Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన సినిమాలకు నవలలే కావాలా ఏం..? ఆంగ్ల సినిమాల అడాప్షన్ లేదా…!!

July 31, 2024 by M S R

తెలుగులో వచ్చిన చాలా విజయవంతమైన సినిమాలకు … మన పురాణాలో, మన భాషలో వచ్చిన నవలలో లేక మరో భాషలో వచ్చిన నవలలో .. అలాగే మరో భాషలో వచ్చిన హిట్ చిత్రాలో ప్రేరణ. ఆ మరో భాషలో వచ్చిన చిత్రాలకు అక్కడి సాహిత్యంలోనే ప్రేరణ కనిపిస్తుంది. అది వేరు సంగతి .

బాపు రమణలు తీసిన సాక్షికి కూడా ఓ హాలీవుడ్ కౌబాయ్ సినిమా ప్రేరణ … ప్రధానంగా పురాణాలు , తెలుగు నవలలు ఎందుకు తీసుకునేవారంటే … ప్రూవ్డ్ సబ్జక్టులనే నమ్మకంతోనే ….! రీమేక్ సినిమాలకు వెళ్లడానికీ కారణం ప్రూవ్డ్ సబ్జక్టులనే …!

నాకు తెల్సి … తొలి దశలో పౌరాణిక నాటకాలను … యధాతధంగా తీసేవారు. కారణం .. ప్రూవ్డ్ సబ్జక్టులనే …! ఈ పౌరాణిక చిత్రాల సమయంలోనే … జానపదాలు తదితరాలు తీయాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీషు నవలలను, నాటకాలను అడాప్ట్ చేయడం ప్రారంభించారు. కార్సికన్ బ్రదర్స్ అనే నవల ఎన్టీవోడితో విఠలాచార్య సినిమా తీశాడు కదా అగ్గిపిడుగు అని … అందుకూ కారణం ప్రూవ్డ్ సబ్జక్టులనే …!

Ads

మన నమ్మకాలైన స్వర్గ నరకాల మీద తెలుగులోనూ, బెంగాలీలోనూ వచ్చిన యమగోల, జీవాంత మానుష లాంటి సినిమాలకూ ఆంగ్ల చిత్రాలే కదా ప్రేరణ. డెత్ టేక్స్ ఎ హాలీడే అనే వింగ్లీషు సినిమా నుంచే కదా … ఇయన్నీ పుట్టినది. దేవాంతకుడు, యమగోల, యముడికి మొగుడు, యమలీల సినిమాలు సక్సస్ కావడంతో యముడి పాత్ర పెడితే సినిమా హిట్ అనే సెంటిమెంటు కూడా బయల్దేరిందిగా మన దగ్గర.

ఆత్రేయ లాంటోళ్లు కాలెట్టే వరకు షేక్స్ పియర్ తదాదిగా గల వింగలీసు రచయితలే తెలుగు సినిమాలకూ రచయితలు. కె.వి.రెడ్డి గారు ఎక్కువగా ఇంగ్లీష్ నవలలు, నాటకాల నుంచీ ప్రేరణ పొంది తను తీసిన సాంఘికాలకు రూపకల్పన చేసుకునేవారనడానికి ఆధారాలున్నాయి.

నరసరాజు గారు సినిమాల కోసం రాసిన చాలా కథలకు అంగ్రేజీ నవల్లల ప్రేరణ ఉన్నట్టు ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. వాటిని నేటివిటీకి తీసుకురావడానికి పడే తిప్పలే ఇంట్రస్టుగా ఉంటాయి. ఒక్కోసారి అక్కడే బెడిసి సినిమాలు దెబ్బతిన్నట్టు కూడా మనం తెల్సుకోవచ్చు …

యండమూరి వీరేంద్రనాథ్ చెంగల్వపూదండ నవలకీ .. చిరంజీవి వేట సినిమాకీ దగ్గర పోలికలు ఉంటాయి. అయితే ఈ రెండూ కూడా ఒకే వింగిలీసు పుస్తకం నుంచీ ఇన్స్ పైర్ అయి రాసుకున్న కథలే. అడాప్షన్ లో యండమూరి తొక్కిన దారి సూపర్ హిట్ అవగా పరుచూరి వారు తొక్కిన తోవ కాటేసింది.

ఆరెకపూడి కోడూరి కౌసల్యాదేవైనా, యద్దనపూడి సులోచనారాణి అయినా మాదిరెడ్డి సులోచన అయినా కె.కామేశ్వరి అయినా కె.రామలక్ష్మి అయినా ఆ తర్వాత రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్ అయినా మల్లాది వెంకట కృష్ణమూర్తి అయినా కొమ్మనాపల్లి గణపతిరావు అయినా ఆళ్ల నవల్లు పాపులర్ కాబట్టి … సినిమాలుగా తీసి … అవి సినిమాలుగా ఎట్టా ఉంటాయనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో కలుగచేయడం ద్వారా ఆళ్లని థియేటర్లకి రప్పిచ్చి … ఆ ఎనుక మంచి పాటలు పెట్టి కూకోబెట్టి భారీ హిట్టు కొట్టొచ్చనేది స్కీము కదా .

డిటెక్టివ్ నవలలు కూడా సినిమాలుగా వచ్చిన సందర్భాలున్నాయి కదా … రీమేక్ సినిమాలు తీసే నిర్మాతలు కూడా సేఫ్ మార్గమనే ఆ దారిలో వెడతారు. వీరమాచినేని మధుసూదనరావు గారు విక్లరీ మధుసూదనరావుగా మారడం వెనుక రీమేకుల పాత్ర ఉందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ప్రూవ్డ్ సబ్జక్టులతో పోదామనే తపనే గానీ మరోటి కాదు .. నిర్మాతకు నాలుగు డబ్బులు చేసి పెడితేనే కదా తనూ, పరిశ్రమా బ్రతికేది అనే తాపత్రయమే ఆయనతో ఆ పని చేయించి ఉండవచ్చును కూడా . 99 శాతం రీమేకులే చేసారాయన.

అదే విక్టరీని ఇంటి పేరుగా పెట్టుకున్న వెంకటేశ్ హిట్స్ లో అధికశాతం రీమేకులే కదా పాపం. దీని వల్లా ఏం తెల్సింది ? విక్టరీ అనగా రీమేక్ అని తెల్సిందా లేదా?

ఇప్పుడు పరిస్థితి ఎలా దాపురించింది అంటే… రీమేక్ చేయలేని స్థితి. మార్కెట్ అనుమతించని స్థితి. తెలుగు సినిమాల్లో
తెలుగు కథలు లేవు అనొద్దు … ఇంగ్లీసు కథలకి తెలుగుపూత పూయడంలోనే మరి మన తెలుగు రచయితల తెలుగు తేటలు కనిపిస్తాయి.

ముళ్లపూడి రమణ గారు చెప్పే వరకు సాక్షికి ఓ ఇంగ్లీసు సినిమా ఇన్సిపిరేసనంటే మనకు తెల్సిందా? అదేదో మన గోదారొడ్డున నిజంగానే జరిగిన కథే అని కదా మనం అనుకుందీ … ఇలా కాకుండా కూడా తెలుగు కథలతో వచ్చిన సినిమాలూ విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. చక్కటి అడాప్షన్లూ కనిపిస్తాయి.

మల్లీశ్వరి సినిమాను ఎంతో హాయిగా ఎంతో ఆహ్లాదంగా సీతామాలక్ష్మిగా తీసి రక్తి కట్టించారుగా నిర్మాత మురారి దర్శకుడు విశ్వనాథులు. దుక్కిపాటి వారి ఇన్సిపిరేషన్ కావచ్చు … మురారి గారి సినిమాలకు కథలు సమకూర్చుకునే పద్దతి బాగుండేది. అలాగే విశ్వనాథ్ తన సినిమాలకు కథలు సమకూర్చుకునే పద్దతి కూడా బావుంటుంది.

ఈ మధ్య ఓ సినిమా మిత్రుడితో మాట్లాడుతూండగా … నాకో రహస్యం తెలిసింది. ఎవరు చెప్పారో నేను చెప్పను గానీ .. విశ్వనాథ్ సినిమాల కథల విషయంలో వారి శ్రీమతి గారి జోక్యం ఉండేదట … అంటే కల్పించుకుని చెప్పేవారు కాదట ఆవిడ . ఆవిడ బాగా చదువరి అనిన్నీ వారి అడ్వైజులు మాస్టారి సినిమాలకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పారు … వారిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని కూడా ఆ మిత్రుడే చెప్పాడు. విశ్వనాథ్ గారు ఆవిడ జ్ఞానానికి తగిన గౌరవం ఇస్తారని కూడా జోడించాడనుకోండి …

ఆయన సినిమాల్లోనూ బోల్డు అడాప్షన్స్ కనిపిస్తాయి. సాగరసంగమం చూస్తుంటే సిటీలైల్స్ , కాగజ్ కా పూల్ తదితర చిత్రాలు గుర్తొస్తాయేమో అని నా అనుమానం … ఒకే ఇంగ్లీసు సినిమా నుంచో లేక నవల నుంచో ప్రేరణ పొంది తయారైన సినిమాలు ఒకే టైమ్ లో విడుదలై ఫ్లాపవడం కూడా మనం చూడొచ్చు … యండమూరి సంపూర్ణ ప్రేమాయణం ప్రధాన పాయింటుకు చాలా దగ్గరగా ముళ్లపూడి బాపుల బుల్లెట్టు నడుస్తుంది. రెండూ తన్నేశాయనుకోండి పాపం పాపం … కానీ ఒకటి మాత్రం నిజం సినిమా కథ ప్రూవ్డ్ అనే ధైర్యం ఒక్కటే చాలదు. ఆ ప్రూవ్డ్ సబ్జక్టును జీర్ణం చేసుకుని తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలోనే రచయితల దర్శకుల టాలెంటు ఉంది.

ఈ విషయంలో చాలా జాగ్రత్తగా స్క్రిప్టు మీద చాలా కసరత్తులు చేసే నిర్మాతగా మాత్రం దుక్కిపాటి వారు గొప్పోరు. ఆ ట్రెడిషన్ లో నడిచిన వారే కదా అధికులు. ప్రపంచ సినిమా చరిత్రలోనే నవలల ఆదారంగా వచ్చిన సినిమాల సంఖ్య కాస్త అధికమే కావచ్చు …. నా ఉద్దేశ్యం హాలీవుడ్ సినిమాలకూ ప్రేరణగా నిలిచిన నవలల సంఖ్య తక్కువేం కాదని … అంటే అక్కడా ప్రూవ్డ్ సబ్జక్టు అనేదే కదా కాన్సెప్టు …

నా ఊహకి తెలుగులో వచ్చిన మొదటి నవలా చిత్రం బారిష్టర్ పార్వతీశంగానే చెప్పుకోవాలేమో. ఆ తర్వాత దేవదాసు కూడా నవలా చిత్రమే కదా … ఆ మాటకొస్తే … బాటసారీ ఇవన్నీ కూడా అంతే కదా … ఇక్కడ టాపిక్ నవలా చిత్రాలు కాదండి .. ప్రూవ్డ్ సబ్జక్టులదే …

ఈ సబ్జక్టుల తయారీలో … దుక్కిపాటి మధుసూదనరావు గారు ఇండస్ట్రీకి చేసిన కంట్రిబ్యూషన్ మామూలుది కాదు. ఆయన దర్శకత్వం చేయలేదు గానీ … తక్కిన అన్నీ చేశారు. తెలుగులో సాంఘిక చిత్రాలు ఎల్లా తీయాలో ఓ మోడల్ తీర్చిదిద్దిన వాళ్లల్లో ఆయనొకరు. ఆయన సినిమాలకే కాదు … అక్కినేని సినిమా నిర్మాతలందరికీ .. ఆయనే అడ్వయిజరు అన్నారు మురారిగారు. ఏ తరహా కథ తీసుకుంటే బెటరు … ఏ డైరక్టర్ తో సినిమా చేస్తే బెటరు లాంటి అంశాలన్నీ ఆయా నిర్మాతలకు సలహాలు ఇచ్చేవారట ఆయన. నిజానికి దుక్కిపాటి మధుసూదనరావు కంట్రిబ్యూషన్ మీద ఎవరేనా సమగ్రంగా ఓ పుస్తకం రాయవచ్చును కదా అనిపించింది …

ఎన్ని మాట్లాడుకున్నా … సినిమా అనేది డబ్బులు పెట్టి డబ్బులు ఆశించే కళే కదండీ … అందుకని కాస్త ముందూ వెనుకా చూసుకోని పోవాల కదా .. దుక్కిపాటి వారికే మూడో సినిమాకు గానీ ధైర్యం చిక్కలేదు … సొంతగా నలుగురు రైటర్లను కూర్చోబెట్టి కథ అల్లాలని … ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక ……. [ Bharadwaja Rangavajhala ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions