.
( రమణ కొంటికర్ల
) …. బీహార్ రాజకీయాలంటేనే… సినిమాలను తలపించేవి. అంతెందుకు.. చాలా బాలీవుడ్ సినిమాలకు బీహార్ రాజకీయాలు ఓ మాడల్. ముఖ్యంగా క్రైమ్ పిక్చర్స్ లో అలాంటి గూండాయిజం జొప్పించడానికి ఓ ప్రేరణలా నిల్చిన రౌడీ రాజకీయాలు బీహార్ లో బోలెడన్ని.
అలాంటివారిలో మనకు ఠకీమని గుర్చొచ్చే సమకాలీన పేర్లలో మాజీ పార్లమెంటరియన్ షాహబుద్దీన్ ఒకరు. అలాంటి షాహబుద్దీన్ కే ఆయన గురువు. తెలుగులో ప్రభంజనం సృష్టించిన ప్రతిఘటనకూ ఆ క్యారెక్టరే ఇన్సిపిరేషన్.
Ads
1987లో హిందీలో ప్రతిఘాత్ గా కూడా ఎన్. చంద్ర దర్శకత్వంలో అదే సినిమా రీమేక్ అయింది. ప్రతిఘటన సినిమాలో చరణ్ రాజ్ పోషించిన కాళీచరణ్ పాత్రకు.. సదరు షాహబుద్దీన్ గురువే ప్రేరణ. ఆ గురువు మూడు రోజుల క్రితం 2025, ఆగస్ట్ 23న ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనే బీహార్ రాజకీయాల్లో బాహుబలిగా పిల్చుకునే కాళీ పాండే…
షాహబుద్దీన్ ఎందుకు గురువు..?
కాళీప్రసాద్ పాండే 1946, అక్టోబర్ 28న బీహార్ గోపాల్ గంజ్ లోని రాంజితా అనే ఊళ్లో జన్మించాడు. సామాన్యూడి నుంచి బీహార్ లో అత్యంత చర్చనీయాంశమైన రాజకీయ నాయకుల్లో ఒకడిగా ఎదిగాడు. బీహార్ రాజకీయాల్లో తానో బాహుబలిగా ఎదిగాడు. తన ధైర్యం అతడికి ప్రజల్లో రాబిన్ హుడ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
స్వతంత్ర ఎమ్మెల్యేగా అరంగేట్రం!
పాండే రాజకీయ ప్రయాణం 1980లో ప్రారంభమైంది. పార్టీలు, ధన ప్రవాహం శాసిస్తున్న రోజుల్లో… కుచ్యాకోట్ నియోజకవర్గం నుంచి ఓ స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డ్ సృష్టించాడు కాళీప్రసాద్ పాండే. అది ఆయనకున్న ప్రజాదరణెంతో తెలియజెప్పింది. అంతేకాదు, తన తుది శ్వాస వరకూ గోపాల్ గంజ్ జిల్లా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను వెంట ఉంటానని చెబుతూ ఉండేవాడు పాండే. 1980 నుంచి 84 వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేశాడు.
జైలు నుంచే లోక్ సభకు విజయం!
1984లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ వైపు సానుభూతి పవనాలు వీస్తున్న సమయమది. అప్పుడు వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో.. కాళీ పాండే జైలులో ఉన్నాడు. అయితేనేం.. మన మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో.. జైలు నుంచే లోక్‌సభకు పోటీ చేశాడు.
సవాళ్లను ఎదుర్కొని గెలవడమే కాకుండా.. ఆ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోక్ సభకు అత్యధిక మెజార్టీతో విజయం సాధించాడు. ఆ తర్వాత ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జైల్ కా ఫఠక్ టూటేగా.. కాళీ పాండే చూటేగా అనే నినాదంతో ఆయన అనుచరవర్గం కాళీ పాండే ఇమేజ్ ను లార్జర్ దేన్ లైఫ్ అన్నట్టుగా ప్రచారం చేసి విజయం సాధించింది.
ఎన్నో ఎత్తుపల్లాలు!
కాళీప్రసాద్ పాండే స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాక కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ తో జతకట్టాడు. ఆ తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీలో చేరారు. ఎల్జేపీలో కీలక పదవులు నిర్వహించాడు.
చివరకు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుని… 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చివరిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత ఇక క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.
వివాదాలతో సహవాసం!
1989లో పాట్నా జంక్షన్ లో జరిగిన ఓ బాంబు దాడిలో ఆయన చిక్కుకున్నాడు. అయితే, ఆ తర్వాత అది కోర్టులో నిరూపించబడలేదు. రాజకీయంగా ఎన్ని వివాదాలెదుర్కొన్నా కూడా ఆయన ప్రభావం మాత్రం తగ్గలేదు. అందుకే, ఉత్తర భారతంలోని రౌడీ రాజకీయాల్లో రాణించిన ఎందరికో కాళీ పాండే ఓ గురువుగా మారాడు.
టీచర్ వృత్తంటే మమకారం!
తాను రాజకీయాల్లోకి రాకుంటే ఉపాధ్యాయుడినై ఉండేవాడినని కాళీప్రసాద్ పాండే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. రాజకీయాలతో మార్పు తేవడం కంటే కూడా పిల్లలకు విద్యనందించి, ఆ జ్ఞానంతో సమాజాన్ని మార్చడం బావుంటుందనేవాడు. కానీ, విధి కాళీపాండేను రాజకీయాలవైపు నడిపించింది.
షాహబుద్దీన్ కు గురువు!
పొల్టికల్ సైన్స్ లో పీహెచ్డీ పూర్తి చేసి రాజకీయాల్లోకొచ్చి శివాన్ ఎంపీగా గెల్చిన షాహబుద్దీన్… బీహార్ రాజకీయాల్లో పాండే అంత రౌడీ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. నిత్యం వివాదాలు, కేసులతో మోస్ట్ కాంట్రవర్షియల్ ఎంపీగా ఆయన పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి మహ్మద్ షాహబుద్దీన్.. కాళీ పాండేను తన గురువుగా స్వీకరించాడు.
ఎందుకంటే, అచ్చూ పాండే తరహాలోనే షాహబుద్దీన్ రాజకీయ జీవితం మనకు కనిపిస్తుంటుంది. షాహబుద్దీన్ కూడా పాండే తరహాలోనే స్వతంత్ర ఎమ్మెల్యేగా గెల్చి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దాంతో వారిద్దరి మధ్యా అనుబంధం కూడా ఏర్పడింది. దేనికీ వెరవని, భయపడని పాండే వ్యక్తిత్వాన్ని షాహబుద్దీన్ అమితంగా ఇష్టపడతాడు.
గోపాల్ గంజ్ రాబిన్ హుడ్!
1980ల కాలంలో గోపాల్ గంజ్ డయారా ప్రాంతంలో క్రిమినల్ యాక్టివిటీస్ పెచ్చుమీరాయి. ఆ సమయంలో వారికి వ్యతిరేకంగా నిలబడి.. వారి ఆధిపత్యాన్ని తగ్గించడంలో కాళీపాండే కీలకపాత్ర పోషించి.. ఆ ప్రాంతంలో రాబిన్ హుడ్ ఇమేజ్ ను సుస్థిరపర్చుకున్నాడు.
ఎల్జేపీతో అనుబంధం!
2003లో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలో లోక్ జనశక్తి పార్టీలో చేరాడు కాళీపాండే. ఆ తర్వాత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యూపీ పరిశీలకుడిగా నియమితుడైనాడు. సుమారు 17 ఏళ్లపాటు ఎల్జేపీతో కలిసి పనిచేసిన కాళీపాండే.. ఆ తర్వాత మళ్లీ హస్తానికి చేయిచాచి కాంగ్రెస్ లో చేరాడు.
కళ్లు తిప్పుకోనివ్వని కాన్వాయ్!
కాళీప్రసాద్ పాండే వస్తున్నాడంటే మొత్తం అలర్ట్ అయ్యేది. ఆయన పేరు చెబితేనే గజగజా వణికినవారూ ఎందరో. ముఖ్యంగా డజన్లకొద్ది వాహనాలతో… అతడి కాన్వాయ్ చూపు తిప్పుకోనివ్వని అట్టహాసంతో కనిపించేది.
సుమారు 50 మంది ప్రైవేట్ బాడీగార్డులతో ఆయన లుక్కు బీహార్ రాజకీయ దృశ్యంలో ఆయన ఆధిపత్యాన్ని కళ్లకుకట్టేది. అలా బీహార్ రాజకీయాల్లోను, ఉత్తర భారత రాజకీయాల్లోను కాళీపాండే ఓ ఐకానిక్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందాడు….
Share this Article