదాన్ని టచ్ చేసిన విధానం ఇవన్నీ రిస్కీ ఎలిమెంట్ కానీ ఇంట్రస్టింగ్ పాయింటే . అయితే ఇవి స్క్రీన్‌ప్లేలో మనం ఎప్పుడెప్పుడో చూసిన “సైన్స్ vs స్పిర్చువల్” డైలమాలా అనిపిస్తాయి.
అవి ఎంతలా అంటే..! ఈ దశలో ప్రేక్షకుడి రీజనింగ్‌ను పరీక్షించే దశకు చేరి, మరి కొన్ని చోట్ల అది కథ మీద నమ్మకాన్ని దెబ్బతీసి, ఎటు నుంచి ఎటు వెళ్తుందా? అనిపించి దిక్కులు చూస్తూ ఉంటాం. స్క్రిప్టులో అతీంద్రియ శక్తులను ప్రవేశపెడితే, ఖచ్చితంగా వాటిపై అపనమ్మకాలని చెప్తూ బ్యాలెన్స్ చేయగలగాలి. అదే లోపించింది. మూడు క్యారెక్టర్స్ పైన ఎఫర్ట్ ని పెట్టి దర్శకుడు కథని సరైన విధంగా చూపించే విధానంలో చేతులు లేపేసాడు.
ఇక విజయ్ ఆంటోని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా చాలా సటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అతడి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అసలు ఇలాంటి లుక్‌లో అతడు ఎందుకు ఉన్నాడా..? అనేది ఫస్టాప్ మొత్తం రివీల్ చేయకుండా సస్పెన్స్‌ను క్యారీ చేసిన విధానం మాత్రమే బాగుంది.
అటు ఎమోషనల్ పరంగా ఈ సినిమాలో తండ్రి- కూతురు, అన్నా- చెల్లి మధ్య వచ్చే సీన్స్ పర్లేదు… సినిమా క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్టులు కూడా పర్లేదు… కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వోకే… నటుల్లో “విజయ్ ఆంటోని” కంటే “అజయ్ దిశాన్” బాగా వర్క్ చేసాడు… నిజానికి ఇది బిచ్చగాడు విజయ్ ఆంటోనీ సినిమా కాదు… అజయ్ దిశాన్ సినిమా… ఫాఫం విజయ్ ఆంటోనీ..!!
అవునూ, ఇంతకీ మార్గాన్ అంటే ఏమిటి..? ఏమో… అనేకానేక పరభాష సినిమాలు ఏవేవో పేర్లతో తెలుగు ప్రేక్షకులకు మెదళ్లకు మేత పెడుతూ… తొక్కలో తెలుగు పేర్లు పెట్టకపోతేనేం అన్నట్టుగా వస్తుంటాయి కదా… ఇదీ అంతే….
Share this Article