Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…

August 20, 2022 by M S R

Bharadwaja Rangavajhala………   నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా…… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బరామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు.

చెంచులక్ష్మితో స్టార్ట్ ::  హెచ్ఎమ్వీలో హార్మోనియం ప్లేయర్ గా జీవితం ప్రారంభించారు. 1943లో అంటే 22 ఏళ్ల వయసులో చిన్నయ్య, సాలూరి రాజేశ్వర్రావులతో కలిసి తమిళనాడు టాకీసు వారి చెంచులక్ష్మి సినిమాకు సంగీతం అందించారు. అందులో రెండు పాటలు కంపోజ్ చేసే అవకాశం దక్కింది. ఇక వెనక్కు తిరిగి చూడలేదు.

నేపథ్య సంగీతమే హైలైట్ :: చెంచులక్ష్మిలో టైటిల్స్ పడేటప్పుడు ఆయన విపిపించిన నేపథ్య సంగీతం కూడా బోల్డు పాపులార్టీ సాధించింది. కేవలం ఆ సంగీతమే ప్రత్యేకంగా రికార్టుగా విడుదలై విజయవంతమైంది. బాలరాజు చిత్రానికి గాలి పెంచల నరసింహారావుతో కల్సి సంగీత దర్శకత్వం వహించారు సుబ్బరామన్. అందులో ఓ బాలరాజా అంటూ ఎస్.వరలక్ష్మి ఆలపించిన పాట సుబ్బరామన్ కంపోజ్ చేసిందే.

Ads

లైలామజ్నూకు ప్రాణం :: సుబ్బరామన్ సినీ సంగీత ప్రపంచంలో కాలూనుకుంటున్న వేళల్లోనే ఘంటసాల ప్రవేశం జరిగింది. భానుమతి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన లైలా మజ్నూకు సుబ్బరామనే స్వరకర్త. అందులో పయనమయే ప్రియతమ, నను మరచిపోకుమా… అనే ఓ విషాదగీతాన్ని ఘంటసాలతో పాడించారు. పాటలోని భావాన్ని ప్రేక్షకుల హృదయాలకు గురి పెట్టే గాయకుడుగా ఘంటసాలకు ఆ పాట చాలా పాపులార్టీ తెచ్చింది.

సముద్రాల ప్రోత్సాహం :: తెలుగు సినిమాలకు సంబంధించి సుబ్బరామన్ కు చాలా ప్రోత్సాహాన్ని అందించారు సముద్రాల రాఘవాచార్య. ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి భరణీ నుంచి బయటకు వచ్చిన డి.ఎల్.నారాయణ, సముద్రాల, డైరక్టర్ వేదాంతం రాఘవయ్యలతో కల్సి దేవదాసు చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

భానుమతి అభిమానం :: సుబ్బరామన్ సంగీతాన్ని విపరీతంగా ఇష్టపడ్డ వారిలో భానుమతి ఒకరు. తను స్వయంగా సంగీతజ్ఞురాలు కావడంతో సుబ్బరామన్ సంగీతంలోని గొప్పతనాన్ని అర్ధం చేసుకున్నారు భానుమతి. తను దర్శకత్వం వహించిన చండీరాణికి కూడా సుబ్బరామన్నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే ఎమ్ఎస్ విశ్వనాథన్ కంప్లీట్ చేశారు. అందులో ఘంటసాల, భానుమతి పాడిన ఓ తారకా పాట ఇప్పుడు విన్నా కొత్తగానే అనిపిస్తుంది. అది ఎమ్మెస్వీ చేసిన పాటే.

కొత్తవాళ్లకు ప్రోత్సాహం :: రావు బాలసరస్వతి, పిఠాపురం నాగేశ్వరరావు లాంటి అప్పటి యువ గాయనీ గాయకులను ప్రోత్సహించారు సుబ్బరామన్. అంతే కాదు తన దగ్గర ఖాళీ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఓ వాయిద్యకారుడు వస్తే అతన్ని నిరుత్సాహపరిచేవారు కాదు. అలా ఎందరికో సినిమా మార్గంలో జీవనయానానికి అవసరమైన ఆదరువు చూపించారు సుబ్బరామన్.

దేవదాసు స్వరకర్త :: భరణీ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చిన డి.ఎల్, వేదాంతం, సముద్రాలతో కల్సి చేపట్టిన దేవదాసు ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు సుబ్బరామన్. నిజానికి అప్పటికే ఆయన నలభై చిత్రాలకు మ్యూజిక్ కంపోజరు. చండీరాణికి సంగీతం అందిస్తున్న సందర్భంలోనే దేవదాసు ఐడియా ప్రారంభమైంది. దేవదాసులో జగమేమాయ తప్ప దాదాపు అన్ని పాటలకూ సుబ్బరామనే స్వరాలు అందించారు.

అర్ధంతరంగా మరణం :: దేవదాసు చిత్రం పూర్తి చేయకుండానే సుబ్బరామన్ కు నూరేళ్లూ నిండాయి. అప్పటికి ఆయన వయసు ముప్పై ఒక్కటి. చిన్నప్పట్నించి ఉన్న ఫిట్స్ రోగమే ఆయన్ను తీసుకెళ్లిపోయింది అంటారు. కాదు హత్యే అనేవాళ్లూ లేకపోలేదు. అప్పటికి ఆయన చండీరాణి, దేవదాసు, బ్రతుకు తెరువు చిత్రాలు చేస్తున్నారు. వీటిలో మొదటి రెండు చిత్రాల బాధ్యత సుబ్బరామన్ శిష్యుడు ఎమ్.ఎస్.విశ్వనాథన్ వహించారు. బ్రతుకు తెరువు మాత్రం ఘంటసాల పూర్తి చేశారు.

ఘంటసాలతో గొడవలు :: దేవదాసు సమయంలో ఘంటసాలకూ సుబ్బరామన్ కూ ఏవో విబేదాలొచ్చాయట. దీంతో వేరే గాయకుడితో ప్రయత్నించారు కూడా. భావం పలకకపోవడంతో మళ్లీ ఘంటసాలతోనే కంటిన్యూ అయ్యారు. సుబ్బరామన్ అంటే ఘంటసాలకు చాలా గౌరవం. తాను స్వయంగా అప్పటికే సంగీత దర్శకుడుగా పాపులర్ అయి ఉండీ, కావాలని సుబ్బరామన్ దగ్గర అసిస్టెంటుగా పనిచేశారు.

గురుభక్తి :: సుబ్బరామన్ మీదున్న ప్రత్యేక అభిమానంతోనే ఆయన ప్రారంభించిన బ్రతుకు తెరువులో తను చేసిన కంపోజిషన్స్ కూ సుబ్బరామన్ పేరే వేయమన్నారు ఘంటసాల. దేవదాసులో సుబ్బరామన్ వదిలేసిన రెండు పాటల్లో ఒకటి జగమేమాయ. రెండోది ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా అనే క్షేత్రయ్య పదం. ఈ రెండింటినీ విశ్వనాథన్, రామ్మూర్తిల ద్వయం కంప్లీట్ చేసేసింది. అయితే వారిద్దరూ ఎక్కడా ఆ విషయం ప్రత్యేకంగా చెప్పుకోకపోవడం గురువు మీద వారికున్న భక్తికి నిదర్శనం.

శంకర్ ఆయన తమ్ముడే :: సుబ్బరామన్ జీవించింది చాలా తక్కువ సంవత్సరాలే. అంతా కలిపి ముప్పై రెండేళ్ల జీవితంలో ఆయన చేసిన కృషి మాత్రం అసామాన్యం. తమిళనాట పాపులర్ అయిన శంకర్ గణేష్ సంగీత ధ్వయంలో శంకర్ స్వయానా సుబ్బరామన్ తమ్ముడే. సంగీత దర్శకుడుగా బిజీగా ఉంటూనే చిత్రనిర్మాణంలోకి దిగిన సుబ్బరామన్ ను ఆయన భాగస్వాములే విషప్రయోగం చేయించి చంపించేశారనే అనుమానం ఇండస్ట్రీలో వినిపించేది.

చంపించింది ఓ మహిళేనా :: సుబ్బరామన్ తో వివాహేతర సంబంధం ఉన్న ఓ మహిళకు కూడా ఈ హత్యలో భాగం ఉందనేది సుబ్బరామన్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ల కథనం. ఏది ఏమైనా సంగీత దర్శకుడుగా సుబ్బరామన్ దక్షిణాది సినీ సంగీతం మీద వేసిన ముద్ర మాత్రం అసామాన్యం. సుబ్బరామన్ … ఎమ్మెల్ వసంత కుమారితో కలిసి పాడిన పాటొకటి ఉంది. పాపులలో పెనుపాపి అంటూ సముద్రాల సీనియర్ రాసిన గీతం అది. కృష్ణన్ డైరక్ట్ చేసిన పెళ్లి కూతురు చిత్రంలో గీతం అది. వినండి … దొరికితే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions