……… By…….. Bharadwaja Rangavajhala………… విశ్వనాథ్ కు శంకరాభరణం- బాపుకి ముత్యాలముగ్గు … బాపూగారి ముత్యాలముగ్గు సినిమా ప్రభావం జనం మీద భారీగా ఉండేది ఆ రోజుల్లో. బాపు రమణల జీవితంలో అత్యంత పెద్ద విజయం సాధించిందా సినిమా. భారీగా శతదినోత్సవం కూడా చేశారు. విశ్వనాథ్ జీవితంలో శంకరాభరణం ఎలాగైతే ఓ అద్భుతమైన మైలురాయో .. బాపూ రమణల జీవితానికి ముత్యాలముగ్గు అలాగ. అయితే ఆ తర్వాత ఆ మ్యాజిక్ ఎందుచేతో వర్కౌట్ కాలేదు. విశ్వనాథ్ కు కూడా … శంకరాభరణం తర్వాత పూర్తి సంగీత భరితంగా తీసిన ఏ సినిమా కూడా ఆ స్థాయి విజయం అందించలేకపోయింది. కమల్ తో చేసిన రెండు సినిమాలు సాగర సంగమం, స్వాతిముత్యం ఇతర కారణాల వల్ల హిట్టు అయ్యాయి. సిరివెన్నెల, స్వాతి కిరణం, స్వరాభిషేకం , సూత్రధారులు , మాట దక్కించలేదు … కమల్ చేసిన మూడో సిన్మా శుభ సంకల్పం కూడా పెద్ద హిట్టు కాదు. అలాగే బాపుగారికీనూ …
ముత్యాలముగ్గు సక్సస్ కు ప్రధాన కారణం రావుగోపాల్రావ్ పాత్ర పేలడమే అని ముళ్లపూడి నమ్మారు అని నా అనుమానం. అలా పేలే పాత్ర ఒక్కటి ఉన్నా చాలు సినిమాకి అనుకుని కొన్ని పాత్రలు అద్భుతంగా డిజైన్ చేశారు. కానీ జనం మాత్రం అబ్బే అనేశారు. రాజాధిరాజు లో నూతన్ ప్రసాద్ వేసిన సైతాన్ పాత్ర పేలుతుంది అనుకున్నారు. చాలా గొప్పగా డైలాగులు నడిపారు. అయినా సినిమా తన్నేసింది. అలాగే కృష్ణావతారంలో నేరుగా క్రిష్ట పోషించిన కందుల క్రిష్టావతారం పాత్ర డైలాగులు కూడా చాలా గొప్ప లెవెల్లో రాశారు. ఆ పాత్ర కూడా ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఓపెనింగ్స్ ఇరగదీసి కొన్ని అప్పులు మాత్రం తీర్చింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా తీసిన రాంబంటు చిత్రంలో … కోటా శ్రీనివాసరావు వేసిన గిరీశం పాత్ర కూడా అలా అనుకుని డిజైన్ చేసినదే. అది కూడా ఆడియన్స్ కు అందలేదు. సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా ఫెయిల్ అయి .. రాజేంద్రప్రసాద్ మెడలు విరిచేసింది. సొంత సినిమా తీయాలనే ఆలోచనే మానుకునేలా చేసింది…
Ads
ఇలా ముత్యాలముగ్గు సినిమా వాళ్ల కెరీర్ లోనే ప్రత్యేకం … నిజానికి ఆ సినిమాకు ముందు డబ్బులు పెట్టింది వెంకటగిరి రాజా వారి బిడ్డ. వారి పేరు కుమార్ …అనుకుంటా… అయితే ఆయన మధ్యలో తప్పుకోవడంతో బాధ్యత తామే భుజానేసుకుని అసలా ప్రాజెక్ట్ ముందుకు నడిపించి … నిర్మాతగా తమను ఆ ప్రాజెక్ట్ లో ఇరికించిన ఎమ్వీఎల్ పేరు వేసేశారు. సినిమా పూర్తయ్యాక పెద్ద హిట్ అయ్యిందిగానీ … డబ్బులు మాత్రం ఫైనాన్స్ చేసిన మల్లెమాల ఖాతాకు వెళ్లాయి. ఇప్పుడు ఈ కథలో ఓ పిడకలవేట … ముత్యాలముగ్గు సినిమా విడుదలైన కొత్తలో బాపుగారు ఓ పెళ్లికి వెళ్లారట. భోజనాల దగ్గర ఆయన పక్కన కూర్చున్న కుర్రోడెవరో అన్నమంతా ఆవకాయ కలిపేశాట్ట. బాపుగారి వైపు తిరిగి… కళ్లెట్టుకుచూడు … విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ… మడిసన్నాక కూసింత కళాపోసనుండాల అన్నాట్ట. బాపుగారు ఖంగుతిని గబాగబా భోంచేసి వచ్చేశారట. ఆ తర్వాత భక్త కన్నప్ప, మనవూరిపాండవులు తప్ప రావుగోపాల్రావు కళాపోసన కూడా బాపు రమణలను రక్షించలేకపోయింది పాపం…
Share this Article