జాంబిరెడ్డి… ఈ సినిమా విషయంలో హీరో, హీరోయిన్ ఎట్సెట్రాలను వదిలిపెట్టండి కాసేపు… దర్శకుడు ప్రశాంత్ వర్మను ఒకందుకు మెచ్చుకోవాలి, మరొకందుకు నిట్టూర్చాలి… 1) ప్రయోగాలు చేయాలనే ఆసక్తి, ఉండటం, కొత్త జానర్లు ట్రై చేయడం, ఆ దిశగా క్రియేటివ్ వర్క్ చేయడం 2) ఈ ప్రయోగాలకు నిర్మాతల్ని ఒప్పించడం 3) తను అనుకున్న ఔట్ పుట్ కోసం మ్యూజిక్, కెమెరా, మేకప్ ఎట్సెట్రా విభాగాలను మంచిగా వాడుకోవడం, వాళ్లను ట్యూన్ చేసుకోవడం…. ఇవి గుడ్… రొటీన్, ఫార్ములా, తొడకొట్టుడు పిచ్చి హీరోయిజాల్ని, వెర్రి పైత్యాల్ని ఇంకా ఎన్నేళ్లు చూస్తాం..? ఎవరో ఒకరు కొత్త జానర్లలో ప్రయోగాలు చేయాలి, కొత్త కథ చెప్పాలి, కొత్త సీన్లు చూపించాలి… ఆ డిఫరెంట్ సినిమా వైపు వర్క్ చేసేవాళ్లను ఎంకరేజ్ చేయాలనేది ఒక పాయింట్… ఇక్కడివరకూ వోకే… అందుకే చాలా సినిమాలు ఈరోజు విడుదలైనా సరే, కాస్త ఆసక్తి ఫోకసైంది ఈ సినిమా ఇందుకోసమే…
ఇంగ్లిషు, ఇతర భాషల్లో జాంబీల సినిమాలు బోలెడొచ్చాయి… మన ఇండియన్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కవు అవి… జాంబీ సినిమాలంటేనే రోత, జుగుప్స మనకు… వేరే భారతీయ భాషల్లో ఒకటీఅరా జాంబీ సినిమాలు, ఒకటీరెండు వెబ్ సీరిస్ వచ్చినా సరే అవి పెద్దగా క్లిక్ కాలేదు… తెలుగులో ఇదే ప్రథమం… దర్శకుడికి డౌటొచ్చినట్టుంది… అందుకే ఈ జాంబీ కథకు కాస్త కామెడీ పులిమాడు… సరిపోదు అనుకుని కాస్త ఫ్యాక్షన్ మసాలా వేశాడు… హారర్; ఫన్ కలపడం మనకు కొత్తేమీ కాదు… ఫ్యాక్షన్ అనగానే ఏ రెడ్డి పేరునో వాడేసుకుని, రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ అనే ముద్ర వేయడం కూడా కొత్తేమీ కాదు… ఈ దర్శకుడూ ఆ పైత్యాన్ని వదిలించుకోలేకపోయాడు… అన్నింటికీ మించి అబ్సర్డిటీ ఏమిటంటే..? కరోనా వైరస్ వేక్సిన్ ప్రయోగం వికటిస్తే జాంబీలు వంటి కేరక్టర్లుగా మారతారా..? ద్యా-వు-డా…
Ads
ఇదే… కథ కొత్తగా ఉండటం కాదు, అది జనానికి కన్విన్సింగుగా ఎక్కాలి, ఇలాంటి కథల్లో లాజిక్కులు ఉండవ్ కానీ, లాజిక్కే సుమా అనిపించేలా ఉండాలి… కథనం కూడా అలాగే సాగాలి… అప్పుడే కామెడీ, అప్పుడే యాక్షన్, అప్పుడే ఫ్యాక్షన్, అప్పుడే గేమింగ్, అప్పుడే వేక్సిన్ రీసెర్చ్… నానా కంగాళీగా తయారైపోయింది… అందుకే వృత్తినిపుణులు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది… వాళ్లను అభినందించి తీరాలి… ఒక దశ వచ్చాక ఇక దీన్ని ఎలా ముగించాలో చివరకు దర్శకుడికీ అంతుపట్టలేదు… చేతులెత్తేశాడు… ఏదో సిల్లీ ముక్తాయింపు… దాన్నలా వదిలేస్తే… బాల్యానికీ, యవ్వనానికీ నడుమ ఒక దశ ఉంటుంది… హీరో అలాగే, ఆ దశలోనే ఉన్నాడు… నాటెటాల్ ఇంప్రెసివ్… ఉన్నంతలో గెటప్ సీను, అన్నపూర్ణమ్మ, ఆనంది కాస్త బెటర్… పిల్లలు, మహిళలు సినిమాలో కొన్ని సీన్స్ చూసి రోతగా, వెగటుగా, జుగుప్సగా ఫీలయితే, దడుసుకుంటే అది దర్శకుడి తప్పేమీ కాదు… ఫాఫం, తను ఎన్నుకున్న జానర్ అలాంటిది మరి… మొన్న ఎక్కడో చెప్పాడు, ఇది క్లిక్కయితే మరో రెండు డిఫరెంట్ జానర్లున్నాయని… మరీ జాంబీ తరహా జానర్ వద్దులే బ్రదరూ… భయానక, బీభత్స వంటి పైశాచిక ప్రధానమైన రసాలు మనకు అంతగా ఎక్కడం కష్టం…!! సినిమా చూసిన రోజు రాత్రి కలలో దర్శకుడు, నిర్మాత, హీరో తదితరులు జాంబీలుగా మారి మన మీద దాడికి వస్తున్నట్టు కనిపించి, దడుసుకుని, హఠాత్తుగా మెలకువ వచ్చే ప్రమాదం కూడా ఉంది…!! అయితే… ఇలాంటివి పిచ్చిపిచ్చిగా ఇష్టపడేవాళ్లు కూడా ఉంటారండోయ్… వాళ్లకు మాత్రం ఈ సినిమా పండుగే..!!
Share this Article