నాని చిన్న హీరోగా ఉన్నప్పుడే నచ్చేవాడు… నేచురల్ యాక్టింగు నుంచి ఇప్పుడు రొటీన్ ఫార్ములా హీరో అయిపోయాడు… తన చుట్టూ పాన్ ఇండియా ఈక్వేషన్స్, డబ్బు లక్షణాలు మాత్రమే కనిపిస్తూ, తనలోని సహజనటుడు కాస్తా ఇప్పుడు సగటు తెలుగు హీరోలా కనిపిస్తున్నాడు… అవే పగలు, అవే ప్రతీకారాల కథలు… చూశాం కదా… వి అనే సినిమా, తరువాత టక్ జగదీష్ ఎట్సెట్రా… వచ్చీపోయే బోలెడు తెలుగు సినిమాల్లోని హీరోల్లాగే నాని కూడా మారిపోయాడు… దసరా సినిమా దానికి మినహాయింపు ఏమీ కాదు…
పుష్ప తీసినప్పుడు అల్లు అర్జున్‌ది ఒకింత సాహసం… పూర్తి రగ్గడ్ వేషధారణ, ఓవైపు భుజం జారిపోయి ఉంటుంది… రఫ్ డ్రెస్… యాస కూడా పర్‌ఫెక్ట్‌గా సాధన చేశాడు… సేమ్, రంగస్థలంలో రాంచరణ్‌ది కూడా ఒకింత ప్రయోగమే… సాదాసీదా డ్రస్సింగ్, సౌండ్ ఇంజనీర్ పాత్ర… పుష్ప ప్రభావం దసరా సినిమాలోని నాని పాత్రపై పడింది… ట్రెండ్ అదే కదా అనుకుని నానికి కూడా రగ్గడ్ వేషం వేశారు… సింగరేణి బ్యాక్ డ్రాప్ తగిలించారు… తెలంగాణ ఆట, పాట, కల్చర్ ఇప్పుడు ట్రెండ్ కదా, అవన్నీ జతచేశారు… అంతే…
కానీ సగటు తెలుగు బిల్డప్పుల కథ మాత్రం అలాగే ఉండిపోయింది… ఈ రొటీన్ కథలో జీవం లేదు, ప్రయోగం లేదు… సవాలక్షసార్లు తెలుగుతెరపై ఆడీ ఆడీ కళతప్పిన కథే… ఇద్దరు స్నేహితులు… ఇందులో నాని తొలిసారి కీర్తిసురేష్‌ను చూడగానే లవ్వులో పడిపోతాడు… కానీ తన దోస్త్ ఆమెను ప్రేమిస్తున్నాడని తెలిసి తన ప్రేమను త్యాగం చేస్తాడు… కానీ దోస్త్ హత్యకు గురవుతాడు… దానికి ప్రతీకారమే దసరా సినిమా కథ…
Ads
ఈ సినిమాలో చెప్పుకోదగింది కీర్తిసురేష్ పాత్ర… ఆమె భలే పోషించింది ఆ పాత్రను… ఎంతైనా మహానటి కదా… వంకలేం పెడతాం…? పాత్ర స్వభావాన్ని పట్టుకుని, తెలంగాణ యాసను సాధన చేసి, డీగ్లామరైజ్డ్‌గా లైవ్‌లీగా కనిపించింది… నిజానికి మహానటి తరువాత ఆమె నటనకు ఛాలెంజ్ విసిరే మంచి పాత్రలేమీ రాలేదు, లేకపోతే ఆమె మెరిట్ తెరపై మరింతగా ఆవిష్కృతమయ్యేది… ఈమధ్య అన్నీ హీరో పక్కన గెంతులేసే తిక్క వేషాలే చేసింది… దసరాలో పాత్ర కాస్త నయం… సో, దసరా సినిమా కీర్తిసురేష్ సినిమా, నాని సినిమా కాదు…
నాని ఏదో కష్టపడ్డాడు గానీ పూర్తి తెలంగాణ వ్యక్తిలా మారలేకపోయాడు… తను ఇలాంటి పాత్రలు చేసినప్పుడు ఆయా పాత్రలకు తగిన డిక్షన్ బాగానే సాధన చేస్తాడు, కానీ దసరా సినిమాకు సంబంధించి సరైన కసరత్తు చేసినట్టు కనిపించలేదు… మిగతా పాత్రలు సోసో… ఓదెల శ్రీకాంత్ కు దర్శకుడిగా ఇది తొలిసినిమా… ఆ అనుభవలేమి అక్కడక్కడా కనిపించింది… ఫస్టాఫ్, స్నేహం, ప్రేమ, త్యాగం అంశాలతో బాగా నెట్టుకొచ్చినా సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ పూర్తిగా సైడ్ ట్రాక్ పట్టేసింది… ఇక వెనక్కి రాలేదు…
నాని దోస్తును హత్య చేయడానికి కారణం బలంగా ఎస్టాబ్లిష్ కాకపోవడంతోనే సినిమా కథ రక్తికట్టలేదు… కేవలం తెలంగాణ, సింగరేణి బ్యాక్ డ్రాప్, తెలంగాణ పాటలు మాత్రమే సినిమాను నిలబెట్టలేవు కదా… ప్రత్యేకించి కథే పాత చింతకాయ పచ్చడి అయినప్పుడు ‘అంచుకు ఎన్ని మురుకులు’ పెట్టుకుని, ఏ మసాలా తొక్కులు కలుపుకుని తిన్నా వేస్టే… ఓ ప్రేమ కథ, ఓ త్యాగం కథ, ఓ ఊరి పాలిటిక్స్ కథ, ఓ హత్య కథ, ఓ ప్రతీకారం కథ… పైపైన చూస్తే వర్కబుల్ ప్లాటే అనిపిస్తుంది… కానీ ప్రజెంటేషన్ ఫెయిల్యూర్‌తో నానికి మరో యావరేజీ మిగిలింది…
Share this Article