మూడునాలుగు రోజులుగా ఈ విషయం గురించి రాయని సైటు లేదు, ఊదరగొట్టని టీవీ చానెల్ లేదు… ఇక యూట్యూబ్ చానెళ్లదయితే అరాచకం… ఒకరిని చూసి మరొకరు… తామేదో వెనకబడిపోతున్నట్టుగా… ఓ వేలంవెర్రిగా రాసేస్తున్నారు… ఏమిటయ్యా అంటే..? ‘‘2020 కరోనాతో దెబ్బతిన్నాం కదా… 2021 మరింత దరిద్రం… కాదు, కాదు, మహాప్రళయమే… అయిపోయింది, ఈ భూగోళం మీద మనిషి ఉనికి ఖతం… సౌర తుఫాన్లు ముంచెత్తబోతున్నయ్… ఆకాశం ఎర్రబారే ఓ మహావినాశనం తప్పదు… ఒక్కడూ మిగలడు… ఒక తోకచుక్క భూమిని ఢీకొట్టబోతోంది… మరిన్ని విపత్తులు, మరిన్ని విలయాలు… ఇక మనిషి జీవితం సమాప్తం’’…….. దాదాపుగా ఇదే సారాంశం అన్నింట్లోనూ… ఏమిట్రా దీనికి ఆధారం అంటే… ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ 400 ఏళ్ల క్రితమే చెప్పాడు అని ఒకరు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడు అని ఇంకొకరు… బల్గేరియా గుడ్డి జ్యోతిష్కురాలు బాబా వంగా చెప్పింది అని మరొకరు గబగబా రాసిపడేస్తున్నారు… మరి నిజం ఏమిటి..? సింపుల్… ఫేక్… చదివి నవ్వుకొండి, అంతే…
వాస్తవానికి వీళ్లేం రాస్తున్నారో వీళ్లకే తెలియదు… సౌరతుపాన్లుని ఒకరు రాస్తే, రష్యా ఏదో జీవాయుధం తయారు చేస్తోంది, ఇక దాని దెబ్బకు మటాష్ అని మరొకరు రాస్తారు, తోకచుక్క ఢీకొంటుందని ఒకరు రాస్తే, ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయి, అణ్వాయుధాలు ప్రయోగించుకుని అస్తమిస్తారని ఇంకొకరు రాస్తారు… ఇవేవీ జరగవు… జరగకూడదని కాదు… ఎగబడి ఎగబడి రాస్తున్న వార్తలేమీ నిజాలు కావు… వాళ్లకే ఓ క్లారిటీ లేదు… అబద్ధాలు, అతిశయోక్తులు రాసినా అతికినట్టు ఉండాలి, ఆ సోయి, ఆ తెలివి కూడా లేదు వీళ్లకు…….. అదుగో స్ట్రెయిన్, ఇదుగో సెకండ్ వేవ్ అని మనల్ని భయపెట్టే ఫార్మా మాఫియా ఎలాగో ఈ రాతలూ అలాగే… వీటిని కాన్స్పిరసీ థియరీలు అంటారు… అంటే… కుట్ర సిద్ధాంతాలు… ఏటేటా ఏవేవో ప్రచారంలోకి తీసుకొస్తుంటారు ఇలాగే… పాశ్చాత్య దేశాల్లో ఈ రాతలు చాలా ఎక్కువ… వాటిని చూసి మనవాళ్లూ స్టార్ట్ చేశారు…
Ads
ఈ తోకచుక్క కథేమిట్రా అనడిగాం అనుకొండి… నిజమే సార్, KF1 2009 అనే గ్రహశకలం 2021లోనే ఢీకొనబోతోంది అంటాడు ఒకాయన… నిజానికి అది భూగోళానికి దగ్గరగా వెళ్తోంది… అంతేతప్ప ఢీకొట్టదు… ఒకవేళ ఢీకొట్టినా ఈ భూగోళం మీద వీళ్లు రాస్తున్న ఉత్పాతాలన్నీ ఏమీ రావు ఒకేసారి… కాకపోతే అది ఢీకొట్టిన ఏరియా ధ్వంసం అవుతుంది… ఇదే నోస్ట్రడామస్ లెస్ ప్రొఫెటీస్ అని జోస్యాలు రాసిన పుస్తకం ఒకటి ఉంది… అందులో తాను మార్మికంగా రాసిన అంశాలకు ఎవరికి తోచిన బాష్యం వాళ్లు చెప్పుకుంటున్నారు… నిజానికి ఆయన రాసిన ఒరిజినల్ ఎన్నో, మధ్యలో వచ్చి చేరినవి ఎన్నో ఎవరికీ తెలియదు… అదుగో అది నిజమైందట, ఇదుగో ఇది ముందే చెప్పాడట బాపతు ప్రచారాలు ఇవన్నీ…
తను ఎక్కడో చెప్పాడట, 2012లో ప్రళయం వస్తుంది అని… ఏమైంది..? కరోనా అనే గత ఏడాది భారీ కుదుపు తప్ప ఇంకేం నష్టం జరిగింది… ఆ జోస్యం ఆధారంగా సినిమాలు తీశారు… జాంబీ అపోకలిప్సి పేరిట… జనం ఒకరినొకరు చంపేసుకుంటారట… హేమిటో పిచ్చి ప్రచారాలు… ఇదే నోస్ట్రడామస్ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని రాశాడట… ఎప్పుడనేది చెప్పలేదు… మరి అది రాకముందే 2021లో మనిషి అంతమైతే ఎలా..? బల్గేరియా బాబా వంగా ఒకవైపు 2130 నాటికి భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించిపోతాయని చెబుతూనే… అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మనుషులు జీవిస్తారనీ, 3005 నాటికి అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుందనీ, 3797 నాటికి మహాప్రళయం వస్తుందనీ, అప్పటికి మనుషులు మరో సౌరవ్యవస్థలోకి వెళ్తారనీ రాసుకొచ్చింది… సో, 2021 మహా వినాశనం నిజం అవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధం రావల్సి ఉందా..? రెండూ ఆయన చెప్పాడనే అంటున్నారు కదా… సో, డోన్ట్ కేర్… నో ఫియర్… ఈ విశ్వం చాలా విపత్తుల్ని చూసింది.., చూస్తుంది కూడా…! ఇలా ప్రతి ఏటా వినవచ్చే రకరకాల కుట్ర సిద్ధాంతాల్ని చదివి నవ్వుకోవడమే…!!
Share this Article