తెలుగు సాహిత్యంలో సినిమాలకు కావలసినంత బోలెడంత కంటెంట్ ఉంది. కానీ, తెలుగు సాహిత్యానికి పట్టిన దరిద్రం ఏమిటంటే, సాహిత్యాన్ని చదివే నాథుడే లేడు. ముఖ్యంగా యువత తెలుగు సాహిత్యాన్ని చదవడం లేదు. అందుకే, తెలుగులో సాహిత్య పత్రికలు అన్నీ మూతపడ్డాయి. ఒక్క స్వాతి వారపత్రిక, మాస పత్రికలు మినహా మరే పాపులర్ పత్రిక నడవడం లేదు.
అదే ఇతర భాషల్లో ఆయా భాషల సాహిత్యం దినదిన ప్రవర్థమానమవుతుంది. చాలా కొత్త పత్రికలు పుట్టుకొస్తున్నాయి.
మన తెలుగు సినిమా వాళ్ళకు నవలలు, కథలు చదివే తీరిక ఎక్కడుంది? ఇప్పుడు తెలుగు సినిమాకు కథలు అవసరం లేదు. తెలుగు సినిమా ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెంది, సినిమా అంటే పాన్ ఇండియా అనే అర్థం వచ్చేలా తయారయ్యింది. అసలు మామూలు కథలే ఉండడం లేదు. పగ, ప్రతీకారం, ప్రేమలు తప్ప వేరే కథాంశాలతో సినిమాలే రావడం లేదు. తెలుగు సినిమా అంటే రక్తపాతాలు, యుద్ధాలు, దయ్యాలు, భూతాల సినిమాలే. ఏ సినిమాలోనయినా హీరోను దైవాంశసంభూతుడిగా చూపించడమే తమ భాగ్యంగా భావిస్తుంటారు, దర్శకులు, నిర్మాతలు.
Ads
అసలు తెలుగు సాహిత్యానికి, సినిమా రంగానికి సంబంధమే లేదు. ఇప్పటి తెలుగు దర్శకులకు సాంకేతిక నైపుణ్యం ఉందేమో కానీ, ఘనమైన మన తెలుగు సాహిత్యం పట్ల అవగాహన లేదు. పాటలు రాసే వాళ్ళే మహాపండితులనుకుంటున్నారు. వాళ్ళు పాటల వరకే పండితులు. మిగిలిన సాహిత్యం గురించి వారికేం అవగాహన ఉంటుంది?
టాలీవుడ్డులో, చారిత్రాత్మక సినిమాలని తీసి, చరిత్రను వక్రీకరిస్తున్నారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజులు కలిసి బ్రిటిషు వారిపై పోరాటం సాగించినట్టు కథలు అల్లుతారు. పౌరాణిక సినిమాలను ఇష్టమొచ్చినట్టు తీసి పారేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ సద్విమర్శలను స్వీకరించే స్థితిలో కూడా లేదు. పెయిడ్ అభిమానులతో, వెబ్ సైట్లతో తిట్టిస్తున్నారు. విమర్శకుల క్యారెక్టరు మీద దండెత్తుతున్నారు.
ఇటు వందల కోట్లు పెట్టి అభూత కల్పనలతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ తో, ఐటెం పాటలతో పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే, మరొక పక్క యూట్యూబులో రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ తీసిన యువతీయువకులు, నాసిరకం సినిమాలు తీసి వదులుతున్నారు.
ఈ ధోరణి మంచిది కాదు. తెలుగు ప్రజల సంస్కృతిని, తరతరాల విశ్వాసాలను, కొన్ని ప్రాంతాలను పగలు, ప్రతీకారాలకు నిలయంగా, చూపిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణా యాస, బాస, వేషం, బోనం, బతుకమ్మ ఇప్పుడు సినిమా కమాడిటీలు అయిపోయాయి.
అందుకే, ఏదైనా మంచి సంఘటనో, సన్నివేశమో నవలల్లో కనిపిస్తే కొట్టేయడమే కథకుల పని! రాసిన వాడికి కనీసం ధన్యవాదాలు చెప్పే సంస్కృతి కూడా లేదు మన వాళ్ళకు.
శరత్చంద్ర గారు రాసిన నవలను, ఉన్నది ఉన్నట్టుగా కాపీ కొట్టి తీసిన ‘శ్రీమంతుడు’ ఉదంతం అందరికీ తెలిసిందే కదా? హైకోర్టులో లెంపలేసుకుని తప్పు ఒప్పుకున్నాడు కదా డైరెక్టర్. ఈ కేసులో సుప్రీం కోర్టు కూడా క్రింది కోర్టుల తీర్పునే సమర్థించింది. హృతిక్ రోషన్ తో హిందీలో ఈ సినిమాను తీయాలనుకున్నారు. శరత్ చంద్ర గారు హృతిక్ రోషన్ ను ప్రతివాదిగా చేర్చారని కూడా ఒక వార్త వచ్చింది.
ఇక్కడ, మలయాళం, తమిళ హీరోలకు మొక్కాల్సిందే. వాళ్ళు కథలు వింటారు. నూతనత్వాన్ని ఆహ్వానిస్తారు. ఆ సినిమా పరిశ్రమల్లోని అన్ని విభాగాలు, ఆ వినూత్నమైన సినిమాను, గౌరవిస్తారు. కళ్ళకు అద్దుకుంటారు. పరమ పవిత్రంగా ఆ సినిమాను ప్రమోట్ చేసి విజయం సాధిస్తారు. ‘ఆడు జీవితం’ సినిమా కమర్షియల్ గా విజయం కాకపోవచ్చు. కానీ, ఆ సినిమా ఒక క్లాసిక్. ప్రపంచంలోని ఏ నటుడూ చేయడానికి సాహసించని పాత్రను పోషించారు పృథ్వీరాజ్ గారు.
వాళ్ళు ఫలితాన్ని ఆలోచించి నటించరు. నటించిన తర్వాత ఫలితాన్ని రాబట్టుకుంటారు.
ఏ పైరవీలు జరగకుండా ఉంటే, అట్లాంటి అవకాశం ఉంటే, వచ్చే పది సంవత్సరాలకు ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ గారినే ప్రకటించాలి.
అటువంటి సినిమా ఎప్పుడో ఒకసారి రాదు. లార్జర్ దేన్ లైఫ్ వంటి సజీవచిత్రణ చేయాలంటే, కొంత నిడివి అవసరం. ఆ సినిమా చూడడం ఒక వరం. ఈ సినిమా మన పాన్ ఇండియా సినిమాల వంటి అభూత కల్పనలతో తీసిన సినిమా కాదు. ఒక యథార్థ సంఘటన. గుండెను రంపపు ముళ్ళతో కోసినట్టుండే విషాదభరిత సినిమా.
మన తెలుగు దర్శకులు కూడా ఇంతే గొప్పగా సినిమాలు తీయగలరు. మన దర్శకులు సాంకేతికంగా చాలా పరిణితి చెందారు. కానీ, వారి perspective లో సినిమా నిర్వచనం వేరు. వాళ్ళు అటువంటి సినిమాలే తీస్తూనే, కొన్ని మంచి సినిమాలకు చేయూతనివ్వవచ్చు. పృథ్వీరాజ్, సూర్యా ఇటువంటి సినిమాలను ప్రోత్సహిస్తున్నారు.
ఇక మలయాళం నటులు ఈ మధ్య వయసుకు తగ్గ పాత్రలు వేస్తున్నారు. మన వాళ్ళు వయసును తగ్గించుకున్నట్టుగా మేకప్పులు వేసుకుని పిచ్చి పాటలకు గంతులు వేస్తుంటారు.
మన సినిమాలు వేల కోట్లు సంపాదిస్తుండవచ్చు. కానీ, అవేవీ మన ప్రేక్షకులకు ఏ మేరకు తృప్తిని ఇస్తున్నాయో ఆలోచించాలి. మనకు ఒక ‘బలగం’ ఇచ్చిన మానసిక తృప్తిని మిగతా సినిమాలు ఇచ్చాయా? గుండెల మీద చేయి వేసుకుని, మీకు మీరే నిజం చెప్పుకోండి……. [ By ప్రభాకర్ జైనీ ]
Share this Article