అతడు సినిమాలో ఓచోట హీరోయిన్ ‘నేనూ వస్తా’ అంటుంది… దానికి హీరో ‘నేనే వస్తా’ అంటాడు… పైకి సరళంగా అనిపించినా కనెక్టవుతుంది… ఆ సన్నివేశంలో బాగా అమరిన మాటలు అవి… సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో ఓచోట ఓ లేడీ పాత్రధారి ‘మనవరాలు అంటే మన వరాలు’ అని చెబుతుంది… ఒక బామ్మ ప్రేమ వ్యక్తీకరణ అది… సినిమాల్లో సంభాషణలు ఇలాగే ఉండాలి…
కావాలని డైలాగులు రాస్తున్నట్టు గాకుండా… ఆయా సన్నివేశాల్ని ఎలివేట్ చేస్తూనే ఈజీగా కనెక్టయిపోవాలి, ప్రత్యేకించి ఆ సందర్భాల్లో నప్పాలి… పైన చెప్పినవి జస్ట్, ఒకటీరెండు ఉదాహరణలు… లేదంటే… సరిగ్గా పలికేవాడుంటే ‘ఏమంటివి ఏమంటివి’ తరహా దానవీరశూరకర్ణ తరహాలో ఉండాలి… అఖండలో ‘బోత్ ఆర్ నాట్ సేమ్’ తరహాలో ఉన్నా సరే… కానీ పెదకాపు అనే సినిమా వచ్చింది…
అడ్డాల శ్రీకాంత్ కావచ్చు దర్శకుడి పేరు… చాలాచోట్ల డైలాగులు అర్థమయ్యీ గాకుండా ఉన్నయ్… బహుశా ‘చాలా లోతుగా రాశాను’ అనుకున్నాడేమో… కానీ సినిమాలో ఒక సీన్ తరువాత మరో సీన్ వచ్చేస్తూ ఉంటుంది… డైలాగ్ గురించి అర్థం ఆలోచిస్తూ ఉండేంత గ్యాప్ దొరకదు… అందుకని ‘ఎంత లోతు డైలాగులు’ అనేది ముఖ్యం కాదు… ఆ సన్నివేశానికి నప్పిందా..? సరళంగా ఉందా..? జనం వ్యవహారిక భాషలోనే ఉందా..? అనేవే ముఖ్యం… ఈ దర్శకుడు తీసిన పాత సినిమాలు కూడా పలుచోట్ల అస్సలు సమజ్ కావు… పాత్రల కేరక్టరైజేషన్ కూడా అర్థం కాదు… ఐనా ‘దిగ్దర్శకుడే’…
Ads
పైగా సినిమాలో విరాట్ కర్ణ అని హీరో… మరీ మన స్టార్ హీరో టైపులో దంచుడు మార్క్‌తో లాంచింగ్… సరే, మన తెలుగు హీరోలందరికీ ఇదే లాంచింగ్ రోగం కదా… రొటీన్ కథ… అదే పగ, అదే ప్రతీకారం… నటనకు నో స్కోప్… నో బెటర్ ఎమోషన్స్ … గతంలో ఫాఫం, లవ్వు, ఫ్యామిలీ సబ్జెక్టులు తీసేవాడట ఈ దర్శకుడు… మరి ఇప్పుడెందుకో ఈ మాస్ రొటీన్ బాటలోకి వచ్చేశాడు… సేఫ్ అండ్ రిస్క్ లెస్ అనుకున్నాడో… లేక తెలుగు ప్రేక్షకులు ఈ రొటీన్ రొడ్డుకొట్టుడు సినిమాల్ని మాత్రమే ఇష్టపడతారనే నిజాన్ని గ్రహించాడో…
హీరో మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ లేవు… నటన అనే దిశలో మైళ్ల కొద్దీ ప్రయాణించాలి… హీరోయిన్ ప్రగతి అని ఏదో పేరుంది… ఆమె అప్పియరెన్స్ కూడా అలాగే ఉంది… పెద్దగా రిజిష్టర్ గాకుండా..! చిరంజీవి వంటి స్టార్ హీరో చేసినా సరే రొటీన్ మాస్ మసాలా సినిమాల్ని ప్రేక్షకుడు తిరస్కరిస్తున్నాడు… డాన్సులు అనబడే అవే గెంతులు, అవే సూపర్ మ్యాన్ ఫైట్లు, అవే ఫోజులు… మరి ఈ విరాట కర్ణుడు అదే బాటలో తన ప్రయాణం ఎందుకు మొదలుపెట్టినట్టు..? అంతటి పోతినేని రాముడు, గోపీచందుడు కూడా ఎన్ని ఫ్లాపులతో మొహాలు మాడిపోయినా సరే అదే బాటలో నడుస్తున్నారు… వాళ్లను ఆదర్శంగా తీసుకున్నాడా ఈ కర్ణుడు..?
హబ్బ, భలే తీశాడురా ఇక్కడ… అని మనం అనుకునే ఒక్క సన్నివేశమూ లేదు ఈ పెదకాపు సినిమాలో… ఆహా ఓహో అని అనసూయ పాత్ర గురించి గొప్పలు చెప్పారు… అంత సీన్ లేదు, నిజానికి ఆమె పెద్ద తెరకు పనికిరాదు… రకరకాల ఎమోషన్స్ పలికే ఫ్లెక్సిబుల్ మొహం కాదు… కాకపోతే సినిమాలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కాస్త వోకే… అఫ్‌కోర్స్, పాటలు బాగోలేకపోయినా సరే, బీజీఎం వోకే… ఫాఫం, తెలుగు ప్రేక్షకుడు కేవలం వాటికోసం సినిమా చూడలేడు కదా…!!
మంచి మ్యూజిక్, మంచి డాన్సులు, మంచి ఫైట్లు (??) కేవలం సినిమాను సరిగ్గా ప్రజెంట్ చేయగలవు తప్ప అసలు బలాలు కథ, స్క్రీన్ ప్లే మాత్రమే… ప్చ్, పెదకాపు… ఈ కోణంలో చాలా చినకాపు… పైగా రెండో పార్ట్ కూడా ఉందట… ఐనా తెలుగు ప్రేక్షకుల మెదళ్లను పార్టులుపార్టులుగా తింటున్నారు కదా దర్శకులు… ఇదీ అంతే… అన్నట్టు… ఏవో పొలిటికల్, సోషల్ మిక్స్ ఉన్నట్టుంది అని కూడా భ్రమపడాల్సిన పనిలేదు… అంతగా ఏమీ లేదు…!! అవునూ, ఈ దర్శకుడికి అంత పెద్ద పేరు ఎందుకొచ్చిందో తెలియదు గానీ… పెద్ద హీరోలు కూడా చాన్సులిస్తారు కదా… ఈ కొత్త కర్ణుడిని ఆ భీకరమైన మాస్ పాత్రకు ఎలా ఎంపిక చేసుకున్నట్టు..!!
Share this Article