Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రండి… మనసారా ఏడవండి… నాణ్యమైన కన్నీటికి మాదీ గ్యారంటీ…

May 30, 2023 by M S R

Keep Crying:
“ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న
కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె,
ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న?
అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?”
-ఆత్రేయ పద్యం

తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఆత్రేయ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా…ఆ ముక్కలు కూడా విడివిడిగా లెక్కలేని రూపాలుగా ఏడవాలంటాడు. గుండె ఏడ్చి ఏడ్చి కన్నీరు మున్నీరై పొంగిపోవాలంటాడు. తలచుకుని తలచుకుని ఏడవాలంటాడు. ఏమీ తోచక ఏడవాలంటాడు. ఉన్నది పోయినందుకు ఏడవాలంటాడు. లేనిది కోరి, దొరకక ఏడవాలంటాడు. మనసిచ్చి ఏడవాలంటాడు. మనసు శూన్యమై ఏడవాలంటాడు. మనసున్న మనిషికి సుఖముండదు కాబట్టి ఏడుస్తూనే ఉండాలని తీర్మానించాడు. ఏడుపులో ఆనందాన్ని వెతుక్కుని ఏడ్చి ఏడ్చి మొహం కడుక్కోమన్నాడు. ఆత్రేయ రచనలు అర్థమై రెండు తరాలు ఏడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఆత్రేయను చంపి పుట్టినవారే కాబట్టి అర్థం కాక…లేక ఎక్కడ అర్థమవుతుందోనని భయపడి ఏడుస్తూ ఉంటాం. అది వేరే విషయం.

Ads

ఏడుపు జీవ లక్షణమని ఆత్రేయ సిద్ధాంతీకరించాడు. బిడ్డ పుట్టగానే ఏడవకపోతే కొట్టి ఏడిపిస్తారని చెప్పాడు. అక్కడి నుండి అడుగడుగునా బతుకంతా ఏడుపే. మనుషులకు ఏడుపంటే చాలా ఇష్టమని ఆత్రేయ తేల్చేశాడు.
“ఏ కన్నీళ్ల యెనకాల
ఏముందో తెలుసుకో!”
అని కూడా ఆత్రేయే అన్నాడు.

“బాలానాం రోదనం బలం” పిల్లలకు ఏడుపే బలం అని శాస్త్రీయంగా నిరూపణ అయిన సిద్ధాంతమే ఉంది.

“నాకూ అందరిలా ఆశున్నాది…మనసున్నాది…నలుగురిలా కలలు కనే కళ్లున్నాయి…అవి కలత పడితే కన్నీళ్లున్నాయి…” అని మూగమనసుల్లో జమున వెక్కి వెక్కి ఏడ్చింది.

“కాటుక కంటినీరు చనుకట్టుపై పడ ఏల ఏడ్చెదవో?” అని మన పోతన ఏడ్చే సరస్వతీదేవినే ఓదారుస్తూ పద్యం చెప్పాడు.

“నన్ను కదిలించబోకు…నా కళ్లలో అశ్రు జంఝామరుత్తులు గలవు…”
అని కనురెప్పల మాటున దాగిన కన్నీటి సంద్రాలను దాశరథి గాలిబ్ గీతాల్లో దర్శించాడు.

“కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండ నొల్లదు…”
అని ఇంట్లో మహిళ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదన్నాడు సుమతీ శతకకారుడు.

“ఏడ్చే మగవాడిని నమ్మరాదని” తెలుగు సామెత ఏకకాలంలో మహిళలను, మగవారిని ఇద్దరినీ అవమానించింది. మహిళలు ఏడుపుకు బ్రాండ్ అంబాసిడర్లు అనడం ఎంత తప్పో! మగవారు ఏడవకూడదనడం కూడా అంతే తప్పు!

ఇవన్నీ ఏడుపు గురించి సరయిన అవగాహన లేని రోజుల్లో జరిగిన విషయాలు. పుట్టిన మాటలు. ఏర్పడ్డ భావనలు. తాజాగా హార్వర్డ్ విశ్వ విద్యాలయం అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం-

1. ఏడుపు నవ్వు కన్నా చాలా మంచిది. మానసిక ఆరోగ్యానికి అవసరం.
2. ఎలా ఏడవాలో తెలియక, ఏడిస్తే అవమానం అనుకుని ఏడవలేక అనారోగ్యం పాలవుతున్నాం.
3. గుండెల్లో బాధ తగ్గాలంటే ఏడ్చి మొహం కడుక్కుంటే సరి.
4. కల్మషం లేని, వెలితి లేని, చివరి కన్నీటి బొట్టు వరకు రాల్చగలిగిన ఏడుపులు కరువవుతున్న నేపథ్యంలో ప్రొఫెషనల్ గా ఏడుపును నేర్పడానికి కంపెనీలు పుట్టుకొచ్చాయి.

హార్వర్డ్ ఏడుపును పరిగణనలోకి తీసుకుంటే-
1. ఇప్పుడు ఏడుపొక కొత్త కన్నీటి మార్కెట్. కార్పొరేట్ కంపెనీల కన్ను జనం ఏడుపు మీద పడింది.
2. ఇక మన ఏడుపేదో మనం ఏడవడానికి వీల్లేకుండా…ఎలా ఏడవాలో కూడా మార్కెట్టే నియంత్రిస్తుంది.

3. కన్నీళ్ల కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, కన్నీటి డిపాజిట్ల బ్యాంకులు, అద్దెకు కన్నీళ్ల బాటిల్స్, న్యాప్కిన్స్; గుండెలు బాదుకునే కిరాయి విద్యలు ఇక ఏడుపు మార్కెట్లో బజ్ వర్డ్స్.

4. ఏడుస్తూ, ముక్కు చీదుతూ ఉండగా హెచ్ డి, 4కె , 8కె క్లారిటీతో కలకాలం గుర్తుంచుకోదగ్గ ఫోటోలు, వీడియోలు తీయడం మరో కొత్త కొనసాగింపు ఏడుపు వ్యాపారం.
5. “ఓ మై క్రయ్”, “ఇట్స్ మై బ్యూటిఫుల్ క్రయ్” లాంటి హ్యాష్ ట్యాగ్స్ తో ఎవరి ఏడుపును వారు మరచిపోకుండా సెల్ఫీలు తీసుకుని…పదే పదే చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండడమే జాతీయ స్థూల ఆరోగ్య సూచీ అవుతుందేమో!

6. అంతర్జాతీయ యోగా దినోత్సవంలా…అంతర్జాతీయ ఏడుపు వారోత్సవాలు కూడా వస్తాయేమో!

ఇక ఎవరి ఏడుపు వారికి ముద్దు కావాలి.
ఎవరి ఏడుపు వారి ఇష్టం, సొంతం కావాలి.
ఏడ్చి మొహం కడుక్కోవడానికి బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి.
కరువుదీరా ఏడవడానికి పబ్లిక్ పార్కులు కావాలి.
జాతీయ స్థూల ఏడుపు సూచీని ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రకటించాలి.

నవ్వు నాలుగు విధాలా చేటు-
ఏడుపే అయిదు విధాలా మేలు!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

cry online

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions